నిన్న గుంటూరులో, హిందీ చిత్రాన్ని, తమిళంలో తీసి, తెలుగులోకి అనువదించిన ''స్నేహితుడు''అనే చిత్రాన్ని చూశాను. ఆ చిత్రాన్ని హిందీలో అక్కడక్కడ చూశాను కానీ పెద్దగా అర్దం కాలేదు. నిన్న ఆ చిత్రాన్ని తెలుగులో చూశాక, నేను ఇంజనీరింగ్ చదివిన రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా ఆ చిత్రంలో "సైలెన్సర్" అనే పాత్ర, మా రావికాముగాడికి చాలా దగ్గరగా ఉంది. చిత్రం చూస్తున్నంత సేపు వాడే గుర్తొచ్చాడు. కదానాయకుడిని చూసినంత సేపూ, నన్ను నేను చూసుకున్నట్టే ఉందంటే నమ్మండి.
నా జీవితంలో కుడా ఇంజనీరింగ్ చదివిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆ చిత్రంలో చూపించినంత కాకపోయినా ఒక మాదిరిగా గడిచింది. ఆ సినిమాలో చెప్పినట్టు, ఇప్పటి రోజుల్లో కళాశాలలన్నీ మార్కుల మీద ర్యాంకుల మీద కుస్తీ పడుతున్నాయి తప్ప నా లాంటి ఆణిముత్యాలని తయారు చేయాలని ఒక్కళ్లు కుడా ప్రయత్నించటంలేదు. ఇప్పుడు నడుస్తున్న కళాశాలలో సగం ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం కట్టినవి, మరి కొన్ని జనాల దగ్గర డబ్బులు దండుకోవటానికి పుట్టినవి. అసలు పాఠాలు చెప్పే వాళ్ళకే (అందరు కాదు కొందరు), ఏమీ చెప్తున్నారో, దేని కోసం చెప్తున్నారో తెలియదు. ఏదో బుక్కున ఉన్నదానిని ముక్కున పట్టుకొని ఠక్కున పిల్లల ముందు కక్కుతున్నారు.
అస్సలు విషయానికి వస్తే, ఈ చిత్రంలో, "ఇంట్లో ఏది చెబితే అది కాకుండా,
మనస్సు ఏది చెబితే అది చేయాలి" అని సందేశం ఇచ్చారు. మరి ఆ రోజుల్లో నా
మనస్సు నాకేమి చెప్పింది? అని బాగా ఆలోచించాను. ఏదో గొఱ్ఱెల మందలో, సాటి గొఱ్ఱెలతో పోటీగా ఒకే దారిలో పరిగెత్తాలన్న ఆలోచన తప్పించి, అస్సలు వేరే దారులు ఉంటాయి అనే స్పృహ కుడా లేకుండా పోయింది.
నిజానికి నాకు నా మనస్సు ఏమీ చెప్పలేదు. నా మనస్సు చెప్పిందల్లా ఏంటంటే "బాగా చదువు. మార్కులు రాకపోతే ఇంట్లో బామ్మ దగ్గర నుంచి వీదిలో బుడ్డోడి దాక అందరికీ సమాధానం చెప్పాలి" అని. మనందరికీ అస్సలు మన
మనస్సు ఏది కోరుకుంటుందో? మన మనస్సుకి ఏది కావాలో, ఏది వద్దో ఆలోచించే సమయమే ఉంటే, ఆ సమయంలో ఇంకో రెండు ఎంసెట్ ప్రశ్నలు చదివించే వారు. పదో తరగతిలో 500 రావాలి, తరువాత మంచి ఎంసెట్ ర్యాంకు రావాలి, తరువాత ఇంజనీరింగ్ లో మంచి మార్కులు, ఆ పైన మంచి s/w కంపెనీలో కంప్యుటర్ ఇంజనీర్ అవ్వాలి. ఇది కాకుండా ఇంకో ఆలోచన కుడా రాకుండా రుద్ది పారేశారు. అస్సలు ఉద్యోగమంటే కంప్యుటర్ ఇంజనీర్ ఒక్కటే అనట్టు పెరిగాము. అంతేలే...., ఎంత కాదన్నా
చరణాలు ఎన్ని ఉన్నా రామచరణ్ ఒక్కడే కదా
కిరణాలు ఎన్ని ఉన్నా కుమార్ రెడ్డి ఒక్కడే కదా
జిల్లాలు మారినా ఓదార్పు మారునా??? మధురమే సుధా గానం .........
చివరకు ఇప్పుడు ఆ చిత్రం చూసి, జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, పరిస్తితి బాగా చీకేసిన ఐస్ పుల్ల లాగా, మామిడి టెంకెలాగా మిగిలాము అనిపిస్తుంది. నేను ఇది వరకు చెప్పినట్టు చివరకి ఇలా బ్లాగులు రాసుకొని బాదపడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. పోనీ ఇప్పుడు ఏదైనా చేయాలంటే, ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. ఇకనో ఇప్పుడో పెళ్లి అని కూడా అంటున్నారు. ఇక ఈ శేష జీవితాన్ని ఆ కంప్యూటర్లతో, కంపు పట్టే బ్లాగులతో గడిపేయటమే.
ఇక చేసేది ఏమీ లేక, నిజం చెప్పాలంటే చేతగాక దానిని కప్పి పుచ్చుకోవటం కోసం అని, "జీవితం మన చేతుల్లో లేదు, అది ఎటు నడిపిస్తే అటు పోవటమే అని" వేదాంతం చెప్పుకోవటమే. కాని జీవితంలో సాదించాలన్న కసి, పట్టుదలతో పాటు, ఈ రామానంద స్వామి ఆశీస్సులు కుడా ఉంటే ఎన్ని అడ్డంకులు ఉన్నా ఏదో ఒకరాజు మనం కోరుకున్న తీరానికి తప్పకుండా చేరుతాము! తప్పకుండా చేరుతాము!