Saturday, August 25, 2012

దేవుడిని చూశాను

దేవుడిని చూశాను. అవును ఇవాళ నేను దేవుడిని చూశాను. ఊహ తెలిసిన రోజునుండి కలలు కంటున్నరోజు, రానే వచ్చింది. క్రికెట్ అనేది ఒక మతమైతే, ఆ మతానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆ దేవుడినే ఈ రోజు నేను కళ్ళారా చూశాను . నాకు చిన్నప్పటి నుండి, ఇద్దరిని చూడాలనే కోరిక ఉంది. ఒకటి గాన గంధర్వుడిని, రెండు క్రికెట్ దేవుడిని. ఈ రోజుతో ఆ రెండు కోరికలు తీరాయి.

నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో, మా ఊరి పంచాయితీ కార్యాలయం ముందు, మహానుభావుడు ఘంటసాల గారి విగ్రహం పెట్టాలన్న మంచి ఆలోచన కొంత మందికి వచ్చింది. అనుకున్నదే తడవుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక చేతిలో తంబురా (నాకు తెల్సినంతలో దానిని తంబురా అనే అంటారు), ఇంకొక చేతిని పైకి లేపి, గాన మాధుర్యాన్ని కురిపిస్తూ, కూర్చొని ఉన్న ఘంటసాల వారి విగ్రహం, చాలా అందంగా, సాక్షాత్తు ఆయనే కూర్చొని పాడుతున్నడా అనట్టు ఉంటుంది. పక్క ఊరి తాగుబోతులు ( మా ఊర్లో తాగేవాళ్ళు అస్సలు లేరు, నిజం) ఆ విగ్రహాన్ని చూస్తే , అక్కడే నిలబడి విగ్రహాన్ని పాట పాడమని గొడవకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి (కొంచం ఎక్కువ చేసి చెప్పినట్టు ఉన్నా, ఆ బొమ్మ మాత్రం అధ్బుతం).

ఆ విగ్రహాన్ని ఆవిష్కరించటానికి సాక్షాత్తు బాలూగారే వస్తున్నారని తెలిసి, నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ రోజు రానే వచ్చింది. బాలూ గారు విగ్రహం ఆవిష్కరించి, మా ఊరిలోని కళాసాగర్ ప్రాంగణంలో జరిగే సంగీత విభావారికి వచ్చారు. ఇసుకేస్తే రాలని జనం. అప్పటికే బాలుగారు నాకు చాలా బాగా తెలుసు గనుక, బాలు గారు వేదికను అలంకరించగానే ఆయనను గుర్తుపట్టాను. నా కళ్లను నేను నమ్మలేకపోయాను. బాలూ ఫారు శంకరాభరణం చిత్రంలో "శంకరా నాదశరీరాపరా..." అనే పాడటం, నేను జన్మలో మర్చిపోలేను. నా చెవుల తుప్పు వదిలిందా అన్న అనుభూతి కలిగింది.

ఇంక ఇవాళ్టి విషయానికి వస్తే, సచిన్ ని వీలైనంత దగ్గర నుండి చూడాలని వెళ్లాను. నేనే కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మూడొంతులు ఆ సచ్చినోడిని చూడటానికి వచ్చినవాళ్ళే. ఆటగాళ్ళు అందరూ మైదానంలోకి వచ్చినా, మేమందరం సచిన్ కోసం వెతుకుతూనే ఉన్నాము. ఇంతలో ఆటగాళ్ళు బయటకి వచ్చే ద్వారం దగ్గర హడావుడి పెరగటంతో, అందరి కళ్ళతో పాటుగా గొంతులు కూడా పెద్దవి అయ్యాయి. "సచిన్ .... సచిన్ " అంటూ అరుపులతో మారుమోగి పోయింది. ఒక్కొక్కళ్ళ ముఖాలు ఆ మైదానంలో ఉన్న దీపాలకన్నా వెలిగిపోయాయి. అదృష్టం కొద్దీ సచిన్ మైదానంలో ఉన్నంత సేపు మేము ఉన్నచోటుకి దగ్గరగా పొలం చేశాడు (మీ బాషలో ఫీల్డింగ్). 

