Friday, December 31, 2010

ఎవడి పిచ్చి వాడికి ఆనందం

నన్ను చాలా మంది అడుగుతున్నారు,  "ఏందిరా పిచ్చి పిచ్చిగా, నీకు ఏది అనిపిస్తే అది రాస్తున్నావ్? నీకు అంత అవసరమా? బాగా ఎక్కువ చేస్తున్నావ్.," అని ఎంతో మర్యాదగా చెప్పారు. నేను అనేది ఏంటంటే., ఒకొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది., అసలు ఎ పిచ్చీ లేనివాడు మనిషే కాదు. ఉదాహరణకు మనలో చాలా మందికి పాటలు అంటే పిచ్చి, కొందరికి సినిమాలంటే పిచ్చి, ఇంకొంత మందికి గంటలు తరబడి ఫోన్ లో మాట్లాడటం అంటే పిచ్చి.

'కొందరికి పగలంటే పిచ్చి, కొందరికి నగలంటే పిచ్చి'
'కొందరికి ఇంటర్నెట్ అంటే పిచ్చి. మరి కొందరికి నిద్ర అంటే పిచ్చి'
'వ్యాపారులకు డబ్బంటే పిచ్చి, నాయకులకు పదవి అంటే పిచ్చి' 
'రాజ శేఖర్కి జీవిత అంటే  పిచ్చి, వాళ్ళిద్దరికీ  'వై.ఎస్.ఆర్' అంటే పిచ్చి '
'ఉండవల్లికి రామోజీరావు అంటే పిచ్చి'
'కొండ సురేఖకి, అంబట్టి రాంబాబుకి   జగన్ అన్న అంటే పిచ్చి'
'కే.సి.ఆర్ కి తెలంగాణా అంటే పిచ్చి, లగడపాటికి సమైక్య ఆంధ్ర అంటే పిచ్చి'
'కొందరికి చరణ్ అంటే పిచ్చి,  కొందరికి జూ:ఎన్.టి.ఆర్  అంటే పిచ్చి'
'తమిళనాడు లో రజని కాంత్ అంటే పిచ్చి, ఆంధ్రలో మా బాలయ్య బాబు అంటే పిచ్చి '
'పిల్ల తండ్రులకు ఇంజనీర్లంటే పిచ్చి,ఆ ఇంజనీర్లకు   అమెరికా అంటే పిచ్చి, అమెరికా వాళ్ళకు నిజంగానే పిచ్చి'
'అబ్బాయిలకు అనుష్క, సమంతా అంటే పిచ్చి, అమ్మాయిలకు మహేష్, అనంతరామ్ అంటే పిచ్చి'
'ఈ సోది అంతా చదువుతున్న మీకు పిచ్చి.'
చివరగా నాకు సచిన్ అంటే పిచ్చి, తెలుగంటే పిచ్చి,

Tuesday, December 28, 2010

"అర్ధ రాత్రి అంకమ్మ శివాలు"

             అప్పుడు సమయం అర్ధ రాత్రి  ఒంటిగంట అయిందనుకుంటా, కొత్తగా కొనుకున్న బండి మీద సరదాగా బయటకి వెళ్దామని బండి తీశా. చిన్నగా ఆ బండి మీద అలా వెల్తూ ఉన్నాను. చలి కాలం పిల్ల గాలులు చిన్నగా సందడి చేస్తున్నాయి. ఆ వీది దీపాల వెలుతురులో నగరం ఎంతో అందంగా వుంది. నాకు బాగా నచ్చిన తెలుగు పాటలు వింటూ వేగం పెంచాను.

              అంతలో దూరంగా ఒక అందమైన అమ్మాయి కనపడింది. బండి ఆపమంటూ సైగ చేస్తున్నది. బండి నా ప్రమేయం లేకుండానే ఆగిపోయింది. తనతో పాటు ఎవరూ లేరు. ఒంటరిగా ఆ మంచులో తను మగధీర చిత్రంలో కాజల్ లాగా వుంది. తన బండి చెడిపోయింది, "కొంచం ఇంటి దగ్గర దిగబెడతార? " అని అడిగింది. తన గొంతులో ఏదో మాయ వుంది. అ క్షణంలో నాకు గాలిలో తేలుతునట్టు అనిపించింది. అందమైన అమ్మాయి ఒంటరిగా బండి ఎక్కుతానంటే కాదని చెప్పటానికి నాకేమన్న పిచ్చా? తను నా బండి వెనక కూర్చుంటే ప్రపంచం అంతా నా వెనక ఉనట్టు అనిపించింది. 

