Sunday, January 20, 2013

తెగులు వచ్చిన 'నాయక్' తెలుగు పాటలు

గత నెలలో జరిగిన ప్రపంచ మహా సభలు ఘనంగా ముగిశాయి. ముఖం పుస్తకంలో కూడా దాని గురించి అంతా మర్చిపోయారు. ఆ మహాసభలలో చిరంజీవిగారు చాలా చక్కగా మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ, " తెలుగు బాష ఇలాంటి సభల వరకే పరిమితం అవుతున్నది అని ఎన్నో సార్లు నాకు భాదగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సభలు జరగటం అన్నది మనం స్పూర్తిగా తీసుకోవాలి. తెలుగుని మన భావి తరాలకి ఆస్తిగా అందివ్వాలి " అని చాలా చక్కగా అచ్చ తెలుగులో చెప్పారు.  నమ్మకం కలగకపోతే  యుట్యూబ్ లో వెతికి చూడండి. ఆ మాటలకు, తెలుగుకి ఇంక తెగులు ఉండదు అన్న నమ్మకం కలిగింది.

" రామ్ చరణ్ కొత్త సినిమా 'నాయక్' పాటలు విన్నావారా? చాలా బాగున్నాయి" అని 'నా' సామాజిక వర్గానికి చెందిన నా స్నేహితుడొకడు చెప్పటంతో వాటిని విన్నాను.

 "హేయ్ నాయక  తూ హే లవ్ నాయాక్, తుజ్ సే దిల్ డోలక్, దన్ దనాదన్ తీన్ మారే" అని మొదటి పాట మొదటి వాఖ్యం విని, అప్పుడెప్పుడో రామ్ చరణ్ హిందీ సినిమా తీస్తున్నాడని వార్తల్లో వచ్చింది. బహుశా ఆ సినిమానే 'నాయాక్' కాబోలు అనుకున్నాను. 'నాయక్' అనే పేరు కుడా హిందీ పేరులాగానే తోచింది. కాని ఆ తరువాత ఆ పాటలో రెండు మూడు తెలుగు పదాలు తగిలేసరికి అనుమానం వచ్చింది. ఇది తెలుగు సినిమానా? హిందీ సినిమానా అని.

రెండో పాటకు వచ్చాను. "లైలా ఓ లైలా ఆ జారే లైలా, ఆజా ఓ మేరీ లాలా. దీవానా మై దీవానా" అని నా అనుమానాన్ని రెట్టింపు చేసింది. కానీ ఈ పాటలో కుడా మళ్ళీ తెలుగు పదాలు తగిలే సరికి ఇది తెలుగు సినిమానే అని నిర్ధారణకు వచ్చాను.  ఈ పాట మొత్తం నాలుగు హిందీ మాటలు, ఒక తెలుగు పదం, మధ్య మధ్యలో ఆంగ్ల పదాలతోనే సాగింది.

మూడో పాట, మొదలు పెడుతూనే ఆంగ్లమో "ఓ మై డాగ్, ఫీల్ ద వే" అని ఏదో వినపడింది. ఆ తరువాత "కత్తి లాంటి పిల్లా  కస్సు  మెరుపులా" అని తెలుగులోకి వెళ్లి, మరలా "మేడమ్ మేడమ్ మేడమ్, జస్ట్ బీ మై బీ మై మేడమ్" అని ఆంగ్లంలో కాసేపు వాయించి అవతలేశాడు.

ఇంక నాలుగో పాట.., పాట విన్న ఒకే ఒక్క క్షణంలో అర్ధం అయిపొయింది, ఆ పాట కొండవీటి దొంగలో "శుభలేఖ రాసుకున్నా" అని. కొంపతీసి ఈ పాటను కూడా "శుభలేఖ లిఖేంగే హిందీ మే హమ్ " అని మార్చి రాశారేమో  అని భయమేసింది. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. పాట మొత్తం డబ్బాలో రాళ్ళు వేసి కొట్టినట్లు ఉన్నది తప్ప, పాత పాట అంత హాయిగా లేదు. పైగా బాలుగారి గొంతుతో పాటని వందల సార్లు విని, ఇప్పుడు వేరెవరో పాడితే జీర్ణించుకోవటానికి చాలా సమయమే పడుతుంది. ఈ పాట మర్చిపోవటానికి, పాత పాట ఒక వంద సార్లు వినాల్సి వచ్చింది. కానీ సినిమా చూశాక పాట తీసిన విదానం నచ్చింది. రామ్ చరణ్ ప్రతి దృశ్యం లో వాళ్ళ నాన్నని తలపించాడు.

