ఈ మధ్య చాల మందికి(దాదాపు అందరికి) మందు తాగటం ఒక గొప్ప అలవాటు అయింది. అదేంటో మందు తాగటం అలవాటు లేదంటే "ఇంకా ఎదగలేదా?", "మందు తాగటం కూడా రాదా?" అని అడుగుతున్నారు. మొన్న మధ్య నా స్నేహితుడొకడు చాల కాలం తరువాత కలిశాడు. మాటల సంధర్బంలో "ఏరా ఇప్పటికైనా తాగటం మొదలు పెట్టావా, లేక ఇంకా పప్పు లాగ అలానే ఉన్నావా?" అని అడిగాడు.
మనం గమనిస్తే భోజనం చేయటానికి వెళ్ళేవాడు, పక్కనున్న వాడిని "రారా భోజనం చేద్దాం" అని మాత్రం అడగడు. కాని మందు తాగటానికి వెళ్ళేవాడు మాత్రం ఖచితంగా "రారా మామ, పోయి కాస్త మందు కొట్టి వద్దాం" అని మాత్రం అడుగుతాడు. సరే ఇక అసలు విషయానికి వద్దాం. మందు తాగటం తందనాలాడటం పక్కన పెడితే, నా స్నేహితులలో కొంత మంది మందు బాబులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ తాగుతూ ఉంటారో? లేక తాగినప్పుడే నేను గుర్తుకు వస్తానో? తెలియదు.
ఎప్పుడు నాకు ఫోను చేసినా తాగటం తప్ప ఇంకో దాని గురించి మాట్లాడారు. ఉదాహరణకు మొన్న ఒక స్నేహితుడు ఫోన్ చేసాడు., ఆ సంభాషణ ఇలా సాగింది..,
నేను: ఏరా? ఎలా ఉన్నావు?
స్నేహితుడు: ఏముంది రా, ఇప్పుడే అలా బజార్కి వెళ్ళాను, మా స్నేహితుడు ఒకడు కలిశాడు, హయిగా తాగి వచ్చాము.
నేను: ఏంటి విశేషాలు?
స్నేహితుడు: మొన్న మన సురేష్ కలిశాడు రా, ఇద్దరం కలిసి మన కే.బి. రెస్టారెంట్లో తాగము రా., అబ్బో కేక అనుకో.
నేను: ఎలా ఉన్నాడు రా? వాడిని కలిసి చాలా రోజులైంది.
స్నేహితుడు: వాడికేమి రా, ఎత్తినది దించకుండా తాగాడు. అబో నాలుగు బుడ్డీలు తాగాములే., అయినా తాగనోడివి నీకెందుకు రా మందు గురించి?
నేను: (నేను మందు గురించి ఎప్పుడు అడిగాను?) ఇంకా??
స్నేహితుడు: ఎప్పుడొస్తావు రా ఒంగోలు? ఇంతవరకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు మందు ఇప్పించలేదు రా.,
నేను: రేపు సింగరకొండ తిరునాళ్ళకి వస్తాను లేరా.
స్నేహితుడు: మీ S/W వాళ్ళు అందరూ బాగా తాగుతారట కదరా? నువ్వు కూడా మొదలు పెట్టు, కలిసి పండగ చేద్దాం. (తా చెడ్డ కోతి వనమంతా చేరచిందంటే ఇదే)
నేను: ఒరేయ్, మీ పక్క వీదిలో ఆ అమ్మాయి ఏమి చేస్తున్నది రా? (కొంపతీసి అ అమ్మాయి కూడా తాగుతున్నది అని చెప్తాడేమో అనుకున్న)
స్నేహితుడు: ఆ బాగానే ఉంది రా.,ఒంగోలు వచ్చే ముందు ఫోను చెయ్.
ఇలా ఫోనులోనే కాదు కలిసినప్పుడు కూడా ఇంతే, మందు రామాయణం తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకొకడైతే హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు వాడికి తెలుసు. ఫలానా బాలానగర్లో ఓ చిరునామా అడిగితె, "అదా., ఆ రెస్టారెంట్ పక్క వీదిలోనే., పోయినా నెలే అక్కడ తాగింది." అని చెప్తాడు.