Thursday, February 10, 2011

పనికి మాలిన పద్నాలుగోతారీకు

            చనిపోయిన వారికి సంవత్సరానికి ఒకసారి తద్దినం పెడతారు. నా చిన్నతనంలో, అలా ఎందుకు చేస్తారు అని మా మల్లి మామని అడిగాను. చనిపోయిన వారిని స్మరించుకోవటానికి, వారి ఆత్మకి శాంతి కలగాలని అలా చేస్తారురా అని చెప్పాడు.ఐతే మరి,  ప్రేమికులకు సంవత్సరానికి ఒక రోజు(ప్రేమికుల రోజు) అంటే అర్ధం ఏంటి? గత సంవత్సరంలో ప్రేమించిన అబ్బాయి/అమ్మాయి ని స్మరించుకుంటూ, కొత్త వాళ్ళ కోసం వెతికే రోజనా దీని అర్ధం? అంతే కదా, పోయిన సంవత్సరం ప్రేమికుల రోజుకి కలిసి ఉన్నవాళ్ళలో ఎంత మంది ఈ సంవత్సరం కలిసి ఉన్నారు?కొంతమంది "మా దగ్గర దాచుకోలేనంత ప్రేమ వుంది అది ఎంత మందికైన పంచుతాము" అని గుళ్లో ప్రసాదం పంచినట్టు ప్రేమను పంచుతున్నారు.

             "తా చెడ్డ కోతి వనమంతా చెరిచింది" అన్న చందాన నాకు కూడా సలహాలు ఇవ్వటం మొదలు పెట్టారు, "చూడరా, మంచి అమ్మాయి ఎవరైనా ఉంటే ప్రేమికుల రోజున బహుమతి ఏదైనా ఇచ్చి నీ ప్రేమను వ్యక్తం చెయ్" అని ఎంతో ప్రోత్సహించారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఎల్ల వేళలా కాపాడాలి. ఆ దరిద్రపు ఆంగ్లంలో ఆ మూడు ముక్కలు ఉండనే ఉన్నాయి కదా "ఐ లవ్ యు " అని, బడికి వెళ్ళే బుడ్డోడి దగ్గర నుంచి పెళ్లి అయి నలుగురు పిల్లల తండ్రి అయిన ముసిలోళ్ళ దాక ప్రతి ఒక్కళ్ళు ఆ మూడు ముక్కలు చెప్తున్నారు. అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా? నన్ను తప్ప ప్రతి ఎదవనీ ఇష్టపడుతున్నారు. ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. దానికి మళ్లీ ఎటువచ్చీ ఇంకో ఆంగ్ల పదం ఉండనే వుంది కదా, "ప్రపోస్" చేయటం.

             ఇక అ రోజు తినటం, తిరగటం, బహుమతులు ఇచి పుచ్చుకోవటం, నానా రచ్చ చేయటం మాములే. ఏదో ఆ శివసేన కార్యకర్తల పుణ్యమా అని కొంచం వెనక్కు తగ్గుతున్నారు కానీ, లేదంటే ఆ రోజు కొన్ని ప్రదేశాలలో కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్తితి. ఈ సారి నేను కూడా మా కార్యాలయంలో ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయికి ఆ మూడు ముక్కలు చెప్పేదాం అనుకుంటున్నా. ఐతే కార్యాలయంలో అమ్మాయిలు అంతా సామూహికంగా సెలవ తీసుకుంటారేమో అని వదిలేశా. అయినా ఇది కూడా ఒకందుకు మంచిదేలే, ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇళ్ళల్లో వాళ్లు కష్టపడకుండా, ఎవరికి వాళ్లు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్లతో, ఎవరి ఇష్టం వచ్చిన అన్ని సార్లు, ఇష్టం వచ్చిన గుడిలో, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు.అసలు ఈ కుల మతాల సమస్య కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని రోజులు ఇలానే ఉంటే, ఎవడి కులం ఏంటో తెలుసుకోవటానికి వారం పట్టుది. ఇలానే మొన్న ఒక స్నేహితుడి దగ్గర నోరు జారా, వాడికి ఎక్కడ మండిందో తెలియదు, "ప్రేమ గురించి నీకేం తెలుసురా, అది ఒక అందమైన అనుభూతి, అనుభవైకమే తప్ప చెప్పనలవి కానిది, మనసు మమత, మొలతాడు, మంగళ సూత్రం.........." అని ఏదేదో చెప్పాడు. అవునులే "చెప్పు రుచెరుగు కుక్క చెరకు తీపెరుగునా" అని వేమనగారు ఆనాడే చెప్పారు.

             మీకు యువనేత దినపత్రిక(సాక్షి)  చదివే అలవాటు ఉంటె, అందులో ఒక శీర్షిక వస్తుంది. అందులో ప్రేమవైద్యుడు గారు సలహాలు ఇస్తుంటారు, నేను కేవలం ప్రశ్నలు మాత్రమే చదువుతా(జవాబులు చదివే అంతా దైర్యం ఎప్పుడు చేయల). అందులో ఉదాహరణకు ఒక ప్రశ్న మీ కోసం, "అన్నయ్య, నేను పదో తరగతిలో ఒక అబ్బాయిని ప్రేమించా, తను ఇంతకు ముందే వేరే అమ్మిని ప్రేమిస్తున్నాడు. అయినా నేను చెప్పే సరికి నన్ను ప్రేమించాడు. మేము ఇద్దరం చాల బాగా ప్రేమించుకున్నాం, కానీ ఇప్పుడు తను ఇంకో అమ్మిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు, నాతొ మాట్లాడటం లేదు, ఐతే ఈ మధ్య నాకు ఇంకో అబ్బాయి పరిచయం అయ్యాడు. తను నన్ను ఇంకా బాగా ప్రేమిస్తున్నాడు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? ఇంతకు ముందు మోస పోయాను అని ఊరుకోవాలా? లేక నన్ను అమితంగా ప్రేమిస్తున్న అతని ప్రేమని అంగీకరించాలా?" ఇంకా చదవటం నా వల్ల కాక, వదిలేశా., ఇలాంటి ప్రేమలన్నింటికి ఈ పనికి మాలిన పద్నాలుగోతారీకు కూడా ఒక కారణం.

No comments:

Post a Comment