Friday, February 18, 2011

సగజీవిత కాలం, సాధించింది శూన్యం


నేనేంటి? ఈ ప్రశ్ననాకు నేను చాలా సార్లు వేసుకున్నాను. పుట్టిన పాతికేళ్ళ తర్వాత, నేనేంటి అని ప్రశ్నించుకుంటే, అన్ని సార్లు నేనెంత? అనే సమాధానమే వచ్చింది. నేను ఏమి సాధించాను? నేను చాల కలలు కన్నాను. ఏ ఒక్కటి సాధించలేక పోయాను.

చిన్నప్పుడు బాగా పాటలు పాడేవాడిని, ఇప్పుడు పాడితే చంపేస్తాం అంటున్నారు.
కొన్ని రోజులు  వైద్యుడిని అవుదాం అనుకున్నా, కానీ ఇప్పుడు రోగిని అయ్యాను.
కత్తి లాంటి కళాశాలలో  చదవాలనుకున్నా, కానీ కాలవ పక్కన కళాశాలలో చదివా. 
కలెక్టర్ అవుదామని అనుకున్నా, కార్మికుడిని కూడా కాలేకపోయా.
ప్రజా ప్రతినిదిని అవుదామని అనుకున్నా, కనీసం ఓటు హక్కు కూడా పొందలా.    
రక్షకబటుడిని అవుదామని అనుకున్నా, నన్ను నేనే రక్షించుకోలేక పోతున్నా.
ఆరు పలక దేహం పొందాలనుకున్న, అరకిలో పొట్టతో ఉన్నా.
బ్యాంకులో అధికారిని అవుదామని అనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన కాలేకపోయా. 
మా కళాశాలలోనే ఉపాధ్యాయుడిని అవుదామని అనుకున్నా,నాలా ఇంకో నలుగురినీ చెడగొట్టటం ఇష్టం లేక ఆగిపోయా,

ఇలా ఎన్నో కలలు కన్నా, కానీ ఏది సాదించలేకపోయా,
కొన్ని కర్మ కాలి అవ్వలేక పోయా, కొన్ని కాలం కలిసి రాక అవ్వలేక పోయా.
కొన్ని బలిసి అవ్వలేకపోయా, కొన్ని బద్దకంతో అవ్వలేకపోయా.
కొన్ని అశక్తితో  అవ్వలేకపోయా, కొన్ని అనాసక్తితో అవ్వలేకపోయా.   

       కానీ మా మిత్రుడు హరీష్ చెప్పిన్నట్టు "ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది, ప్రతి కుక్కకి ఏదో ఒక కళ ఉంటుంది, ఆడిన ఆటలో గెలవటం కన్నా, ఆ ఆట మంచిగా ఆడటం ముఖ్యం. మనకు దేనిలో ప్రావీణ్యం ఉందొ అందులోనే రాణిస్తాం,  మనకూ ఒక రోజు ఉంటుంది" . అందరు శ్రీరామా చంద్ర లాగా ఉంటే, అతనికి మిగితా వాళ్ళకి తేడ ఏముంటుంది? అందుకే నా రోజు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నా,



Friday, February 11, 2011

అమ్మాయిలు అస్సలు అర్ధం కారు

            అమ్మాయిలు నాకు అస్సలు అర్ధం కారు. అప్పుడప్పుడు ఆశ్చర్యమేస్తుంది. వాళ్ళు  ఎలా ఆలోచిస్తారో వాళ్ళకైనా అర్ధం అవుతుందో లేదో అని నా అనుమానం.  రోజు పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఎంతో మంది అమ్మాయిలని చూస్తుంటాము. వాళ్ళల్లో చాల మంది దగ్గర ఫోన్లు ఉంటాయి. ప్రతి అమ్మాయి ఎవరితో ఒకరితో ఫోనులో రోజుకి 24 గంటలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ నాకెందుకు ఎవరూ ఫోన్ చేయరు? నాతోనే అనుకున్నా, నా స్నేహితుల్లో చాలా మంది ఇదే అనుమానాన్ని  వ్యక్తం చేశారు. అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలతో మాట్లాడతారు? వాళ్లు అబ్బాయిల నుంచి ఏమేమి లక్షణాలు ఆశిస్తారు? సాదారణంగా ఈ రోజులలో అందమైన అమ్మాయిలు ఎందుకూ పనికిరాని వెధవలనే ఇష్టపడుతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? తప్పు ఎవరి దగ్గర ఉంది? ప్రేమ గుడ్డిది లాంటి కాకమ్మ కబుర్లు పక్కన పెడితే, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.

