Saturday, November 17, 2012

సారధి

ప్రపంచంలో ఉద్యోగాలు అన్నింటి కన్నా ప్రమాదకరమైన ఉద్యోగం ఏంటి?(నాతో కలిసి పని చేయటం కాకుండా?). నాకు తెల్సి దీనికి సమాధానం, బస్సు డ్రైవర్, అతన్నే తెలుగులో "సారధి" అంటారు. మిగితా ఉద్యోగాలన్నింటిలో, ఎప్పుడైనా అలసట అనిపిస్తే, ఒక పది నిముషాలు కునుకు తీయచ్చు. అదే ఉద్యోగం చేస్తూ చేస్తూ, బస్సు సారధి ఒక్క కునుకు తీస్తే...., ఊహించండి, ఎంతటి ప్రమాదం అయినా జరగచ్చు. 

శుక్రవారం సాయంత్రం, కూకట్ పల్లి నుండి అద్దంకి వెళ్ళాలని టికెట్ తీసుకున్నాను. దీపావళి సమయం అవ్వటంతో రద్దీ కొంచం ఎక్కువగా ఉంది. పదిన్నరకు బస్సు అయినప్పటికీ, పని పాటా లేకపోవటంతో, పది గంటలకే బస్టాండ్ కి వెళ్ళాను. ఏ అర్ధరాత్రో అయితే కానీ రాని బస్సు, నేను వెళ్ళేసరికి సిద్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. ఐ.ఆర్.సి.టి.సిలో టికేట్టు దొరికినంత సంబరమేసింది.

బస్సు అయితే ఉంది కానీ, అందులో జనం ఎవ్వరూ లేరూ. కాసేపటికి డ్రైవర్ వచ్చాడు. నా టికెట్ చూపించాను. రాత్రంతా ఎలాగూ కూర్చోవటం తప్పదని, బయటే నిలబడ్డాను. ఇంతలోనే అక్కడ ఎక్కాల్సిన మిగిలిన జనం కూడా వచ్చేశారు. బస్సు కదులుతుండగా ఎక్కి లోపలకి వెళ్ళబోతుంటే, డ్రైవర్ అమాయకపు చూపులు నా వీపును తడిమినట్టు అనిపిస్తేను, నేను కూడా చూశాను. బలపం పోగొట్టుకున్న బడికెళ్ళే బడుద్దాయిలాగా ముఖం పెట్టి, "అమీర్పేట్ కి ఎటు వెళ్ళాలి?" అని అడిగాడు.  

అమీర్ పేటకి ఎటు వెళ్ళాలి అని అడుగుతున్నాడు? అద్దంకి చేరుస్తాడో,ఆంధ్ర ప్రదేష్ దాటిస్తాడో అని భయమేసింది. "కండక్టర్ కి కూడా తెలియదా?" అని అడిగాను. "కండక్టరు అనే వాడు ఉంటే కదా? నేను ఒక్కడినే" అని చెప్పాడు. (సింహాలే కాదు డ్రైవర్లు కూడా ఈ మధ్యన సింగిల్ గా వస్తున్నారెమో ?) చేసేది లేక ద్వారం దగ్గర ఉండే కుర్చీలో కూర్చున్నాను. " అమీర్ పేట నుంచి అయినా దారి తెలుసా??" అని అడిగాను. హైదరాబాద్ దాటిందాకా దారి తెలియదని చల్లగా చెప్పాడు. ఇక, ఆ పూటకి ఆ బస్సుకి నేనే కండక్టర్ అయ్యాను. మంత్రసాని పని ఒప్పుకున్నాక ...... తప్పదు కదా " అనట్టు, ఆగిన ప్రతి చోటా, బస్సులో ఎంత మంది ఎక్కాలో సరి చూసుకుంటూ, రాని వాళ్ళకి ఫొన్లు కూడా చేశాను. అప్పుడు తెలిసొచ్చింది, కండక్టర్ అవసరం ఏంటో.

చిన్నప్పుడు నేను బడికి వెళ్ళాలంటే, బస్సులో పది కిలోమీటర్లు ప్రయాణం చేసేవాడిని. మాకు అందరికీ ఉచిత పాసులు ఉండటం చేత,  మమల్ని ఎక్కించుకోనేవారు కాదు. సాయంత్రం బడి ముందు బస్సు కోసం గంట సేపు నిలబడితే, తీర వచ్చిన బస్సు, ఆగకుండా వెళ్ళిపోయేది. బస్సు ఆపనందుకు మొదట్లో డ్రైవర్ల మీద చాలా కొపం వచ్చేది. కానీ కొన్ని రోజులకు గమనించినది ఏంటంటే?  బస్సుకు డ్రైవర్ అనేవాడు సారధి కాదు, కేవలం బస్సుకి, కండక్టర్కి మధ్య వారధి మాత్రమె అని, నిజమైన సారధి కండక్టర్ అని. అతను ఎక్కడ చెప్తే, డ్రైవర్ బస్సు అక్కడ ఆపాలి అని. కష్టపడి బస్సు నడిపేది ఒకళ్ళయితే, పెత్తనం ఇంకొకళ్ళదా? అని జాలి పడేవాడిని.  

