జీవితం గురించి మీకు కొన్ని గొప్ప సత్యాలు చెప్పాలని ఈ రోజు ఈ రామానంద స్వామి నిర్ణయించుకున్నాడు. అస్సలు జీవితం అంటే ఏంటి?
ఉద్యోగం వస్తుంది. నాలుగు రాళ్ళు సంపాదించి, నాలుగు సంవత్సరాలు దాటితే పెళ్లి చేస్తారు. చేశారు కదా అని సరిపెట్టుకోకుండా పిల్లల్ని కనాలి. వాళ్ళని పెంచి పెద్ద చేయాలి. వాళ్ళని బడిలో చేర్చాలి. ఎక్కువ మార్కులు, తక్కువ ర్యాంకులు వచ్చేలా చూడాలి. ఆ పిల్లలికి కూడా ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి పెళ్లిలు చేయాలి. ఇంతలోపు ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి. మొత్తానికి జీవితం అంటే ఇది అని మనోళ్ళు బాగా అర్ధం చెప్పారు.
సాదారణంగా మనకు ఖర్చు పెట్టాలి అన్నప్పుడు సంపాదన ఉండదు. సంపాదించే అప్పుడు ఖర్చు పెట్టే సమయం ఉండదు. కుకట్ పల్లిలో నుంచొని కోఠి వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి ఖచితంగా సికింద్రాబాద్ వెళ్ళే బస్సు వస్తుంది. నిజంగా చెప్పాలంటే కోఠి వెళ్ళే బస్సు తప్ప మిగితా దారుల్లో వెళ్ళాల్సినవన్నీ వస్తాయి. ఇదే జీవితం అంటే. మనం కోరుకున్నది మనకు దక్కదు. మనకు దొరికింది మనకి నచ్చదు. మళ్లీ నిజం చెప్పాలంటే మనకు దొరికింది తప్ప మిగిలినవన్నీ మనకు నచ్చుతాయి.
ఉదాహరణకు మా ఊర్లో గుప్త అని నా స్నేహితుడొకడు ఉన్నాడు. వాడు ఎప్పుడూ "మీకేమిరా, హైదరాబాద్లో హాయిగా ప్రతి నెల ఒకటో తారీకు పాతిక వేలు తీసుకుంటారు. మా భాదలు మీకేమి తెల్సు?" అని అంటుంటాడు. కానీ నిజానికి వాడు నెలకి నాకన్నా పదింతలు అలవోకగా, చొక్కాకి చెమట పట్టకుండా సంపాదిస్తాడనే విషయం మా ఊరిలో కుక్కకి కూడా తెలుసు. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, హాయిగా ఊరికి పోయి ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని. ఇదే జీవితం.
సాదారణంగా మామిడి కాయలు ఏ కాలంలో వస్తాయి? ఎండాకాలంలో, మండుటి ఎండకు రోకళ్ళు పగిలే సమయంలో కదా! ఆ వేడికి తోడు మామిడి కాయలు తింటే ఇంకా వేడి చేస్తుంది. అలాగని తినకుండా ఉండగలమా? తిని ఆ వేడికి విరుగుడుగా మజ్జిగ తాగుతాం. ఎండాకాలం మజ్జిగ దొరకటం కూడా కష్టం, ఇది ఇంకో సమస్య. ప్రతి ఎండాకాలం నాకు ఎదురయ్యే సమస్యల్లో ఇది ఒకటి.
ఇలానే నాలుగేళ్ల క్రితం ఒకసారి ఎండాకాలంలో అతిగా మామిడి కాయలు తిన్న పుణ్యం చేత నోరంతా పూసింది. రెండు రోజులు నోరు తెరవాలన్నా మంట పుట్టింది. ఆ దెబ్బకు మామిడి అన్న మాట వింటేనే మండుకొచ్చింది. కాలేజికి వెళ్లి సాయంత్రం అయిదు గంట కొట్టేసరికి ఇంటికి వచ్చాను. నోరు పూసిన కారణం చేత మధ్యాహ్నం సరిగ్గా భోజనం చేయక బాగా ఆకలి వేస్తుంది. ఎండాకాలం మామిడి కాయలు రావటం చేత, ఇంట్లో అప్పుడే ఆవకాయ పచ్చడి తయారు చేస్తున్నారు. ఎర్రగా ఆ ఆవకాయని చూస్తే ఎవరికి నోరు ఊరదు చెప్పండి. వేడి వేడి అన్నంలో కాస్త ఆవకాయ, నెయ్యి కలిపి తింటే....... అబ్బో అబ్బో., కానీ నోరు పూసింది గనుక, చేసేది లేక నిరాస, నిస్పృహలతో , ఆకలిరాజ్యం చిత్రంలో కమల్ బాబు లాగా, మంచి నీళ్ళు తాగి కడుపు నింపుకున్నాను.
మంచినీళ్లతో కడుపు నింపుకుని ఉసూరుమంటూ రేడియో పాటలు విందామని కూర్చున్నాను. "పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా" అనే పాట వచ్చింది. అసలే నోరు పూసి ఆవకాయ చూసి నేనేడుస్తుంటే ఈ పాట ఒకటి
పూసింది పూసింది నోరంతా
వాచ్చింది నా ఎడమ చెంపంతా --(2)
అవకాయి ముక్కలనే ఆ ముక్కలనే
చూస్తే నోరూరే ........
ఇప్పటికే జీవితం గురించి చాలా ఎక్కువ చెప్పేశాను(ఆవకాయ గురించి చెప్పి, జీవితం అంటావే అని కసురుకోకండి ) ఇంతకన్నా చెప్తే మీరు అర్ధం చేసుకోలేరు. మరో శీర్షికలో జీవిత సారం మీద ఈ ప్రవాహాన్ని కొనసాగిస్తా. అంత వరకు ఈ రామానంద స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్తూ ... సెలవు ..
--- సశేషం -----
అవకాయి ముక్కలనే ఆ ముక్కలనే
చూస్తే నోరూరే ........
ఇప్పటికే జీవితం గురించి చాలా ఎక్కువ చెప్పేశాను(ఆవకాయ గురించి చెప్పి, జీవితం అంటావే అని కసురుకోకండి ) ఇంతకన్నా చెప్తే మీరు అర్ధం చేసుకోలేరు. మరో శీర్షికలో జీవిత సారం మీద ఈ ప్రవాహాన్ని కొనసాగిస్తా. అంత వరకు ఈ రామానంద స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్తూ ... సెలవు ..