               చాలా మంది చెప్పారు, అమ్మాయిలు బాగా, తమాషాగా మాట్లాడే వాళ్లని ఇష్టపడతారు అని, కాదు బాగా జుత్తు ఉన్న వాళ్లని  ఇష్టపడతారు అని కొందరు, మంచి మనసు ఉండాలి అని కొందరు( కొరికి చూస్తె తెలుస్తుందేమో మంచి మనసో కాదో),  తెల్లగా ఉంటే ఇష్టపడతారు అని ఇంకొందరు,  బాగా చదివే తెలివిగల్ల వాళ్లని ఇష్టపడతారు అని, కాదు కాదు  ఆరు పలకల శరీరం ఉండాలి అని, ఇవ్వన్ని కాదు డబ్బు ఉంటె చాలు అని రక రకాలుగా విశ్లేషించారు. ఇక మన విషయానికి వస్తే తమాషాగా మాట్లాడటం చేతగాక పోగా పెడ పెడగా, వెటకారంగా మాట్లాడటం అలవాటు. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత జుత్తు కూడా  అంతంత  మాత్రంగానే ఉంది, మనసు కూడా ఏమంత మంచిది కాదు, తెల్లగా మహేష్ బాబు లాగా ఉండము, ఇక ఈ జామున చదువు, డబ్బు సంగతి ఎందుకులే,  పొట్ట తప్ప పలకలు లేవు. చివరికి ఒక్క లక్షణం కూడా అనుకూలంగా లేదు. ఇక అమ్మాయిలు ఇష్టపడే అవకాశమే లేదు. కాబట్టి  రాత్రులు గంటలు గంటలు నిద్ర చెడగొట్టుకొని ఫోనులో మాట్లాడే బాధ లేదు. శని, ఆది వారాలు డబ్బులు ఖర్చు చేసి కాపలా కుక్కలా అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, ఒక్క ముక్కలో వెధవలం కావాల్సిన పని లేదు. 

            చిత్రాలలో చూపిస్తుంటారు కదా, కధానాయిక కనపడగాల్నే కధానాయకుడికి వెనక ఒక పది మంది గిటార్, వయలిన్ వాయిస్తునట్టు అనిపిస్తుంది. నాకు ఎంతో మంది అమ్మాయిలని చూసినప్పుడు అలా అనిపించింది, పది మంది కాదు వంద మంది వాయించినట్టు అనిపించింది. కానీ చూసి అక్కడితో వదిలేయాలి. అంతే కాని  ప్రేమ పెళ్లి అంటే ఎలా? ఎంత మందినని చేసుకుంటాం. ఇంకొన్ని చిత్రాలలో కధానాయిక పాప గుళ్లో అందంగా భక్తి పాటలు పాడుతుంటుంది. మన కధానాయకుడికి దేవుని మీద నమ్మకం ఉండదు, అదేంటో గుడికి వెళ్తే మనోడికి నామూషి, అందుకని వాడి అమ్మో, అక్కో గుడికి వస్తే తోడుగా వచ్చి బయట నుంచుంటాడు తప్ప గుళ్లోకి రాడు. కానీ  కధానాయిక పాప పాట వింటే మాత్రం వస్తాడు. నేను ఎన్ని సార్లు గుడికి పోయినా ఒక్క అమ్మాయి కూడా పాట పాడటం వినలేదు. మీకు ఎవరికైనా అలాంటి గుళ్లు తెలిస్తే  నాకు తప్పకుండా చెప్తారు కదూ!!!!! కాలేజీలో ఎంతో అందమైన అమ్మాయిలు ఉంటారు, కానీ ఒక్కళ్లు నా తరగతిలో ఉండే వారు కాదు,  అలానే నా కార్యాలయంలో కూడా  ఎంతో అందమైన అమ్మాయిలు, కానీ ఏ ఒక్కరూ నాతో కలిసి పనిచేయటంలేదు.

                 నిన్న నా స్నేహితుడు ఒక తమాషా మాట చెప్పాడు, "ఒక అమ్మాయిని అయితే  "ఎవడు నువ్వు ప్రేమించిన వెధవ?" అని అడుగుతారు, అదే అబ్బాయిని అయితే "వెధవ ఎవరూ రా ఆ అమ్మాయి?""అని అడుగుతారుట. అంటే చివరికి మనమే ఎదవలం అనమాట!!!! అంటే అమ్మాయిలు వెధవల్నే ప్రేమిస్తారా? లేక వాళ్లు ప్రేమించిన తర్వాత అబ్బాయిలు వెధవలు అవుతార?? ఇది కూడా నాకు అర్ధం కానీ ప్ర.శ్నే. 

