"ముఖం పుస్తకం" ఇది చాలా మంది జీవితాలలో ఒక భాగం అయిపొయింది. కూడు, నీళ్ళు లేకుండా బతకగాలరేమో కానీ ముఖం పుస్తకం లేకపోతె మాత్రం బతకలేని పరిస్తితి. మొదట్లో బాగానే ఉండేది కానీ, రాను రాను చిరాకేస్తుంది. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. నా స్నేహితులందరూ ఇదే అంటున్నారు. దీనికి గల కారణాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ ఒక్కొకటిగా ఖండించుకుందాము.
బడికి పోయే బుడ్డోళ్ళ దగ్గరి నుంచి, ఈరోజున అందరూ ముఖం పుస్తకం వాడుతున్నారు. వెరసి ఆ పుస్తకాన్ని చిందర వందర చేస్తున్నారు. ముందుగా అమ్మాయిలతో విషయాన్ని మొదలుపెడితే, వీళ్ళు ఏదో ఒక కుక్కపిల్ల బొమ్మనో లేదంటే రోజా పూల బొమ్మలనో పెట్టి వాటికింద, ఎప్పటిలాగే "చో చ్వీట్" అని ప్రచురిస్తుంటారు. ఇంకొంతమంది తమకి తాము సానియా మిర్జా లానో లేదంటే సమంతా లానో ఊహించేసుకుని, రక రకాలుగా హింసిస్తూ ఉంటారు. ఉదాహరణకు, "వర్షం బాగా పడుతుంది , నాకు ఐస్ క్రీం తినాలనుంది" అని అర్ధం కాని ఆంగ్లంలో, ఒక పాప చెప్తుంది. తినాలి అనిపిస్తే కొనుక్కొని తినకుండా, ఇక్కడ అడుక్కోవటం ఎందుకో నాకు అర్ధం కాదు. దానికి మళ్ళీ పోటీపడి ఇష్టపడటాలు (లైక్), వాఖ్యలు( కామెంట్)రాయటం , ఖర్మ కాక ఇంకేమిటి?? అదే నేను, రక్తం ధారపోసి మరీ(ఎవరి రక్తం అని అడక్కండి) నా శీర్షికల గురించి ప్రచురిస్తే పట్టించుకునేవాడే లేడు.
ఇక దినాల సంగతి సరే సరి. తండ్రుల దినం, తల్లుల దినం అని, ఏ దినం ఐతే, ఆ దినానికి తగ్గట్టు " లవ్ యు మామ్" అని బహిరంగంగా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. వాళ్ళ ప్రేమానురాగాలు చూడలేక ఒక్కోసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది కూడానూ. నాకు నచ్చని ఇంకో విషయం, చిన్న చిన్న పిల్లల బొమ్మలతో కొంచం ఇబ్బందికరమైన ( అసహ్యకరమైన) రాతలు రాసి పంపుతుంటారు. ఇంకొంతమంది సాయి బాబా బతికున్నప్పుడు చిత్రం అని పెడుతుంటారు. నేను అరడజను పైగా అలాంటి వాటిని చూశాను. ఒక్కో చిత్రంలో ఒక్కో రకంగా ఉంది. ఎవడో ఒకడికి గడ్డం పెంచి, నలుపు తెలుపుగా (బ్లాక్ & వైట్) ఫోటో తీసినా నమ్మేస్తున్నారు. మంచి జరుగుతుంది అని అందరికి పంపుతున్నారు.
ఎవరైనా చనిపోతే, ఒక రెండు మూడు రోజులు పాటు వాళ్ళకి రిప్పుతూనే ఉంటారు. నేను ఇదివరకు అంతర్జాలంలో అరవోళ్లు లో చెప్పినట్టు, ఇంకొంతమంది పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అన్నట్టు తిపీ తిపీ (తిరగేస్తే) జోకులు/ బొమ్మలు పంపుతూ విరక్తి పుట్టిస్తుంటారు. ఇక శునకానందం గాళ్ళ సంగతి సరే సరి.
ఇంకొక వర్గం గురించి ముఖ్యంగా చెప్పాలి. వీళ్ళు ముఖం పుస్తకం ద్వారా దేశాన్ని కాపాడుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు నాకు భయం వేస్తుంది, వీళ్ళు లేకపొతే మన దేశ పరిస్తితి ఏమవుతుందా అని? దేశం లోని అవినీతి గురించి, వాటిని అరికట్టాల్సిన అవసరం గురించి మనల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంటారు. దానిలో భాగంగానే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేయాలని తెగ ఫోటోలు పంపారు. పాపం ఆయనకు ఈ సంగతి తెలియక కనీసం పోటీ కూడా చేయలేదు.
ఈ మధ్యనే ఇంకో రకం వింత జీవులని చూస్తున్నాను. ముక్కు, ముఖం తెలియని వాళ్ళందరికీ స్నేహ హస్తం చాచి, వాళ్ళందరినీ ఈ పుస్తకంలో కూడుకొని( యాడ్ చేసుకొని) విసిగిస్తుంటారు. ఉన్న వాళ్లనే గుర్తుపెట్టుకోలేక చస్తుంటే, కొత్త కొత్త పరిచయాలతో కూడా ఎక్కడ చావాలి?
ఈ మధ్యనే ఇంకో రకం వింత జీవులని చూస్తున్నాను. ముక్కు, ముఖం తెలియని వాళ్ళందరికీ స్నేహ హస్తం చాచి, వాళ్ళందరినీ ఈ పుస్తకంలో కూడుకొని( యాడ్ చేసుకొని) విసిగిస్తుంటారు. ఉన్న వాళ్లనే గుర్తుపెట్టుకోలేక చస్తుంటే, కొత్త కొత్త పరిచయాలతో కూడా ఎక్కడ చావాలి?
"గంగి గోవు పాలు గరిటడైన చాలు" అని వేమనగారు చెప్పినట్టు, అతి కొంతమంది మాత్రమే చక్కని ప్రతులు ప్రచురిస్తూ ఉంటారు, అవి బొమ్మలు కానివ్వండి, జోకులు కానివ్వండి బాగుంటాయి. ఇక నా లాంటి వాళ్ళు, తాము రాసిన చెత్త చదవటం జనాలు ఎక్కడ మర్చిపోతారో అని ముఖం పుస్తకంతో గుర్తు చేస్తూ ఉంటారు. ఎవ్వరూ ఏదీ చేయకూడదు అంటే ఎలా అని తిట్టుకోకండి. తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికే ఉండదని అంటారు కాదా, అలవాటు చప్పున రాసేశా. నాకు తెలిసీ ఈ ముఖం పుస్తకం ఇంక ఎక్కువ కాలం మనుగడ సాగించదేమో ?? ఆర్కుట్ ఉసురు దీనికి ఖచ్చితంగా తగులుతుంది. ఇదే విషయాన్ని మా బామ్మర్దితో అంటే, "నాకు అస్సలు ముఖం పుస్తకంలో అకౌంట్ లేదు", అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇవాల్టి రోజున ప్రతి కుక్క దీనిని వాడుతున్నదాయ!!