ముగించే ముందు, చాలా రోజుల తర్వాత ఈ రామానంద స్వామి చెప్పేది ఏంటంటే, సంసారం అనే బస్సులో మొగుడు సారధి(డ్రైవర్) అయితే, పెళ్ళాం సాధించె  కండక్టర్ లాంటిది. కండక్టర్ చెప్పినట్టు సారధి విని తీరాలంతే.



Sunday, November 4, 2012

విశ్వనాధం


నిన్న తోచక టి.విలో చానెళ్ళు మారుస్తుంటే, "మౌనమేలనోయి, ఈ మరపురాని రేయి" అనే పాట వస్తున్నది. మొదలే నేను భాను ప్రియ అభిమానిని, అమె చిత్రాలు విడుదల అయిన మొదటి రోజే చూసేవాడిని (ఎదో మాట వరసకు అన్నాను కానీ, నేను పుట్టాక ఆమె తెలుగులో నటించటం ఆపేసింది). భాను ప్రియ పాట కావటంతో ఆ పాటలో లీనం అయ్యి చూస్తున్నాను. చివర్లో తెలిసింది ఏంటంటే ఆమె పేరు భానుప్రియ కాదు, జయప్రద అని. పేరు ఎదైతేనేమి? మనకు మనిషి ముఖ్యం.

ఆ పాటలో జయప్రదను చూశాక, చాలా రొజుల తర్వాత 'ఒక అందమైన అమ్మాయిని చూశాను' అన్న అనుభూతి కలిగింది. ఇవాళ్టి రోజున "అమ్మాయిలం" అని కొంతమంది చెప్తే తప్ప, వాళ్ళు అమ్మాయిలని అర్ధం కాని పరిస్థితి. ఒక రాతి రధం పక్కన, కమల్, జయలిద్దరూ  ఒకరినొకరు దొంగ చూపులు చూసుకుంటూ ఉంటారు. కమల్ తనని చూస్తే జయ తల పక్కకు తిప్పుకుంటుంది, జయ చూస్తుంటే కమల్ తల పక్కకు తిప్పుకుంటాడు. ఆ దృశ్యం చాలా తమాషాగా అనిపించింది. బహుశా అలా తలలు తిప్పీ తిప్పీ నొప్పి పుట్టిందేమో, ఇద్దరూ కలిసి జయప్రద ఇంటికి బయలుదేరుతారు.   

ఇక్కడే ఒక చిన్న దృశ్యం నన్ను కట్టిపడేసింది. జయప్రద ఇంటికి చేరాక, ఆమె నాలుగు మెట్లు ఎక్కి వెనక్కి తిరిగి చూస్తుంది, ఒక అడుగు వెనక్కి వేస్తూ. కమల్ "నేనింక ఇంటికి వెళ్తాను" అనట్టు తల ఊపుతాడు. కమల్ ని కూడా ఇంట్లోకి పిలవాలని ఉన్నా, పిలవలేక, ఎదో చెప్పాలని నోరు తెరిచి, చెప్పలేక ఆగి పొతుంది. "అప్పుడే ఇంటికి వెళ్తావా?" అన్నట్టు జయప్రద ఇచ్చిన ఆ ముఖ కవళిక నిజంగా అధ్బుతం అనిపించింది. అప్పుడు అర్ధం అయ్యింది, విశ్వనాథ్ గారిని అంత గొప్ప దర్శకుడని ఎందుకు అంటారో!!!! ఆ ఒక్క ఐదు క్షణాల దృశ్యం కోసం, ఆ పాటని యూట్యూబ్ లో ఎన్ని సార్లు చూశానో.   

అప్పటిదాకా అంత చక్కగా చూపించి,ఆ వెంటనే జయప్రద తన్మయత్వంతో స్నానం చేసే దృశ్యాన్ని చూపించారు(అలా చూడటం తప్పని కళ్ళు మూసుకున్నాను). విశ్వనాథ్ గారు ఇలా ఎందుకు తీశారో అని అనుమానం కలిగింది. ఇదే విషయాన్ని మా సుబ్బన్నని అడిగితే " ఆయన దర్శకత్వం చేస్తుంటే, కమల్ ఎమైనా వేలు పెట్టాడెమో ?" అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ రొజుల్లొ కధానాయకులకు అంత స్వేఛ లేకపొబట్టేనేమో, కొన్ని అయినా మంచి చిత్రాలు తీయగలిగారు. 