             అసలు అప్పుడు నా భావాలను మాటలలో చెప్పలేను. అ క్షణం అలానే ఆగిపోవాలని అనిపించింది. అందుకే చాల తక్కువ వేగంతో నెమ్మదిగా వెళ్తున్న. నా పేరు స్వప్న అని చెప్పింది. నా పేరు చెప్పాను. అలా కబుర్లు మొదలు పెట్టాము. "మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే", అని చెప్పింది. ఆ క్షణం తెలుగు సినిమా కధానాయకుడు కూడా నా ముందు ఎంత అనిపించింది. ఇంతలో ఎక్కడి నుంచో పెద్ద శబ్దం వినిపించింది. నిద్ర లేచి చూస్తే, అది నా ఫోన్ నుంచి వచ్చిన శబ్దం. ఎవడో నాకు సంక్షిప్త సందేశాన్ని(తెలుగులో దానినే SMS  అంటారు)  పంపించాడు. అప్పుడు అర్ధం అయింది అదంతా కల అని. తన పేరు ఏమని చెప్పింది? స్వప్న అని కదూ., అంటే "కల" అనే కదా? తన తప్పు ఏమీ లేదులే, తను నిజమే చెప్పింది. అయినా అమ్మాయి నా బండి ఎక్కటం ఏంటి? అసలు నాకు బండి వుంటే కదా. అంతా కల. మనకు అంతే ప్రాప్తం అని బాదేసింది. జీవితంలో ఇలాంటివి అన్ని మాములే అనిపించింది. కల పొతే పోయింది, "ఇంత అర్ధరాత్రి ఎవడు సందేశం(SMS) పంపాడో?", అని ఆదుర్దాగా చూశాను. అది చూడగానే నాకు చావాలి లేక పొతే పంపిన వాడిని చంపాలి అనేంత కోపం వచ్చింది.ఆ సందేశం ఏంటంటే.,


"కాకి కావు కావు అన్నది, 
 కుక్క కాలు ఎత్తింది,
 కప్పు గంతులు వేసింది,
 కళ్ళు మూసుకొని నిద్రపో మిత్రమా, శుభరాత్రి." 




                ఇది అందులో ఉన్న సందేశం. అర్ధ రాత్రి నిద్ర పొతూ కమ్మని కలల్లో విహరిస్తుంటే., అలాంటి వాడిని నిద్ర లేపి మరీ "శుభరాత్రి" చెప్పటం అవసరమా? అర్ధ రాత్రి అంకమ్మ శివాలు అంటే ఇదే మరీ. ఆ వెధవకి పని పాట ఉండదు. నాకు కూడా లేదనుకోండి., పైసాకో సందేశం పంపే వీలు వుంటుంది. ఇంకేముంది ఇలాంటి టంపే(తిరగతిప్పి) పనులతో పైశాచిక అనందం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎవడు ఏడ్చాడు వాడిని శుభరాత్రి చెప్పమని? చివరగా నేను చెప్పదలచుకుంది ఏంటంటే, తోచక పొతే రామాయణం చదవండి, లేదంటే నీళ్ళు లేని బావిలో కూర్చొని పాటలు పాడుకోండి., అంతే కానీ ఎదుటి వాళ్ళని ఇలాంటి పిచ్చి పిచ్చి సందేశాలతో నరకం చూపించద్దు. మీకు కూడా ఇలాంటి బాదలు ఏమైనా ఉంటె వెంటనే వాళ్ళ మొహం మీదనే చెప్పేసేయండి. హాయిగా అమ్మాయితో బండి మీద ఉండాల్సిన వాడిని, దరిద్రుడు, వాడి పాపాన వాడె పోతాడు., 


Tuesday, December 21, 2010

గురువుగారు దేవునితో సమానం.