దేవుడు అన్ని వందల ఆటలు ఆడినా, మా అరుపులను విని అప్పుడప్పుడు వెనకకు తిరిగి మాకు చేతులు ఊపి ఉత్సాహపరిచాడు. అలా మొత్తం లెక్కపెడితే 12 సార్లు నాకు(నాకు ఒక్కడికే అని నా భావన) చెయ్యి ఊపాడు. రైనా,కోహ్లి, సెహ్వాగ్ ఇలా అందరు ఊపారు (చేతిని). కానీ పొగరు బట్టిన సుడిగాడు మాత్రం ఎవరినీ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని పారా రాజేష్ తో చెప్తే, "ఎన్నని చస్తాడురా వాడు మాటుకూ, సారధి అంటే సామాన్యమైన విషయం కాదు కదా , అందరినీ చూసుకోవాలి కదా" అని అన్నాడు. నిజమే కదా, పాపం ధోని. ఇంతలో వరుణుడి పుణ్యమా అని మధ్యలోనే ఆట ఆగిపోయింది. 

అలా నా జీవితంలో ఒక గొప్ప కోరిక ఇవాళ తీరింది అన్న తృప్తితో, ఆనందంతో ...... సెలవు.....

Thursday, August 16, 2012

సాదించిన స్వాతంత్ర్యం

అందరికీ 65వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం 63,64,65 సంఖ్య పెరుగుతుందే తప్ప ప్రయోజనం లేకుండా పోతున్నది. రాష్ట్ర పతులు మారుతున్నా రాష్ట్రగతులు మారటం లేదు. దీని గురించి ఎంత ఆలోచించినా ప్రయోజనం లేకుండా పోతున్నది.

ఒలంపిక్స్ లో మనకు 6 పతకాలు వచ్చే సరికి అబ్బో అంటున్నారు. చైనాకి మనకన్నా పదిహేను రెట్లు ఎక్కువ వచ్చిన విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఈ విషయమై, నేను తీవ్రంగా ఆలోచించాను, ఇలాంటి క్లిష్ట పరిస్తితుల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి అని. మన దేశానికి కూడా అన్ని పతకాలు రావాలంటే

1) శ్రీ చైతన్య, నారాయణాలలో ఐ.ఐ.టి కి బదులుగా క్రీడల శిక్షణ మొదలు పెట్టాలి.
2) పేకాట, గోలీలాట, కర్రాబిళ్ళ యిత్యాది ఆటలను ఒలంపిక్స్ లో చేర్చాలి.
3) గీంకార్ అన్న నృత్య పోటీలు కాకుండా, క్రీడల పోటీలు పెట్టాలి...,  ఇలా చేస్తే ఖచితంగా వచ్చే ఒలంపిక్స్ లో మనకు పెద్ద మొత్తంలో పతకాలు వచ్చే అవకాశం ఉంటుంది అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు. అప్పుడు టి.వి.లో ఎలా చెప్తారంటే?? " 2016 ఒలంపిక్ పతకాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం, మొత్తం వందలోపు 75 పతకాలు, స్వర్ణం, స్వర్ణం, రజతం, కాంస్యం, స్వర్ణం, రజతం... " అని చూడాల్సి వస్తుంది.

స్వాతంత్ర దినాన్ని పురస్కరించుకొని మా కార్యాలయంలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ వంకతో నేను చేసిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. రెండు నాటకాలు, నాలుగు పాటలతో జనాలకు నిద్ర పట్టకుండా చేశాను. నంది స్థాయిలో ప్రదర్శన ఇస్తే మా రెడ్డిగారు కుక్కా అని తిట్టారు. కనీసం ఒక్క దానికి కూడా బహుమతి ఇవ్వలేదు. అయినా కళాకారుడికి కావాల్సింది ప్రోత్సాహం కానీ బహుమానాలు కాదని సర్దుకుపోయాను. పనిలో పని ఎప్పటిలాగే నా కీబోర్డు నుండి కొత్త కృతిని మీకు అందిస్తున్నాను.

సాదించిన స్వాతంత్ర్యం, సాదించినది ఏ మాత్రం.
అభివృద్దికి కావాలి పంచతంత్రం,
ప్రత్యేకించి దానికి లేదే సూత్రం,
ఇదే నేటి మన దేశ ముఖచిత్రం.