మళ్ళీ పాటలోకి వద్దాం. ఆ పాటలొ జయప్రదని ఎంత అందంగా చూపించారో!! "సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట" అంటూ వెనెల్లో జయప్రదను పువ్వుతో పోల్చిన తీరు నాకు బాగా నచ్చింది. పాట చివరకు జయప్రద సొఫాకు తలాంచి కూర్చున్న భంగిమ ఎంత చూడముచ్చటగా ఉంటుందో మాటలతో చెప్పలేను. పాట అంతా చూశాక అనిపించింది ఏంటంటే? ఈ పాటను మళ్ళీ ఎవ్వరూ తీయకూడదు అని. జయప్రద స్నానం చేసే సన్నివేశంలో కూడా అశ్లీలత అనిపించకుండా, కనిపించకుండా తీయటం బహుశా విశ్వనాథ్ గారికే చెల్లిందేమో? ఈ పాట ఈ రొజుల్లొ తీస్తే కళ్ళు మూసుకొని చూడాల్సి వస్తుందేమో అని నా అనుమానం.

ఇంతా చెప్పి మా గురువుగారి గురించి ప్రస్తావించక పొతే మహా పాపం. "పలికే పెదవే ఒణికింది ఎందుకో? ఒణికే పెదవి వెనకాల ఏమిటో?" ఇంత సుందరంగా వేటూరి సుందరరామూర్తి గారు గాక ఇంకెవరు రాయగలరు? జానకిగారు, బాలుగారు గాక ఇంకెవరు పాడగలరు? ఇళయరాజ గురించి వేరే చెప్పేదేముంది?   విశ్వనాథ్ గారి గురించి చెప్పాలనుకుంటే, ఒక్క పాటతోనె సరిపోయింది. ఇంకో శీర్షికలో ఇదే విషయం మీద కూర్చుందాము. అంత వరకు సెలవు.......

Wednesday, October 31, 2012

మూడో అడుగు

అక్టోబరు 31 2010, మొదటి సారిగా నేను బ్లాగిన రోజు. ఈ బ్లాగు రాయటం మొదలెట్టి రెండు సంవత్సరాలు అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. ఇది వరకే ఆరంభ శూరత్వంలో చెప్పినట్టు, నాకున్న ఆరంభ శూరత్వానికి రెండేళ్ళ పాటు రాస్తాను అని అనుకోలేదు.రెండేళ్ళలో ఇప్పుడు రాస్తున్న దానితో కలిపి ఎనభై రెండు టపాలు. అంటే శతకానికి చాలా దగ్గర అనమాట!!!

ఎన్ని రాశానన్న దానికన్నా, ఎంత రాశానన్న దానికన్నా, ఎమి రాశానో చూసుకుంటే సంతృప్తిగానే అనిపిస్తుంది. నేనేదో "ఆంధ్ర మహాభారతాన్ని" తెలుగులోకి రాసినట్టు చెప్తున్నానని మీకు అనిపిస్తే క్షమించాలి. ఈ సంధర్భంగా, నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు, శిష్యులందరికీ అశీస్సులు తెలియజేసుకుంటున్నాను.  ఈ బ్లాగు ద్వారా కొన్ని పరిచయాలు, స్నేహాలు ఎర్పడ్డాయి. జయంత్, కృష్ణా, నాగార్జున ఇలా..., చాలా మంచి స్నేహితులు ఏర్పడ్డారు.

మీకు ఈ సందర్భంగా ఒక శుభవార్త చెప్పాలి. ఇక మీదట నేను శీర్షికలు రాయటం ఆపేస్తున్నాను అనుకుండేరు!! అదేమీ కాదు. తొండ ముదిరి ఊసరవల్లి అయ్యినట్టు, చిన్న చిన్న శీర్షికలతో మొదలుపెట్టి, నవల రాసే దాకా వచ్చాను. రెండు మూడు నెలలు కింద, పైన కూర్చొని ఎలాగోలా ఒక నవల పూర్తి చేశాను. 

ఒక సాఫ్ట్ వేర్ కార్యాలయంలో, కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కధను, నాకు తోచినంతలో చూపించే ప్రయత్నం చేశాను. వంద కాగితాలకు సరిపడా రాశాను. తీరా రాశాక అనుమానం వచ్చింది, అస్సలు ఇది ఎవరికైనా అర్ధం అవుతుందా? అని. ఇద్దరు, ముగ్గురు స్నేహితులకు చూపించాను. వాళ్ళు మొహమాటం కొద్దీ అద్భుతంగా ఉందని కాకుండా నికచ్చిగా కొన్ని మార్పులు చెప్పారు. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చివరకు కధను ఒక కొల్లిక్కి తెచ్చాను. ఇంకొ నెల రెండు నెలలలొ దానిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ నవల చదివాక, అందరూ నన్ను "నవలా రచయిత అనంతరామయ్య" అని పిలవటం మాత్రం మర్చిపోకండే!!!!

ఈ బ్లాగు రాయటంలో మూడో అడుగు వేస్తూ.... సెలవు