          కానీ ఫలానా అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి కాదన్నదని, ఆత్మహత్య చేసుకునేవాళ్లని చూస్తే నాకు జాలేస్తుంది. అమ్మాయిలు ఇష్ట పడకపోతే చావాలి అంటే  మేము రోజుకు ఒక అరడజను సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.  అయినా కన్న తల్లితండ్రుల కోసం, పెళ్ళాం పిల్లల కోసం, మనమంటే ప్రాణాలిచ్చే స్నేహితుల కోసమో చావటం అంటే అర్ధం ఉంటుంది కానీ, అమ్మాయి కోసం చావటం ఏంటి?  పాకిస్తాన్లో గొడవలు జరిగితే ఆంధ్ర ముఖ్యమంత్రిని రాజీనామా చేయమనట్టు. అలా చావద్దు అని శంకర దాదా చిత్రంలో చిరంజీవి అన్నయ కూడా చెప్పాడు కదా.  ఈ మధ్య అబ్బాయిలకోసం అమ్మాయిలు కూడా పురుగుల మందు తాగుతున్నారని వార్తా పత్రికల్లో చదివా. నా కోసం ఏ అమ్మాయి కనీసం మంచినీళ్ళు కూడా తాగటం లేదు. ప్రేమికుల రోజు కోసమని, ఏదో ఒక బహుమానం కొందాం అనుకున్న,  కానీ ఏమి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో అర్ధం కాక ఆగిపోయా!!!

Thursday, February 10, 2011

పనికి మాలిన పద్నాలుగోతారీకు

            చనిపోయిన వారికి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతారు. నా చిన్నతనంలో, అలా ఎందుకు చేస్తారు అని మా మల్లి మామని అడిగాను. చనిపోయిన వారిని స్మరించుకోవటానికి, వారి ఆత్మకి శాంతి కలగాలని అలా చేస్తారురా అని చెప్పాడు.ఐతే మరి,  ప్రేమికులకు సంవత్సరానికి ఒక రోజు(ప్రేమికుల రోజు) అంటే అర్ధం ఏంటి? గత సంవత్సరంలో ప్రేమించిన అబ్బాయి/అమ్మాయి ని స్మరించుకుంటూ, కొత్త వాళ్ళ కోసం వెతికే రోజనా దీని అర్ధం? అంతే కదా, పోయిన సంవత్సరం ప్రేమికుల రోజుకి కలిసి ఉన్నవాళ్ళలో ఎంత మంది ఈ సంవత్సరం కలిసి ఉన్నారు?కొంతమంది "మా దగ్గర దాచుకోలేనంత ప్రేమ వుంది అది ఎంత మందికైన పంచుతాము" అని గుళ్లో ప్రసాదం పంచినట్టు ప్రేమను పంచుతున్నారు.

             "తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది" అన్న చందాన నాకు కూడా సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు, "చూడరా, మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే ప్రేమికుల రోజున బహుమతి ఏదైనా ఇచ్చి నీ ప్రేమను వ్యక్తం చెయ్" అని ఎంతో ప్రోత్సహించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఎల్ల వేళలా కాపాడాలి. ఆ దరిద్రపు ఆంగ్లంలో ఆ మూడు ముక్కలు ఉండనే ఉన్నాయి కదా "ఐ లవ్ యు " అని, బడికి వెళ్ళే బుడ్డోడి దగ్గర నుంచి పెళ్లి అయి నలుగురు పిల్లల తండ్రి అయిన ముసిలోళ్ళ దాక ప్రతి ఒక్కళ్ళు ఆ మూడు ముక్కలు చెప్తున్నారు. అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా? నన్ను తప్ప ప్రతి ఎదవనీ ఇష్టపడుతున్నారు. ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దానికి మళ్లీ ఎటువచ్చీ ఇంకో ఆంగ్ల పదం ఉండనే వుంది కదా, "ప్రపోస్" చేయటం.