రాజకీయం అంతా కుళ్ళూ కుతంత్రం,
అవినీతికి ఇదే గొప్ప క్షేత్రం,
నిజాయితీ అనేది ఒక విచిత్రం,
పని జరగదు లేనిదే పచ్చని పత్రం,
ప్రజల బాగుకు లేదు మంత్రం.

ఎవడు అడిగాడు కులం గోత్రం,
అండగా కావాలో నాయక ఛత్రం,
మనకోసం రావాలో కొత్త నక్షత్రం,

వెలుగెత్తి పలకాలి ప్రతి ఒక గాత్రం,
దేశ ప్రగతికి చూపాలి ఆత్రం,
ఈ పాఠం కావాలి మనకిక స్తోత్రం,
వస్తుంది తప్పక ఆ సాయంత్రం,
సాక్షి అవ్వాలి చమర్చే నా నేత్రం


Thursday, August 2, 2012

పాతికేళ్లు వ్యర్ధమేనా

ఇవాళ శ్రావణ పౌర్ణమి. ఈ రోజుతో నా శరీరానికి పాతిక సంవత్సరాలు పని పాట లేకుండానే గడిచిపోయాయి.  మనస్సు మాత్రం పదహారు దగ్గరే ఉండిపోయింది (అలాగని నేనేదో స్వాతిముత్యంలో కమల్ హాసన్ అనుకోకండి). సంవత్సరంలో అతి ముఖ్యమైన పండుగ ఈ పుట్టిన రోజు. కరిగిపోయిన వయస్సుతో పాటు, కలిసి వచ్చిన అనుభవాన్ని, అనుభందాలని, బాధ్యతలను ఇలా ఎన్నింటినో గుర్తుకు తెచ్చే రోజు.

ప్రతి పుట్టిన రోజుకి ఉదయాన్నే నిద్రలేచి, కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసుకొని, కొత్త బట్టలు వేసుకుని, ఇంట్లో పెద్ద వాళ్ళ ఆశీర్వాదాలు, చిన్న వాళ్ళ శుభాకాంక్షలు అందుకొని, దగ్గరలోని గుడికి వెళ్లి రావటం ఆనవాయితీగా మారిపోయింది.చిన్నపుడు అయితే, ఆ ముందు రోజే కొన్న రెండు రకాల చాక్లెట్లు (ఒక రకం స్నేహితులకు, ఇంకో రకం ఉపాద్యాయుల కోసం) తీసుకొని బడికి వెళ్ళటం, అందరికీ పంచటం, అదొక వింత అనుభూతి. 

నాకు ఇప్పటికీ  గుర్తు, ఆ రోజున తరగతి గదిలో ఎంత అల్లరి చేసినా, ఏ పాఠం చదవక పోయినా, పుట్టిన రోజన్న కారణంతో తిట్టకుండా, తన్నకుండా వదిలేసే వారు. కానీ  ఈ మధ్య చూస్తున్నా, పుట్టిన రోజున అర్ధ రాత్రి నిద్ర లేపి మరి కాళ్ళతో వెనక తన్నటం, దానికి " బర్త్ డే బంప్స్" అని పేరు పెట్టటం ఎక్కడ చావురా అనిపిస్తుంది. దానిని ప్రేమ అనాలో పైశాచికం అనాలో, నేనైతే రెండోదనే అంటాను. ఈ సంస్కృతి ఈ మధ్య పల్లెటూర్లకు కూడా వ్యాపించింది. అర్ధ రాత్రులు కేకులు కోయటం, వాటికి తినకుండా ముక్కుకి, ముఖానికి ఇంకో ము కి రాయటం, నా మటుకు నాకు చచ్చే చిరాకు.మనం ఏదైనా మంచి పని చేసేప్పుడు జ్యోతిని వెలిగిస్తాము తప్ప, ఆర్పే సంస్కృతి మనది కాదు. అందుకే నేను ఆ కేకులకు పై ఉంచే కొవ్వొత్తులు ఆర్పటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఇక చిన్నతనాన, పుట్టినరోజు సాయంత్రం స్నేహితులందరూ ఇంటికి ఏదో ఒక బహుమతి తీసుకొని వచ్చే వాళ్ళు. ఈ రోజుల్లో చిన్న పిల్లల పుట్టినరోజుకి, వాళ్ళ స్నేహితులందరికీ తిరిగి ఏదో ఒక బహుమతి ఇవ్వాలట, దానికి పెట్టిన పేరు "రిటర్న్ గిఫ్ట్స్". ఇప్పుడు బహుమతులు ఉండవు కానీ, "పార్టీ" అన్న పేరుతో డబ్బులు వదిలించటం మాత్రం ఖాయం.

