Sunday, November 27, 2011

పెళ్లాలు అంటే????

మా కార్యాలయంలో ఒక సోదరుడు, నాలుగు నెలల క్రితం, పొరపాటున పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు లాక్కో లేక, పీక్కో లేక అల్లాడుతున్నాడు. రోజు ఉదయాన్నే ఏడింటికి కార్యాలయానికి వచ్చి, పని లేకపోయినా, ఏ అర్ధరాత్రో కాని ఇంటికి చేరటం లేదు. అదేంటని అడిగితే, "కాలం కలిసి రాక, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే, అప్పుడు నీకే అర్ధం అవుతుందిలే తమ్ముడు" అని చెప్తుంటాడు.

ఒక రోజు ముఖం నీరసంగా, రోజిటికంటే చిరాకుగా, దిగాలుగా కార్యాలయానికి వచ్చాడు. సరే మనిషి బాగా దిగాలుగా ఉన్నాడు కదా, కాస్త ఊరట కలిగిద్దాం అని, కాఫీ తాగిద్దామని తీసుకెళ్ళాను. కూర్చొని కాఫీ చేతులో పట్టుకుని, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే, పెళ్లి చేసుకోవటం ఎంత పొరపాటో, చేసుకుంటే ఎంత బాదపడాల్సి వస్తుందో చెప్తూ, పనిలో పని, నన్ను మాత్రం పెళ్లి చేసుకోవద్దు అని సలహా ఇచ్చాడు.

ఇంతలో ఆ ప్రక్కనే ఉన్న టి.విలో ఒక పాట చూసి, అతని ముఖం ఎర్రగా అయ్యింది. ఆవేశంతో ఊగిపోయాడు. అది గోపీచంద్, ప్రియమణి కలిసి నటించిన "గోలీమార్" అనే హిందీ పేరుతో వచ్చిన తెలుగు చలన చిత్రం. "మగాళ్ళు అంటె మాయగాళ్లె, ప్రేమంటె ఏమిటో తెలీదే" అనే పాట వింటుంటే, అతనున్న పరిస్థితిలో ఆ మాత్రం కోపం రావటం సహజం. ఆ పాట రాసినతని దగ్గరి నుంచి, ఆ చలన చిత్రం చూసిన వాళ్ళందరిని తిట్టటం మొదలు పెట్టాడు. బావ కళ్ళల్లో ఆనందం కోసం హత్యలు చేస్తున్న ఈ రోజులలో, నాతో పాటు పని చేసే, ఆ అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఏదైనా చేయాలి అనిపించి, అదే పాటను మార్చి రాశాను. అది ఇప్పుడు మీ ముందుకు తీసుకు వస్తున్నాను.

అతి ముఖ్య మనవి: ఏదో సరదాకి ఈ పాట రాశాను. అస్సలు నేను రాసినదానిలో ఎంత నిజం ఉందో తెలియదు, ఎందుకంటే నాకింకా ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఈ మాత్రం దానికి, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

పల్లవి||
పెళ్లాలు అంటే పిశాచాలే, మంచి అంటే ఏమిటో తెలీదే,
బుఱ్ఱంత భోంచేస్తూ ఉంటారే!! వీళ్ళు కూడా ఇంతే!!
ఆడాళ్ళ ధ్యాసంత సొమ్ము మీదే, గమ్ముగా గంటైన ఉండరంతే,
ఆడాళ్ళ మెదడు ఆవగింజంతే, వీళ్ళు కూడా ఇంతే .....

చరణం||
కాస్తంత ప్రశాంతత కోరుకుంటాం, కూసంత టైమిస్తే పారి పోతాం,
పెళ్ళాల పోరేంటో, పిచ్చేంటో, మాటేంటో, నడకేంటో, ఏమో ఏంటో
మీకు నచ్చినట్టు మేము నడిచినా, మా జీతమంతా పోసి ఇచ్చినా ఇదింతే., వీళ్ళు కూడా ఇంతే
||పల్లవి||
చరణం||
చెప్పిన చోటుకల్లా తీసుకెళ్తూ ఉంటాం. అడ్డమైనవన్నీ కొనిస్తూ ఉంటాం.
పెళ్ళాల సుత్తేంటో, నస్సేంటొ, కస్సేంటో, బుస్సేంటో, ఏమో ఏంటో
మీతో ఏడడుగులు వేసినా, ఎన్ని వేల సార్లు అలా వేసినా, మీరింతే

మళ్లీ చెప్తున్నాను, మహిళా సంఘాలని, గృహ హింస చట్టాలని, టివి9ని, దయ చేసి ఇందులోకి లాగకండి.