మాత్రు దేవో భవ
పితృ దేవో భవ
ఆచార్య దేవో భవ
మన జీవితంలో మనల్ని అత్యంత ప్రభావితం చేసే వాళ్ళలో తల్లి తండ్రుల తర్వాత గురువులదే. జీవితంలో ప్రతి విజయం వెనక గురువుల ప్రోత్సాహం, ఆశీసులు తప్పనిసరి. అందుకే మనం గురువుని దేవునితో పోలుస్తాము. ఎంతటి గొప్పవారు అయినా తమ గురువుల ముందు ఎప్పటికీ చిన్నవారే. ఉదాహరణకు యాభై శతకాలు చేసిన సచిన్ కూడా తన గురువుల వల్లే సాదించ గలిగాను అంటాడు.ఇది అక్షర సత్యం. మన జీవిత గమనాన్ని మార్చటానికి అ ఒక్క గురువుగారు చాలు.  నా దృష్టిలో గురువు అంటే రామాయణం తో సమానం. రామాయణాన్ని మనం ఎన్నో కోణాలలో చదవచ్చు.  ఒక తండ్రి కొడుకుల కధగా, ఒక అన్న తమ్ముల కధగా, ఒక గురు శిష్యుల కధగా, ఒక భార్య భర్తల కధగా ఇలా ఎన్నో కోణాలలో చదవచ్చు. అలానే గురువు నుండి కూడా మనం అనేక కోణాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. ఇవాల్టి రోజున చదువు నేర్పే వారందరూ గురువులు అని నేను అనుకోను. చాలా కొద్ది మంది మాత్రమే విద్యార్దుల జీవితాలను ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నారు. నాకు అలాంటి గురువులు దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. సినిమాల్లో ఈ మధ్య గురువులను ఎంత హ్యేయంగా చూపిస్తున్నారో అందరికి తెలిసిన విషయమే. మీకు చిన్ననాటి ఒక సంఘటన చెప్పాలి. నేను మా నాన్న ఒక రోజు పెళ్ళికి వెళ్ళాం. ఒకతను మా నాన్నను, "మీకు ఎంత మంది పిల్లలు?" అని అడిగాడు. మా నాన్న 450 మంది అని చెప్పాడు. అతను కంగారుపడ్డాడు. మా నాన్న దగ్గర అప్పుడు 450 మంది చదువుకుంటున్నారు. పిల్లలు అంటే ముందుగా ఆలోచించేది వాళ్ళ గురించే. మీకు నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని ప్రభావితం చేసిన గురువులు మీకు ఎంతో మంది ఉండి ఉంటారు. వాళ్ళని ఒకసారి కలిసి కృతఙ్ఞతలు చెప్పండి.అంతకన్నా వాళ్ళకు కావాల్సిన గురుదక్షిణ ఇంకొకటి లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఉపాద్యాయుడిని అవ్వాలి అని కోరిక. ఇప్పటికీ ఆ కోరిక అలానే ఉంది. ఆ కోరికే ఈ రోజు నన్ను ఈ శీర్షిక రాయటానికి ప్రేరేపించింది.
 ..........సశేషం.......

Friday, December 10, 2010

ఊర్లో జనాల్ని ఉరి తీసినా తప్పు లేదు.

"అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు"  అనే నానుడి మనం చాలా సార్లు వినుంటాం. మనం ఓడినప్పుడు కన్నా పక్కనోడు గెలిచినప్పుడు మనకు బాధ ఎక్కువ. మన జీవితంలో అనేక సందర్భాలలో ఇలాంటివి మామూలే. నిజమే, కానీ ఇక్కడ ఊర్లో జనాల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? అని అడగచ్చు . అక్కడికే వస్తున్నా. మా ఊర్లో ఒక ఆమె వుంది. చాల మంచి మనిషి. నన్ను రోజు పలకరిస్తుంది. పలకరించిన ప్రతి సారి "ఏమి చేస్తున్నావ్ బాబు?"  అని అడుగుతుంది.అక్కడ ఆమెతో పాటు ఉన్న ఇంకో నలుగురికి చెప్తుంది, "ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చేసాడు, ఉద్యోగం కూడా వచ్చింది. " అని.  వాళ్ళు కూడా అడుగుతారు, " ఎప్పుడు వెళ్తున్నావ్ బాబు ఉద్యోగానికి? " అని. అలా అడగటం తప్పు కాదు. కానీ అప్పుడు నేను ఉన్న పరిస్తితుల్లో ఎవరికైనా కోపం వస్తుంది. అలా వాళ్ళు అడగటం, నేను తప్పించుకోవటం, ఇలా రెండు సంవత్సరాలు అడుగుతూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పొతే ఒకటా? రెండా? ఇంకో మాస్టారు ఉన్నారు., తాతల నాటి వ్యాపారం చేసుకుంటూ ఊర్లో లక్షలు సంపాదిస్తుంటాడు. మహానుభావుడు., పోయే వాడిని ఆపి మరీ,  "ఏరా! రావు గారి అబ్బాయికి అదేదో కంపనీలో ఉద్యోగం వచ్చింది అటగా?, నీకు రాలేదా?", అని ఒక పది మంది ముందు అరిచి మరీ చెప్తాడు. ఇంకో బాబుగారు ఉన్నాడు. ఇతనికి పడటం, లేవటం మాత్రమే తెలుసు. " ఏరా మార్కెట్ పడిందంట? ఉద్యోగాలు రావంట? ఏంటి పరిస్తితి", "మార్కెట్ లేచింది? మీకు ఉద్యోగాలు వస్తాయా ఇప్పుడైనా?" అని తెగ బాద పడి పోతుంటాడు. ఒక పక్క ఏమి చేయాలో అర్ధం కాక నా ఏడుపులో నేనుంటే, "అత్త కొట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు" అన్న చందాన ఇంకా చికాకు ఎక్కువ అయ్యేది. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా రకాలుగా చావ గొట్టారు. ఇలాంటి పరిస్తితుల్లో కూడా నేను ఒకటిన్నర సంవత్సరాలు వీళ్ళ మధ్య దైర్యంగా తిరిగాను అంటే., నాకు ఎంత దైర్యం కావాలి చెప్పండి? ..............సశేషం.......

Wednesday, December 8, 2010

రాముడు గొప్పా? సోనియా గాంధీ గొప్పా?

వీడికి పిచ్చి ఏమైనా వచ్చిందా అనుకుంటున్నారా? నా ప్రశ్న మీరు సరిగ్గానే చదివారు. సోనియా గాంధీ ఏంటి, రాముడితో పోలిక ఏంటి? అనుకుంటే పొరపాటే. అందరు ఇంట్లో తోచక పొతే ఏమి చేస్తారు? టీవీ ముందు కూర్చొని న్యూస్ ఛానళ్ళు అన్నింటిని తిరగేస్తారు. అలానే ఒక రోజు టీవీ ముందు కూర్చున్న. ఏదో రాజకీయ చర్చ జరుగుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ అతను చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అతని మాటలలోనే చెప్పాలంటే "మా సోనియామా దేవతండి. దేశం కోసం ఎంతో త్యాగం చేసింది. దేశానికీ ప్రధాన మంత్రి అయ్యే అవకాసం వున్నా, త్యాగం చేసిన త్యాగమయి. కేవలం అయోధ్య అనే చిన్న నగరాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్ళాడని రాముడిని దేవుడు అంటున్నారు. అలాంటిది దేశానికే ప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా రాముడికంటే గొప్ప. ఆమె దేవత." అని ముగించాడు సదరు నాయకుడు. ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప. అయోధ్య కన్నా దేశం పెద్దదే కదా. అంటే రాముడికన్నా సోనియా గొప్పదే కదా. వాడికి తెల్సిన రామాయణం రాములవారు అడవికి వెళ్ళటం వరకే. పొగిడితే పదవులు వస్తాయి అని ఇలాంటి చెండాలపు మాటలు మాట్లాడాడు. సోనియా ఎంత గొప్పదో దేశానికీ ఎంత సేవ చేసిందో జగన్ ని అడిగితె చెప్తారు. అయినా ఇప్పుడు అది అప్రస్తుతం. ఎవరినో పొగడటానికి రాముడిని తక్కువ చేసి మాట్లాడటం సిగ్గు చేటు. ఇలాంటి వాటిని మనం ఖండించాలి. జై శ్రీ రామ్.

Friday, November 26, 2010

భాగ్యనగరంలో ఒక రోజు భాగ్యం.