నా స్నేహితులు చాలా మంది  అడుగుతుంటారు, లాడెన్ బంకర్లు మార్చినట్టు,  ఒక్కో సంవత్సరం ఒక్కో రోజున   పుట్టిన రోజు జరుపుకుంటావు, ఎందుకలా అని. వాళ్ళందరినీ అక్షరాస్యులని చేయటానికి తల ప్రాణం తోకకు వస్తుందంటే నమ్మండి. వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి, హనుమాన్ జయంతి ఇలా దేవుళ్ళ పుట్టిన రోజు ఒకే తేదిన రావు కదా. మేము ఇలానే పుట్టిన రోజు జరుపుకుంటాము. ఇంత చెప్పినా ఉదయాన్నే "హ్యాపీ బర్త్ డే" అంటూ ఆంగ్లంలోనే చెప్తారు. అదేదో తెలుగులో చెప్తే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి??

ఇప్పడు నేను మీకు ఇచ్చే ఉచిత సలహా, ఉత్తమమైన సలహా ఏంటంటే? అందరూ తిదుల ప్రకారం పుట్టిన రోజు జరుపుకోండి. కనీసం ఆ రోజు మీ పుట్టిన రోజని గుర్తుచేసుకోండి. కొత్తవి కాకపోయినా మంచి బట్టలు వేసుకొని గుడికి వెళ్ళిరండి.  "ఫలానా రోజు మా పుట్టిన రోజు అని ఎలా తెలుస్తుంది? మీరంటే గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు కాబట్టి మీకు తెలుసు" అని అడిగేవాళ్ళకి నేను చక్కని ఉపాయం చెప్పదలచుకున్నాను.

వెతుకు, వెతికితే దొరకనిది అంటూ ఏదీ లేదు అని సునీల్ చెప్పినట్టు, వెతకాలే కానీ గూగుల్ లో దొరకనిది ఏమున్నది చెప్పండి? ఉదాహరణకు మీ పుట్టిన సంవత్సరం 1986 అనుకుందాము. గూగుల్ లో "తెలుగు కాలెండర్ 1986" అని ఆంగ్లంలో వెతకండి. ఏదో ఒక లింక్ తెరచి, ఆ సంవత్సరం మీరు పుట్టిన తేదీ దగ్గరకు వెళ్లి, ఆ రోజు తిది ఏమిటో చూడండి. మార్చిలో వచ్చే చైత్ర మాసం నుంచి, ఫిబ్రవరిలో ముగిసే ఫాల్గునంతో పోల్చి, అది ఈ సంవత్సరం ఏ రోజున వస్తుందో చూసుకోండి. అప్పటికీ అర్ధం కాకపొతే, నాకు మీ పుట్టిన తేదీ తదితర వివరాలు చెప్పండి. నేను చూసుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే, కొద్ది రోజులు పొతే అస్సలు తెలుగు సంవత్సరాలు ఉంటాయని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందేమో అని. 

నాకు ఇది ఇరవయి ఆరవ పుట్టిన రోజని గుర్తొచ్చినప్పుడల్లా "పాతికేళ్లు వ్యర్ధమేనా" అనే పల్లవి గుర్తొస్తున్నది. ఇప్పడు వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రకాష్ రాజ్ లాంటి తండ్రి తో పాటు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో స్నేహాలు, ఎన్నో కష్టాలు, అవి నేర్పిన ఎన్నో పాఠాలు, ఎన్నో శీర్షికలు, ఎన్నెన్నో వాఖ్యలు..., వాటన్నింటినీ ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుంటూ, ఇంకో కొత్త సంవత్సరంలోకి, కొత్త ఆశలతో అడుగుపెడుతూ..........