Friday, November 18, 2011

జీవిత సారం 4 ("ప" గుణింతం)

యువనేత మీద రాసిన శీర్షిక చదివి, ఒక అజ్ఞాత, యువనేత వీరాభిమాని నాకో వాఖ్య పంపాడు. "నీకెందుకురా రాజకీయాల గురించి, ఎప్పటి లాగా నీ డబ్బా కొట్టుకో, మా యువనేత గురించి కాదు" అని పంపాడు. నేను రాసిన దానికి, పాపం అతని మనోభావాలు దెబ్బ తినట్టు ఉన్నాయి. నా శీర్షికలలో నా డబ్బా కొట్టుకోక, ఊర్లో వాళ్ళందరినీ పొగడటానికి, సన్మానం చేయటానికి ఇదేమన్నా రవీంద్ర భారతినా?? ఏదైతేనేం, ఆ అజ్ఞాత యువనేత అభిమానికి నా ప్రగాడ ఓదార్పు తెలియజేస్తూ ఈ శీర్షిక మొదలు పెడుతున్నాను.

దరిద్రపు చలన చిత్రాలు, అని మనం అప్పుడప్పుడు తిట్టుకుంటాం కానీ, వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకి, కధానాయిక పాపని పట్ట పగలు, నడి రోడ్డులో, నలుగురు ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు మన కధానాయకుడు అమెరికాలో ఉన్నపటికీ, అరనిముషంలో అద్దంకి వచ్చి కధానాయిక పాపని కాపాడి, గీతలో(లైన్లో) పెడతాడు. కధానాయకుడు వచ్చి కాపాడతాడని మనకి కూడా తెలుసు. అయినప్పటికీ పిచ్చి ముఖాలు వేసుకుని మన కధానాయకుడి కోసం ఎదురు చూస్తామా! లేదా! 

జీవితం కూడా అంతే. కొన్ని జరగక ఆగవని మనకు తెలుసు, అవి జరిగేదాకా మనం చూస్తూ ఉంటాము. కొన్ని జరగవని తెలుసు, అయినా ప్రయత్నిస్తాం. కధానాయకుడు కాపాడతాడని తెలుసు, కానీ ఎలా కాపాడతాడు అనేది మనం చూసే అంశం. అలానే మనం పెరిగి, పెద్దయ్యి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కని, పెంచి ., ఏదో ఒక రోజుకి పోతాం.  అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు, అని మనకు తెలుసు. కానీ ఎలా పుట్టి ఎలా పెరిగి ఎలా చచ్చాం అనేది ముఖ్యం. అందుకే రామానంద స్వామి ఏమంటాడంటే "జీవితం అనేది "ప" గుణింతం. పుట్టుక అనే 'పు'తో మొదలు అయ్యి పాడె అనే 'పా'తో ముగుస్తుంది". ఇంకా విడమర్చి చెప్పాలంటే కడుపులో పిండంతో మొదలుపెట్టి తద్దినపు పిండంతో అయిపోతుంది(కాస్త నాటుగా అనిపించినా, ఇది కాదనలేని సత్యం).      

ఈ మధ్య స్నేహితులు, చుట్టాలు అంతా పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ కొంత మంది వెటకారంగా, " నీకేమి రా? మాటలతో అమ్మాయిలని పడేస్తావ్! ఎంత మంది అమ్మాయిలని దారిలో పెట్టావ్?" అని ఏడిపించుకు తింటున్నారు. నేను అన్ని చదువు చదువుకోలేదు, అని చెప్పినా వినటంలేదు. నేనేదో ఇక్కడ అమ్మాయిలని పడేసే వ్యాపరం పెట్టినట్టు హింసిస్తున్నారు. నేను ఎంత తిన్నా లావు రాను, వాళ్ళకు ఎంత చెప్పినా సిగ్గు రాదు అని వదిలేశా!!   మా మల్లి మామ కుడా "నీకేమి రా నాగచైతన్య అంత అందంగా ఉంటావు" అంటాడు. మా సుబ్బన్న చెప్పినట్టు, యవ్వనం పవర్ ప్లేలో ఉనప్పుడు పంది కుడా అందంగా ఉంటుంది. ఆఖరికి మా నాన్న కూడా, నేను పెద్ద జేఫ్ఫాని అని నిశ్చయించుకునట్టున్నాడు. అందుకే ఈ మధ్య పదే పదే చెప్తున్నాడు, "నాకు చెప్పి పెళ్లి చేసుకోవద్దురా! నేను చెప్పినప్పుడు, చెప్పిన అమ్మాయిని చేసుకో!" అని.  