"ఒక చూపుకి పడిపోయా" అనే పాట కూడా "దిల్ దియా", "దే దియా", "లగా దియా","చురాలియా", "మార్ దియా", "క్యా కియా" అని హిందీలో ప్రాసతో కాసేపు, అర్ధం కాని అమెరికా ఆంగ్లంతో ఇంకాసేపు, అస్సలు ఏ భాషో కూడా అర్ధం కానీ బాషలో ఇంకాసేపు సాగిపోయింది. తమన్ వచ్చాక, అస్సలు మన దేశంలో ఆ మాటకొస్తే మన ఖండంలో లేని భాషలు కూడా తెలుగు పాటల్లోకి వచ్చాయి. ఇక ఆఖరి పాట, " మై లడీ లడీ హౌరాకి , తు వడీ వడీ ఆంధ్రాకి" అని అచ్చ తెలుగులో రాసిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట చరణాలకు అర్ధం చెప్పగలిగిన వాళ్ళకి, బహుశా ఙానపీఠ కన్నా పెద్దది ఇంకేదైనా ఉంటే,  అది ఇచ్చేయచ్చు.

ఈ చిత్రంతో పాటే విడుదల అయిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" పేరుకు తగ్గట్టే, పాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతా చదివి నేనేదో 'క' సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నాను అనుకునేరు. నాకు ఇరు వర్గాలలోనూ స్నేహితులు ఉన్నారు. చివరకి నేను చెప్పదలచినది ఏంటంటే? "చిరంజీవి మాయ్యా!!! సినిమాల్లో, రాజకీయాల్లో సంపాదించి చెర్రికి ఇచ్చుంటారు. మీరు మొన్న తెలుగు మహా సభలో భావి తరాలకు ఆస్తి అని చెప్పినట్టు, తెలుగుని బావిలో పడేయకుండా, కాస్త భావి చిత్రాలలో తెలుగుని ఉంచమని మీ చెర్రీకి చెప్తారని ఆశిస్తున్నాను". చరణ్ హిందీ చిత్రం చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషించాను. మన తెలుగువాడు, ఆ పైనొళ్ళ భాషలో, చిత్రాలు తీసి మంచి విజయం సాదించి, దేశం (తెలుగు దేశం కాదు) మొత్తం మీద మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.  

7 comments:

 1. Okka charan ani kaadu....ila hindi to lyrics rayamani evaru adugutaro vaallu konchem maarite baaguntundi...

  ento ilanti tunes ki hindi, english to kakunda telugu lo rayadam lyricists ki cheta kaada..

  ReplyDelete
  Replies
  1. nenu udaaharanaku charan annaanu kaani, meeru chepinattu andaru maaraali.

   Delete
 2. Balakrishna mainstream cineamllonchi retire ayyadani vini badha paddanu... Naayak chusaka aayana leni lotu teerchadaniki verokadu ochadani telusukuni ubbi tabbibbayipoyanu...

  "mukha pustakam lo kuda andaru daani gurinchi marchipoyaru!" - :D

  -JB

  ReplyDelete
  Replies
  1. నా మనోభావాలు దెబ్బ తిన్నయి, మా బాలయ్య బాబుని ఎమన్నా అంటే చూస్తు ఊరుకోము జయంత్...,

   Delete
  2. ఓహో మీ మనోభావాలు అంత దెబ్బతిన్నాయా! మరి రాంచరణ్ అభిమానుల మనోభావాల సంగతేంటి? అవి దెబ్బతిన్నా పరవాలేదా?

   Delete
 3. అద్దంకి గారు,

  మీకు ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతున్న తెలుగు భాషా 'జ్ఞాన్' పట్ల 'టచ్' 'కమ్' హువా అని నాకనిపిస్తూంది. అవన్నీ అచ్ఛ 'టెల్గూ' వర్డ్స్ అండీ!


  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
  Replies
  1. ఇలాంటి ఆంగ్ల, హిందీ పదాలను తెలుగులో కలిపి, తెలుగు భాషలోని పదాల సంఖ్య పెంచుతున్నారు కాబోలు., ఈ విషయం తెలియక అనవసరంగా కంగారు పడ్డాను.

   చిన్న అనుమానం, నాయక్ చినిమా చూసి మీ పేరుని మార్చుకున్నారా???

   Delete