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక సంస్థ వారు ఒక రోజు నగర పర్యటన అని ఒక రూ.270 /- తో నగరంలో ఎంపిక చేసిన ప్రదేశాలని చూపించారు. ముందుగా ఉదయం 8 :30 కి తెలుగు తల్లి విగ్రహం నుండి బయలుదేరి ముందుగా "బిర్లా మందిరం". పైకి వెళ్లటానికి ఒక ౩౦౦ మెట్లు, జోరున వాన, వెళ్తే తడవటం ఖాయం. అందుకని అక్కడ నుండి "సాలార్ జుంగ్ సంగ్రహాలయం"కి వెళ్ళాము. ప్రపంచం నలు మూలల నుంచి తెచ్చిన ఎన్నో వస్తువులు అక్కడ ఉన్నాయి. నిశితంగా అన్ని చూడటానికి ఒక రోజంతా పడుతుంది. కానీ మాకు కేవలం ఒక గంట మాత్రమే ఉంది. అన్నింటిలోకి నా మనసు దోచింది మాత్రం "రిబకా" అని పిలవబడే పాల రాతి శిల్పాలు. చాల ఆశ్చర్యభరితంగా చెక్కారు. అందరు ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన గంట గడియారం చాల బాగుంది అన్నారు కానీ, నాకు మాత్రం ఎందుకో అస్సలు నచ్చలేదు.




       అక్కడ నుంచి "నిజాం సంగ్రహాలయం". వైశాల్యంలో చాల చిన్నదైన చూడాల్సిన వస్తువులు చాల ఉన్నాయి. ముఖ్యంగా 1950కి ముందు తీసిన చిత్రాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. నిజం రాజులు ఎంత విలాసంగా బతికారో నాకు రెండు సంగ్రహాలయాలు చూసిన తర్వాత తెల్సింది.


అక్కడ నుంచి "చౌ మెల్ల భవనం". ఇది చాల విలాసంగా అందంగా ఉంది
            


        
అక్కడ నుంచి "నెహ్రు జంతు సంరక్షణశాల". అన్ని రకాల జంతువులను అరగంటలో చూపించారు. అక్కడి నుంచి పర్యాటకశాఖ వారి భోజన శాలకు వెళ్ళాము.ఆ భోజనశాల గండిపేట్ ఉస్మాన్ సాగర్ దగ్గరలో ఉంది. రూ౬౫/- కి చక్కని భోజనం పెట్టారు. అసలు ఆ భోజనాన్ని చూస్తేనే కడుపు నిండి పోయింది. బహుశా వాళ్ళు పెట్టిన భోజనం కూడా నిజాం ప్రభువుల కాలం నాడు వండినది అనుకుంట. రెండు మెతుకులు తిని బతుకు జీవుడా అంటూ బయట పడ్డాం.అప్పటికి సమయం సాయంత్రం ౪:౩౦ అయింది.

 గోల్కొండ కోట మా తదుపరి గమ్యం. అక్కడ చూస్తె అన్ని పాడుబడ్డ గోడలు, పిచ్చి మొక్కలు. మాతో వచ్చినతను ఆ కోట గురించి తనదైన శైలిలో చెప్పాడు. రామదాసు చరసాల అందులో చూడదగ్గ ప్రదేశం.


అటు నుంచి సాయంత్రం ఏడు గంటలకు "లేజర్ షో" ఆకట్టుకున్నది. అక్కడ ఉన్నంత సేపు ఇంతకూ మునుపు జరిగిన బాంబు దాడి గుర్తొచింది.



 మొత్తానికి రాత్రికి ఇంటికి చేరే సరికి ఒళ్ళంతా పులిసిపోయింది.


Tuesday, November 23, 2010

తమిళ భాషాభిమానం?