మన ముఖ్యమంత్రి గారి మాటలయినా అప్పుడప్పుడు అర్ధం అవుతాయేమో కానీ, అమ్మాయిలు ఎవరిని ఇష్టపడతారో మాత్రం తల నేలకేసి బాదుకున్న అర్ధం కాదు. ఒకడు అంటాడు, బాగా ఎత్తున్న అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం అని. ఆరడుగులున్న వాడిని అడిగితె, అమ్మాయిలకి తెల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం అని. సరే తెల్లగా ఉన్నోడిని అడిగితె, అమ్మాయిలు బాగా జుట్టు ఉన్నవాడిని ఇష్టపడతారు అని. ఈ లక్షణాలన్నీ ఉన్నవాడిని అడిగితే, వాడు కూడా ఇంకేదో కారణం చెప్తున్నాడు. సరే, ఈ విషయం మీద కూలంకుషంగా, ఇంకో శీర్షికలో ఖండించుకుందాం. అంతవరకూ ఆశీస్సులు..

Saturday, October 29, 2011

కళాబంధు మా శ్రీరామ చందు


ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఒక రోజు సాయంత్రం హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది. రోజు ఎనిమిది గంటలకు ఈటివిలో చందు పాట పాడుతున్నాడు అనేది సారంశం. తను పాటలు పాడతాడు అని తెలుసు, కానీ టివిలో పాడేంతగా అని అనుకోలేదు.

పూర్వాశ్రమంలో నేను మా బడిలో పాటలు పాడేవాడిని(కంగారు పడకండి, ఇప్పుడు పాడటంలేదు). అబ్బో రోజులే వేరు. నేను పాడుతుంటే చపట్లు కొట్టాలా? లేక నన్ను కొట్టాలా?? అని ఆలోచించే లోపు నేను వేదిక దిగిపోయేవాడిని. ఇప్పుడా ముచ్చటంతా ఎందుకులే కానీ, విషయానికి వద్దాం. ఎక్కడున్నాం? ....... ఎనిమిది గంటలకు టివిలో అనే సరికి అందరం టివిలకి అతుక్కు పోయాము. మనోడు రోజు పాట ఇరగదీశాడు. నా అంత బాగా కాక పోయినా, నేను అనుకున్న దానికన్నా చాలా బాగా పాడాడు. ఒక్కింత బాధ (నేను స్థాయికి వెళ్ళలేక పోయానే అని), ఒక్కింత ఆశ్చర్యం, ఆనందం (మనోడు చాలా బాగా పాడాడు అని).

క్షణం అనిపించింది నేను సంగీతం నేర్చుకుంటే బాగుండేది అని. సహజమే., సచిన్ ని చూసి క్రికెటర్, జే.పి.ని చూసి కలెక్టర్, బాలకృష్ణని చూసి కదానాయకుడిని అవ్వాలనుకున్నా. పాటలు నేర్చుకోవటం మొదలు పెట్టా. పాటకు తగ్గట్టు చేతులు ఊపటం వచ్చింది కానీ, పాడటం మాత్రం రాలేదు.

ప్రతి వారం ఎనిమిదింటికల్లా టివి ముందు వాలి పోయేవాడిని. ఒక్కో వారం ఒక్కో పాటతో దూసుకుపోయాడు. ప్రతి పాటకి తనని తానూ మెరుగు పరుచుకుంటూ ముందుకు పోయాడు. రక రకాల పాటలని తనదైన శైలిలో అధ్బుతంగా పాడాడు.

క్రమంలో ఎన్నో మధురమైన పాటలు పాడాడు. నవరసాల్ని పండించాడు. ముఖ్యంగా అలనాటి ఆణిముత్యం, ఘంటసాల గారి "రసిక రాజ తగు వారము కామా?" అనే పాట పాడుతున్నంత సేపు ఊపిరి బిగబట్టి విన్నాను. క్షణంలో అనుకున్నా నేనింక తన స్నేహితుడిని కాను, కేవలం అతని లక్షలాది అభిమానుల్లో ఒకడిని అని. రోజే నాకు అనిపించింది., ఏదో ఒక రోజు సంగీత సామ్రాజ్యంలో తను ఉన్నత స్థానానికి వెళతాడు అని. నా లాంటి లక్షలాది అభిమానులని సంపాదిస్తాడు అని.

