Sunday, April 8, 2012

ఎండాకాలం

మార్చి అయిపోతుంది అంటేనే, భయం పుట్టుకొస్తుంది. అప్రైసల్  ఇచ్చే సమయం. అప్పటి దాకా మా నుంచి పనిని మాత్రమె ఆశించే మా దొరలు, ఇప్పటి నుండి ఒక నెల రోజులు మా నుండి తప్పులు ఆశిస్తారు. అందుకనే నేను కుడా పని లేకపోయినా బ్లాగు రాయటం తగ్గించా. అలాగైనా, అంతా నేను పని చేస్తున్నాను అనుకుంటారు.

మనిషికి ఎప్పుడూ సుఖాలే ఇస్తే, తననే మర్చిపోతాడని దేవుడు అనుకోని ఎండాకాలాన్నిసృష్టించి ఉంటాడు. అంతటి మహత్తరమైన  ఎండాకాలం రానే వచ్చింది. రెండేళ్లలో మొదటిసారి, వారానికి పది రోజులు కార్యాలయం ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది(చక్కగా ఎ. సి.లో ఉండి ఎండను తప్పించుకోవచ్చు). అప్పటికీ మా దొరగారిని అడిగా, శని ఆదివారాలు కుడా కార్యాలయానికి వస్తాను అని. దానికి ఆయన ఎంతగానో మురిసిపోయి, "నీకు ఐదు రోజులకు జీతం ఇవ్వటమే దండగ, శని ఆది వారాలు కూడా మేపటం కుదరదు" అని ప్రశంసించారు. ఎంచక్కా కార్యాలయాలన్నీ వారానికి చలికాలం నాలుగు రోజులు, ఎండాకాలం ఏడు రోజులు ఉంటే, ఎంత బాగుంటుంది.

పుండు మీద కారం చల్లినట్టు, ఈ ఎండాకాలంలోనే జనాలు తెగ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ సోమ్మేమి పోయింది, రూపాయి పెట్టి ఫోను చేసి, "పెళ్ళికి తప్పకుండా రావాలి, నువ్వు రాకపోతే పెళ్ళిలో ఎవరికీ అప్పడాలు వెయ్యను, సాంబారు పోయను"అని చెప్తున్నారు. ఇందులో రెండు రకాల వాళ్ళు ఉన్నారు. మొదటి రకం వాళ్ళు వారం మధ్యలో పెళ్లి పెట్టుకున్నది కాక, "ముందుగానే చెప్తున్నా, రెండు రోజులు సెలవు పెట్టి మరీ రావాలి " అని ఆప్యాయంగా చెప్తారు. ఇలా అందరి పెళ్ళిళ్ళకి సెలవు పెడితే, రేపు నా పెళ్ళికి సెలవు దొరకని పరిస్తితి వస్తుంది. ఇంక రెండో రకం వాళ్ళని ఏమి చేసిన తప్పులేదు. హాయిగా ఏ బుధవారమో, గురువారమో పెళ్లి అయితే, సెలవు దొరకలేదని తప్పించుకోవచ్చు, ఆ అవకాశం ఇవ్వకుండా, "నీ కోసమే శని, ఆదివారాలు చూసుకొని ముహూర్తం పెట్టించాము, తప్పకుండా రావాలి" అంటారు.    ఇలానే ఒక స్నేహితుడి పెళ్ళికి వెళ్లి, వడ దెబ్బకు వారం రోజులు అడ్డం పడ్డాను. వాడు మాత్రం హాయిగా ఊటీ పోయాడు.

ఎండాకాలం ఎండలతో పోటి పడుతూ చెమట, చిరాకు, విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలు పెరిగాయి. వీటి అన్నింటి కన్నా నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నది, కొబ్బరి బోండాల ధరలు. నవంబరు నెలలో పన్నెండు రూపాయలతో మొదలయిన దాని ప్రస్థానం, జనవరికి పద్నాలుగు, మార్చికి పదహారుగా పెరిగి, ప్రస్తుతానికి ఇరవయి దరిదాపులకి వచ్చింది. ఆ కొబ్బరి బొండాం చూసినప్పుడల్లా, ఆ బొండాం నాతొ ఒక మాట చెప్తుంది. "నాకో కొంచం రేటు ఉంది, కానీ దానికో లెక్క ఉంది" అని. అయినా బొండాలు మాట్లాడటం ఎంటిరా నీ తలకాయి అనుకుంటున్నారా?? ఏమ్చేస్తాం, నా తలకాయంత లేదు, ఇరవయి రూపాయలంటే కొనలేక, అలా అని కొనకుండా ఉండలేక నరకం అనుభవిస్తున్నా, బొమ్మరిల్లులో సిద్దార్థ బాబు లాగా.