ఇటీవలే విడుదల అయిన "రొబో" అనే అరవ చిత్రం మనము అందరమూ చూశాము. చాలా బాగుంది అని నాలుగు, ఐదు సార్లు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలానే ఇంతకు ముందు వచ్చిన "గజినీ","శివాజీ", "అపరిచితుడు" ఇలా అరవ చిత్రాలు అన్నింటిని వరుసగా ఆదరించాము. రజనీ నుంచి నిన్న వచ్చిన సూర్య వరకు తమిళ హీరోలు అందరు మనకు తెలుసు. కానీ ఎన్ని తెలుగు చిత్రాలు అక్కడ ప్రదర్శిస్తున్నారు. కనీసం "పోకిరి", "మగధీర", లాంటి వాటినైన అక్కడ చూశారా? అసలు తమిళనాడు లో ఎంత మందికి చిరంజీవి, బాలకృష్ణ తెలుసు? మన చిత్రాలు వాళ్ళు ఎందుకు చూడరు? మన వాళ్ళు గొప్ప చిత్రాలు తీయలేదా? నేను మొన్న ఆ మధ్య ఒక నెల రోజులు అక్కడ ఉన్న. నేను బాగా గమనించింది ఏంటంటే అక్కడ వాళ్ళు మాతృ భాషనూ ఎంతగానో ప్రేమిస్తారు. ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి ప్రతి ఒక్కరు తమిళ భాష మీద ఎనలేని ప్రేమ చూపిస్తారు. దీనికి చక్కటి ఉదాహరణ ఇటీవల అక్కడ జరిగిన తమిళ మహాసభలు. ఎంత ఘనంగా చేశారంటే దేశం మొత్తం ఆశ్చర్య పోయేలా చేశారు. ఆ తమిళ సభల గురించి అక్కడి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటే నాకు సిగ్గేసింది. వాళ్ళ మధ్యన ఉన్న ఐకమత్యం, మాతృ భాష మీద వాళ్ళకున్న ప్రేమ మనకు మచ్చుకుడా లేదు. మాతృభాష కన్నతల్లి తో సమానం. తెలుగును మర్చిపోతే తల్లిని మరచినట్లే.  తెలుగు వారందరం తెలుగే మాట్లాడదాం. "జై తెలుగు తల్లి ! జై జై తెలుగు తల్లి"

"తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకండ
యెల్లవారు వినగ యెరుగవే బాసాడి
దేశ భాష లందు తెలుగు లెస్స "



Tuesday, November 16, 2010

కష్టం అంటే ఏంటో తెలుసా ???

చచి చెడి ఎలాగోలా ఆ నాలుగేళ్ళు పాస్ ఐతే , తీర మార్కులేమో అరవై కన్నా రావు. మనతో పాటు చదివిన వాళ్ళందరికీ ఏదో ఒక దాంట్లో ఉద్యోగం వస్తుంది.మనకు మాత్రం ఉద్యోగం రాదు. ఇలాంటి పరిస్తితుల్లో ఇంటికి కొంత మంది వస్తుంటారు.వీళ్ళను ఏమి చేసిన పాపం లేదు. వీళ్ళు ఎవరంటే , ఇంతకూ క్రితమే భూమి పుటక ముందు నుంచి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, లక్షలు లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు. వీళ్ళు ముందు ఇంటికి వచ్చి నాలుగు పిచ్చి మాటలు చెప్తారు. వాళే మగాళ్ళు అనట్టు. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళ ఆఫీసులో అదే జరుగుతుంది. మీ వాడి వివరాలు పంపించండి నేను చూసుకుంటాను అని చెప్తారు.ఇంట్లో వాళ్ళకేమి తెల్సు, వాడు జేఫ్ఫాగాడు అని., వివరాలు పంపించు అంటారు. మనం పంపిస్తాం. అంత బాగానే వుంటుంది. అసలు కధ ఇప్పుడు మొదలు అవుతుంది. వాడికి అసలు అక్కడ అంత సీను వుండదు. దానిని కప్పిపుచ్చటానికి " మీ వాడికి అరవై మార్కులే వచాయి, మా దాంట్లో కనీసం డెబ్బై ఐన వుండాలి అన్నారు., అందులోను ఇంగ్లిష్లో మన వాడు వీక్" అని ఇలా ఏవేవో చెప్తాడు.ఆ డెబ్బై మార్కులు వస్తే వాడిని ఎందుకు అడుగుతాం,మనకే రాదా ఉద్యోగం.??? వాడిని బతిమిలాడాల??? దీనితో ఇంట్లో వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరీ మళ్ళి తిట్టటం మొదలు పెడతారు., సరిగ్గా చదవమంటే చదవలేదు అని. ఇంతకీ నేను అలాంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే., మీకు ఉద్యోగం వుంది, మీరు గొప్పోల్లు., కాదు అని అనటం లేదు., మీకు చేతనైతే సహాయం చేయండి.,లేదంటే నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతే కాని., మా జీవితాలతో ఆడుకోవద్దు. ఆ క్షణంలో తెలుస్తుంది కష్టం అంటె ఏంటో