             ఇక అ రోజు తినటం, తిరగటం, బహుమతులు ఇచి పుచ్చుకోవటం, నానా రచ్చ చేయటం మాములే. ఏదో ఆ శివసేన కార్యకర్తల పుణ్యమా అని కొంచం వెనక్కు తగ్గుతున్నారు కానీ, లేదంటే ఆ రోజు కొన్ని ప్రదేశాలలో కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్తితి. ఈ సారి నేను కూడా మా కార్యాలయంలో ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయికి ఆ మూడు ముక్కలు చెప్పేదాం అనుకుంటున్నా. ఐతే కార్యాలయంలో అమ్మాయిలు అంతా సామూహికంగా సెలవ తీసుకుంటారేమో అని వదిలేశా. అయినా ఇది కూడా ఒకందుకు మంచిదేలే, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇళ్ళల్లో వాళ్లు కష్టపడకుండా, ఎవరికి వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్లతో, ఎవరి ఇష్టం వచ్చిన అన్ని సార్లు, ఇష్టం వచ్చిన గుడిలో, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు.అసలు ఈ కుల మతాల సమస్య కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని రోజులు ఇలానే ఉంటే, ఎవడి కులం ఏంటో తెలుసుకోవటానికి వారం పట్టుది. ఇలానే మొన్న ఒక స్నేహితుడి దగ్గర నోరు జారా, వాడికి ఎక్కడ మండిందో తెలియదు, "ప్రేమ గురించి నీకేం తెలుసురా, అది ఒక అందమైన అనుభూతి, అనుభవైకమే తప్ప చెప్పనలవి కానిది, మనసు మమత, మొలతాడు, మంగళ సూత్రం.........." అని ఏదేదో చెప్పాడు. అవునులే "చెప్పు రుచెరుగు కుక్క చెరకు తీపెరుగునా" అని వేమనగారు ఆనాడే చెప్పారు.

             మీకు యువనేత దినపత్రిక(సాక్షి)  చదివే అలవాటు ఉంటె, అందులో ఒక శీర్షిక వస్తుంది. అందులో ప్రేమవైద్యుడు గారు సలహాలు ఇస్తుంటారు, నేను కేవలం ప్రశ్నలు మాత్రమే చదువుతా(జవాబులు చదివే అంతా దైర్యం ఎప్పుడు చేయల). అందులో ఉదాహరణకు ఒక ప్రశ్న మీ కోసం, "అన్నయ్య, నేను పదో తరగతిలో ఒక అబ్బాయిని ప్రేమించా, తను ఇంతకు ముందే వేరే అమ్మిని ప్రేమిస్తున్నాడు. అయినా నేను చెప్పే సరికి నన్ను ప్రేమించాడు. మేము ఇద్దరం చాల బాగా ప్రేమించుకున్నాం, కానీ ఇప్పుడు తను ఇంకో అమ్మిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, నాతొ మాట్లాడటం లేదు, ఐతే ఈ మధ్య నాకు ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడు. తను నన్ను ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఇంతకు ముందు మోస పోయాను అని ఊరుకోవాలా? లేక నన్ను అమితంగా ప్రేమిస్తున్న అతని ప్రేమని అంగీకరించాలా?" ఇంకా చదవటం నా వల్ల కాక, వదిలేశా., ఇలాంటి ప్రేమలన్నింటికి ఈ పనికి మాలిన పద్నాలుగోతారీకు కూడా ఒక కారణం.

Thursday, February 3, 2011

నాలుగో పాట, నభూతో నభవిష్యతి

ఈ పాట "ఆజా నాచలె" చిత్రం లోని "ఓ రే పియ" 

పల్లవి :
                 ఓ నా ప్రియా!!
                  తోలి చూపులోనే, నను దోచినావే, నీ స్పర్శతోనే మైమరచినానే,  
                                                                                                 || ఓ నా ప్రియా ||
చరణం:
                  ఆకల్లేదే, దాహంలేదే, నీ ప్రేమలో పడ్డాకనే
                  వయ్యారి నీ వాలుజడతో భందిమ్చకే
                  హరివిల్లులానీ నడుమూగుతుంటే , అది తడమకుండా నేనుండలేనే,
                                                                                                 || ఓ నా ప్రియా ||

చరణం:
                 నాకే నేను గుర్తుకురాను, నీ మీదనే నా ఆలోచనే,
                 సొంతం అవుతా ఇక పై నీకే, దరిచేరవే
                  ప్రతి ఘడియలోనూ నీ ఊసులేనే, క్షణమైనా నిన్ను విడిచుండలేనే
                                                                                                 || ఓ నా ప్రియా ||
చరణం:
                 అంతేలేని ఆసలు ఎన్నో, ఉప్పొంగెనే,
                 సుందరినీ  సొగసుతోనే, చంపెయ్యకే
                 ఏమాయో చేసి, యద గిల్లినావే, ఏ కష్టమైనా , నాతోడు నీవే
                                                                                                 ||  ఓ నా ప్రియా ||