"మధ్యతరగతి టూత్ పేస్ట్", మీరు చదివింది నిజమే. మధ్యతరగతి టూత్ పేస్ట్ అంటే అదేదో తక్కువ రకం టూత్ పేస్ట్ అని నా ఉద్దేశ్యం కాదు. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు, కారం, గసగసాలు, గోరింట ఉన్నంత మాత్రాన అది ఎగువ తరగతి అని కాదు. ముందు మీరు 'ఆమె' సినిమాలోని ఈ వీడియో చూసి , మళ్ళీ ఇక్కడకు రండి.
ఇప్పుడు అర్ధం అయ్యి ఉండాలి మధ్యతరగతి టూత్ పేస్ట్ అంటే ఏమిటో? పేస్టుని వేస్ట్ చేయకూడదు. పేస్టుని ప్రసాదంలా వాడుకోవాలి. ప్రతి రోజు బఠాణీ అంత టూత్ పేస్ట్ తో పళ్ళు తోముకోమని దంత వైద్యులు సలహా. కానీ మనకు ప్రకటనల్లో అంతకు అయిదారు రెట్లు వేసుకోమని చూపిస్తుంటారు. మొదట్లో అయిదారు రేట్లే వేసుకుంటాము. ట్యూబ్ చివరికి వచ్చే సరికి, దానిని తొక్కి పెట్టి నార తీస్తాం. అదో మధ్య తరగతి ఆర్టు.
చిన్న వయస్సులో అలా ట్యూబ్ చివరికి వచ్చాక, నేను ఎంత పిండినా, నా చిట్టి చేతుల బలానికి ఆ పేస్టు బయటకు వచ్చేది కాదు. మా నాన్నగారో, అమ్మగారో పేస్టు వేస్తే కానీ పళ్ళు తోముకోలేక పోయేవాడిని. అప్పట్లో పళ్ళు రెండు పూట్ల తోమాలి అన్న రూలు లేదు కాబట్టి, ఒక్క పేస్టు ట్యూబ్ ఎక్కువ రోజులే వచ్చేది కాబోలు. మూత కూడా సన్నగా ఉండేది. ఈ మధ్య వచ్చే వాటికి మూత చాలా పెద్దదిగా ఉండటం, పేస్ట్ కంపెనీల దోపిడీ తత్వానికి నిదర్శనం.
మధ్య తరగతి మీద ఎలాగైనా గెలవాలి అన్న తాపత్రయం వాళ్ళది. కార్పొరేట్ కంపెనీలు, అవి తయారు చేసే వస్తువులపై కన్నా, అవి కొనే మనుషుల మీద బాగా పరిశోధనలు చేశాయి. ఇలాంటి విషయాల గురించి చాలా పుస్తకాలే ప్రచురితం అయ్యాయి. ఎలాంటి వస్తువులను ఎలా, ఎక్కడ, ఎంతకు అమ్మితే, ఎక్కువ కొంటారో వారికి బాగా తెలుసు. అలాంటి కంపెనీల కారణంగా, మనం వాడే వస్తువులలో చాలా వరకు, వాటి సామర్ధ్యం ఇంకా మిగిలి ఉన్నా కూడా, కొత్తగా వచ్చిన వాటిని కొంటున్నాము. కాదు మనం కొనేలా చేస్తున్నాయి. లేదా మన అవసరానికి మించి వస్తువులను వాడుతున్నాం అనిపిస్తున్నది (అవసరానికి , స్థోమతకు తేడా గమనించగలరు. స్థోమత ఉన్నంత మాత్రాన అవసరం ఉందని కాదు)
సెల్ ఫోనులు, కారులు, టి.వి లు లాంటివి కొన్ని ఉదాహరణలు. 2010 లో కొన్న ఫోను, 2019 వరకు పని చేస్తుంది. కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఫోను మారుస్తాం. టి.వీలు కూడా అలానే మారుస్తూ ఉంటాం. మన మధ్య తరగతి టూత్ పేస్ట్ చెప్పిన పాఠాన్ని మనం మర్చిపోతున్నాం అనిపిస్తున్నది.
ఈ పైనున్న ఫోటోను చూస్తే నాకు రెండు విషయాలు గుర్తుకు వచ్చాయి
- 'If it ain't broken, don't fix it' అన్న విషయాన్ని కొద్దిగా మార్చి, 'If it ain't broken, don't replace / buy it', అని ప్రతి విషయంలో గుర్తు పెట్టుకోవాలి.
- 'Take only what you need, not what you want' - ఎంత అవసరమో అంత వాడాలి, ఎంత కావాలో అంత కాదు.
చివరిగా, జీవితం అనేది మధ్యతరగతి టూత్ పేస్ట్ ట్యూబ్ లాంటిది. మొదట్లో చాలా జీవితం ఉందనుకొని విచ్చలవిడిగా ఖర్చు పెడితే, చివరకు వేళ్ళు నొప్పులు పుట్టేలా పిసుక్కోవాలి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
నేను పళ్ళు తోముకునే సమయం అయ్యింది, పోయి పేస్ట్ పిసికే పనిలో ఉంటా....
ముఖ్య మనవి : ఇది ఎదో తోచక రాసుకున్న సోది. దీనిని ఇక్కడితోనే వదిలేయండి. ఈ చెత్తంతా whatsapp లో కాపీ అయ్యి , అది చివరకు ఎవరూ పట్టించుకోని ఫామిలీ గ్రూపులలో తిరిగటం నాకు ఇష్టం లేదు.