అస్సలు ఎండాకాలంలో కొబ్బరి బోండాన్ని మించినది లేదు. అందుకే పూర్వము మన పెద్దలు "సర్వ ఫలానాం నారికేళం ప్రధానం" అని అన్నారు. అర్ధం కాలేదా??? అయితే తెలుగులో చెప్తాను, ఫలం అంటే ఫ్రూట్స్, నారికేళం అంటే కోకోనట్, "అన్ని ఫల్లాలోకి కొబ్బరి ప్రధానం అయినది" అని దానర్ధం. కొబ్బరి గురించి ఎంత చెప్పినా తక్కువే., ఉదాహరణకు తాటి చెట్టు కింద నించొని పాలు తాగినా కల్లు అనే అనుకుంటారు. అదే కొబ్బరి చెట్టు కింద కూర్చొని పురుగులు మందు తాగండి, పాపం పిచ్చి ఎదవ, దాహం వేసి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు అని అనుకుంటారు. నా మాట  అబద్దం అనుకుంటే ప్రయత్నించి చూడండి.

ఇప్పుడంటే ఎండాకాలం అని తిట్టుకుంటున్నాను కానీ, మహేష్ బాబు సినిమా కోసం అమ్మాయిలూ ఎదురు చూసినట్టు, ఆ రోజుల్లో ఎండాకాలం కోసం జూన్ నుంచే ఎదురు చూసేవాళ్ళం, మార్చికి కానీ ఎండాకాలం వచ్చేది కాదు.  ఒంటి పూట మాత్రమె బడి పెట్టేవాళ్ళు. ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు సెలవలు వస్తాయా? అని కలలు కనే వాళ్ళం. ఆ ముచ్చట చెప్పాలంటే, తీరికగా ఇంకో శీర్షికలో కలుద్దాం. అప్పటి వరకు నాకు  అప్రైసల్ బాగా రావాలని, మీరంతా సర్వమత ప్రార్ధనలు లాంటివి చేస్తారని ఆశిస్తూ.., సెలవు ...

15 comments:

  1. all the best

    ReplyDelete
  2. మీ అప్రైసల్ బాగా రావాలంటే ముందుగా మీరు నాకు ఒక కొబ్బరి బొండం ఇప్పించాలి ;) ఎండాకాలం పెళ్ళిళ్ళల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ బాధ! ఎన్ని పట్టు చీరలు మార్చాలి? మీరు మాత్రం ఎండాకాలంలో కాకుండా వేరే కాలంలో పెట్టుకోండి రావడానికి ప్రయత్నిస్తాను మా మాష్టారు ఒప్పుకుంటే! (మీరు పిలిస్తే!) :):)

    ReplyDelete
    Replies
    1. ఒకటేంటి, అప్రయిసల్ కొసం వంద కొబ్బరి బోండాలు ఇప్పిస్తాను. తప్పకుండా నా పెళ్లి ఎండాకాలంలో జరగకుండా చూసుకుంటా., మిమల్ని తప్పక పిలుస్తా, కాకపొతే చదివింపులే కాస్త గట్టిగా ఉండాలి.

      Delete
  3. ఏవో పెళ్లిమాటలు వినపడితేనూ ఇటోచ్చాను. ఇంతకూ ఎప్పుడండీ పెళ్లి..

    ReplyDelete
    Replies
    1. మీరు మంచి పిల్లను వెతికి పెడితే, వెంటనే జరుగుతుందండి. పిల్ల దొరకాలేకానీ పెళ్లి ఎంత సేపు చెప్పండి.

      Delete
  4. MANOVANCHA SIDDIRASTHU... SLOKAM LO EDINA PORAPATU UNTE NUVVE SARI CHESUKOVALI.....

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజా గారు, ఇక్కడ బాష కన్నా భావాన్ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటాను.

      Delete
  5. పెళ్ళికూతురు కావాలంటే" ఇల్లుందా, ఫ్లాటుందా, బేంకు బేలన్స్ ఉందా,స్వంత కంపెనీ ఉందా, లేదా దేశాన్ని అమ్ముకు తినగలిగిన తెలివుందా,BMW కారుందా?

    ReplyDelete
    Replies
    1. చూడబోతే, పెళ్లి కుడా బ్యాంకు లొను లాగా అయ్యింది. ఆ డాక్యుమెంట్ ఉందా? ఈ డాక్యుమెంట్ ఉందా?? అన్నట్టు అన్ని ఆస్తులు కావలంటే పేదవాడిని, ఎదొ చిరు ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను , ఇలా అయితే నా గతి ఏమికాను??

      Delete
  6. turn to east and pray GOD

    ReplyDelete
  7. Appraisal baaga raavalanukovadam.,
    pawan kalyan cinema hit avvalanukovadam.,
    manmohan singh maatalu vinalanukovadam.,
    sachin retire avvalanukovadam..... Anthaa nee bhrama!!!

    "Sarva phalanam naarikelam pradhanam" :D.. Nene "Gelakaku ra gelikevu" lanti kullu saamethalu cheppe vanni, nuvvu naakanteee.... :D

    ReplyDelete
  8. enti mastaru! appraisal ainda mari?

    ReplyDelete
    Replies
    1. daadaapugaa ayipoyindi., ee sari kudaa sharaa maamule, pani ekkuva jeetam takkuva., rekka aadite kaani dokka aaddani batukulu

      Delete