అలా ఎన్నో కార్యక్రమాలలో విజేతగా నిలిచి, సినీ నేపధ్య గానాన్ని మొదలు పెట్టాడు. "అష్ట చెమ్మ" లాంటి చిత్రాలలో పాడి మంచి పేరు సంపాదించాడు. మణి శర్మ, కీరవాణి గారి లాంటి గొప్ప సంగీత దర్శకుల దగ్గర పని చేశాడు. అయినా, ఇంకా ఏదో సాదించాలన్న తపన, ఇంకా నేర్చుకోవాలి అన్న కసి, మిగితా గాయకుల నుంచి అతనిని వేరు చేసింది. క్రమంలోనే ఉత్తర భారతంలో అడుగు పెట్టి, "ఇండియన్ ఐడల్ - 5" కార్యక్రమానికి వెళ్లి, అక్కడ విజేతగా ఆవిర్భవించాడు. దక్షిణ భారత దేశం నుండి కార్యక్రమంలో గెలిచిన మొట్ట మొదటి గాయకుడు అయ్యాడు.

తెలుగు వాడి సత్తా ప్రపంచానికి మరోసారి చాటాడు అనటం మాత్రం అతిశయోక్తి కాదు. "క్వాజ మేరె క్వాజ " అనే పాటకు పాకిస్తాన్లో సైతం అభిమానులను సంపాదించాడు అంటే అర్ధం చేసుకోవచ్చు, తను సాదించింది ఏంటో? తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మానం అందుకున్నాడు. కళాబంధు బిరుదాంకితుడయ్యాడు. ప్రపంచం నలుమూలల తన గానామృతాన్ని వినిపించాడు. "హాలివుడ్" కి సైతం తన స్వరాన్ని పరిచయం చేశాడు. "కామన్ వెల్త్ క్రీడల" ముగింపు వేడుకల్లో అందరినీ అలరించాడు.

మనిషి ఉన్నతమైన వాడు అని చెప్పాలంటే అతను సాదించిన దానికన్నా, అతని ప్రవర్తన చూచి చెప్పాలి. ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించినా., ఎన్నో దేశాలలో ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్నా, మనిషి మాత్రం మారలేదు. అదే చిరున్నవ్వు, అదే ఆప్యాయత, అదే చికాకు (:P). మంచి గాయకుడిగానే కాదు అంతకు మించి మంచి స్నేహితుడిగా నేను తనని గుర్తిస్తా.

( అనంతరామ్, శ్రీరామ్)
ఇలానే తను ఇంకెన్నో సాదించాలని, తన గానామృతంతో అందరినీ అలరించాలని కోరుకుంటూ.., పనిలో పనిగా ఒక చిన్న కవితని మనోడికి అంకితం ఇస్తున్నాను, కంగారు పడకుండా కానివ్వండి.
------------------------------------------------------------------------------------------------------------
తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చాటిన మిత్రమా! శ్రీరామ చంద్రమా!

ప్రతి హృదయమనే "నోట్ బుక్"ని నీ పాటలనే అక్షరాలతో "బోణి" చేశావు. నీ "కత్తి"లాంటి గొంతు తో అందరిని "తీన్ మార్" ఆడిస్తున్నావు. "ఆపిల్" పండు లాంటి అమ్మాయిలంతా, నీ గానామృతంలో మునిగి "వస్తాడు నా రాజు" అని, "అష్టాచెమ్మ" ఆడుతూ నిరీక్షిస్తున్నారు. నువ్విప్పుడు కేవలం మా చందువి కాదు, "అందరి బంధువి". ఇలా నీ "ప్రయాణం" ఆసాంతం హాయిగా సాగాలని, నీ పాటల "జల్లు" "కోతిమూక" మీద ఎల్లప్పుడూ కురవాలని, "బద్రీనాధుని" ఆశీస్సులు నీకు సదా ఉండాలని, ఆకాంక్షిస్తూ.......
నీ మిత్రుడు ,
అద్దంకి అనంతరామయ్య
------------------------------------------------------------------------------------------------------------
(గమనిక : ఎరుపు రంగులలో ఉన్నవి శ్రీరామచంద్ర పాడిన పాటలు గల చిత్రాలు.)