Sunday, May 13, 2012

గోదావరి

ఒక చలనచిత్రాన్ని చూస్తే, మనస్సు తేలిక పడాలి, సేద తీరాలి. ఇతర ఆలోచనలని అన్నింటిని కాసేపు మర్చిపోయి హాయిగా ఆనందింపచేయగలగాలి. నేను చూసిన వాటిల్లో అలాంటి చిత్రం "గోదావరి". ఈ చిత్రం చూసిన ప్రతి సారి, తెలియని సంతోషం కలుగుతుంది.


ఈ చిత్రంలోని పాటల గురించి ముందుగా నేను చెప్పదల్చుకున్నాను. అర ముక్క ఆంగ్లం కూడా  లేని ఆరు అచ్చ తెలుగు పాటలు. వేటూరి గారంటే మాటలా?? అస్సలు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు.


మొదటి పాట, "ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి", అంత  అందంగా బాలు గారు గాక వేరెవరు పాడగలరు? కళ్లు మూసుకొని ఆ పాట వింటే చాలు, ఆ దృశ్యం అంతా కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. "సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోశ్యం, వేసే అట్లు వేయంగానె లాభసాటి భేరం", "ఇళ్లే ఓడలయి పోతున్న ఇంటి పనుల దౄశ్యం", ఇలా ఆ పడవలో జరిగేదంతా వేటూరిగారు కళ్లకు కట్టినట్టు చెప్పారు.      


నాకు నచ్చిన ఇంకో పాట,"అందంగా లేనా? అస్సలేం బాలేనా?"అని సునీత చాలా బాగా పాడింది. నచ్చిన వాడు తనని పట్టించుకోవటం లేదనే విరహంతో ఒక అమ్మాయి పాడుకునే పాటని, చాలా చక్కగా రాశారు గురువుగారు. గురువుగారు అని ఎందుకు అన్నానంటే, నేను వేటూరి గారికి ఎకలవ్య శిష్యుడిని (బొటన వేలు అడగటానికి ఆయన ఇప్పుడు లేరు కదా). గోదావరి ఒడ్డున, చల్లని సాయంత్రాన, ఎకాంత సమయంలో, చాలా చక్కగా తీశారు ఆ పాటను. నా దగ్గరికి అందమైన అమ్మాయి వచ్చి, ఇలా పాడితే ఎంత బాగుంటుందో. గాదావరే అక్కర్లేదు, మూసీ నది అయినా పర్వాలెదు, ముక్కు మూసుకుని నడుస్తా.  


ఇదే చిత్రంలో ఈ రెండిటికన్నా నాకు నచ్చింది, "రామ చక్కని సీతకి"అనే పాట. ఈ పాటను ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు. అస్సలు ఒక పాట రాసేప్పుడు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపించింది. ముఖ్యంగా మొదటి చరణంలో "ఎడమ చేతిన శివుని విల్లును ఎత్తినా ఆ రాముడే, ఎత్త గలడా సీత జడను, తాళి కట్టే వేళలోన", అలానే ఇంకో చరణంలో "ఎర్ర జాబిలి చెయ్యి గిల్లి రాముడేడని అడుగుతుంటే, చూడలేదని పెదవి చెప్పే, చెప్పలేమని కనులు చెప్పే, "నల్ల పూసైనాడు దేవుడు నల్లని రఘురాముడే" అని రాశారు. నిజమే కదా అప్పుడప్పుడు, కళ్లు మాట్లాడతాయి, పెదవులు చూస్తాయి. 

ఈ చిత్రంలో నచ్చిన ఇంకో అంశం, కమలినీ పాపకి గొంతుని అందించిన సునీతగారు. విచిత్రం ఎంటంటే, ఈ చిత్రలో సుమంత్ పేరు " రాం". కొన్ని సన్నివేశాలలో కమలినీ "రాం, రాం "అంటుంటే, ఒక్కోసారి నాకు ఏడుపు వచ్చేది. నన్ను ఏ అమ్మాయి కూడా అంత అందంగా పిలిచిన దాఖలాలు లేవు.

ఈ చిత్రం చూసి నాకు కూడా అలా గోదావరి మీద పడవలో షికారు చేయాలని, స్నేహితులతో కలిసి బద్రాచలం వెళ్లాను. చిత్రంలో చూసిన పడవనే ఎక్కాలి అనుకున్నా. తీరా చూస్తే, నాలుగు చెక్క ముక్కలకి మేకులు కొట్టి దానినే పడవ అని ఎక్కించారు. పదవ లెకపోతే పోయింది, కనీసం అమ్మాయి అయినా దొరికితే బాగుండు అనుకున్నాను. కానీ ఎమిలాభం? దరిద్రుడు ఎక్కడికో పోతే సముద్రం ఎండిపోయిందట! అందమైన పాప కాదు సరి కదా చేప కూడా కనపడక నిరాశతో శేఖర్ కమ్ములాని తిట్టుకుంటూ ఇంటికి వచ్చాను. అక్కడ దిగిన ఫొటోలు మాత్రం ముఖం పుస్తకంలో పెట్టుకోవటానికి పనికి వచ్చాయి.           

ఇక మీదట ఇలాంటి చక్కని పాటలు ఉన్న చిత్రాలు మరిన్ని వస్తాయని ఆశిస్తూ ఈ శీర్షికని ముగిస్తున్నాను. 

8 comments:

  1. అనంత రామయ్య గారు,
    ఈ చిత్రం అంటే నాకూ ఇష్టమే. మేము కూడా ఈ పడవ పడవ ప్రయాణం చేద్దామనుకుంటున్నాం. మీ అనుభవం చూసాక పునరాలోచించాలేమో.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా వెళ్లి రండి, కాకపోతే నా లాగా ఎమీ అంచనాలు పెట్టుకోకండి. పడవ బాగలేకపోయినా, ఆ గోదావరి, పాపి కొండలు తప్పక చూడాల్సిందే ....

      Delete
  2. baga cheppav mastaru.. i love that movie also.. nenu matram ammayilatone aa badrachalam chusi vachanu in the time of 2008.. 20 boys and 6 ladies... we enjoyed alot.........

    ReplyDelete
    Replies
    1. దేనికయినా అదృష్టం ఉండాలి గురువుగారు..,

      Delete
  3. Antha level entoye neeku!!

    -JB

    ReplyDelete
    Replies
    1. అలా అమ్మాయిలు పిలిస్తే బాగుంటుంది కానీ, నువ్వు పిలిస్తే తేడాగా ఉంది జయంత్

      Delete
  4. -- "తనని పట్టించుకోవటం లేదనే విరహంతో" అది విరహం కాదు, విరసం.

    ReplyDelete
    Replies
    1. బాగా ఆలొచించగా చించగా విరహం తప్పనే అనిపించింది, ఒక రకంగా చూస్తే విరసం కూడా నప్పటం లేదు!!! మరి దానిని ఎమంటారో?

      Delete