Friday, May 27, 2011

నీ స్నేహం ఇక రాదు అని.....

జీవితంలో ఎప్పుడు సంతోషాలే ఉండవు. అప్పుడప్పుడు కష్టాలు కుడా ఉంటాయి. అలా ఉంటేనే జీవితం అవుతుంది. లేకపోతె జీవితం వెల్తిగా ఉంటుంది. అలాంటి కష్టం ఇప్పుడు నాకు వచ్చింది. అది మీ అందరితో పంచుకుందామని ఈ శీర్షిక రాస్తున్నాను. మన జీవితంలోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. కానీ కొంత మంది పోయేటప్పుడు చాల బాదేస్తుంది. వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అలాంటి ఒక స్నేహం నాకు దూరం అయింది.

మా స్నేహం ఇప్పటిది కాదు, 24 సంవత్సరాల అనుభందం. ఒకరికి ఒకరం కష్టాల్లో, బాధల్లో తోడుగా ఉన్నాం. నాకు ఎ కష్టం వచ్చిన నాకు అండగా నిలిచింది మా స్నేహం. ఎన్నో సార్లు మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చాయి. కానీ అవి ఎప్పటికప్పుడు మొబ్బులా తేలిపోయాయి. తనతో సాగిన ప్రయాణం ఏంతో మధురంగా గడిచింది. ఎంతో మంది నా వాళ్ళు నన్ను కాదు అని వెళ్ళిపోయినా, నాకు దైర్యం చెప్పి, నా వెన్నంటే ఉన్న స్నేహం ఇప్పుడు నాతో లేదనే నిజాన్ని నేను జీర్ణించుకోవటం కొంచం కష్టమే!!

ఇదివరకు నన్ను కాదని చాల మంది నా నుంచి వెళ్ళిపోయారు. నా అవసరాన్ని తెలుసుకుని మళ్లి నాతో చేరారు. వెళ్ళేటప్పుడు తిట్టినా వాళ్లే, నాతో చేరేటప్పుడు నేనే గొప్ప అని పొగిడారు. ఇలాంటివి నాకు కొత్త కాదు. ఐనా నా జీవితంలో ఇక ఆ స్నేహానికి చోటు లేదని తెల్సి నాలో బాధ, రాజ శేఖర రెడ్డి ప్రభుత్వంలో నదులు పొంగినట్టు ఉప్పొంగి పోతున్నది.

ఆంగ్లంలో ఒక సామెత ఉంది "A friend in need is a friend in deed" అంటే తెలుగులో "ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు". నీకు తెల్సు ఆరేళ్ళుగా నేను పడుతున్న కష్టం, ఈ మధ్య కాలంలో మరెన్నో సమస్యలు ఇంట బయట నాకు నిద్ర పట్టకుండా చేస్తుంటే., ఇప్పుడు వెళ్లిపోతనంటావా ????

నీవు నాతొ మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్టు, జీవితం సూన్యంలా అనిపిస్తున్నది. నీకు తెల్సు నాకు ఎన్ని సమస్యలున్నాయో. ఆరు సంవత్సరాల నుంచి నేను పడుతున్న బాధ, నా కష్టాలు అన్ని నీకు తెల్సు. ఇన్నాళ్ళు అన్నింటిలో నువ్వు తోడూ ఉన్నావ్ అన్న దైర్యం నన్ను నడిపించింది. నా కోసం కనీసం ఈ శీర్షిక చదివిన తర్వాత ఐనా మళ్లి వచ్చి నాతొ చేరతావని, మునుపటి లాగా మాట్లాడతావని ..... ఆశిస్తూ.......
ఇట్లు,
మీ చంద్ర బాబు నాయిడు,
జై తెలుగుదేశం, జై జై చంద్ర బాబు.

(నాగం జనార్ధన రెడ్డి గారి కోసం మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ చాణక్యుడు,భావి భారత ప్రధాని, ఆంధ్ర ప్రదేశ్ CEO, చంద్రబాబు నాయుడి గారి మనో వేదనని తమాషాగా.,)

Friday, May 20, 2011

తెలుగు లేని తెలుగు చిత్రం


మైసూరుపాక్ లో మైసూరు ఉంటుందా? బందరు లడ్డులో బందరు ఉంటుందా? అలానే తెలుగు చిత్రాలలో తెలుగు ఉండదు. ఇది సత్యం. ఇటీవల విజయవంతం ఐన రెండు తెలుగు చిత్రాల పేర్లు చెప్పండి? "Mr.Perfect", "100%Love". పేర్లు మాత్రమె ఆంగ్లంలో ఉన్నాయి అనుకుని వెళ్ళాను. కానీ చిత్రం ఆసాంతం ఆంగ్లంలోనే ఉంది. ఆఖరికి పాటలు కూడా ఆంగ్లంలోనే ఉన్నాయి. "Infactuation" అని, నా పిండాకూడని పాటల్లో కూడా ఆంగ్ల పదాలే ఎక్కువ వినపడ్డాయి. ఈ మధ్య ఆంగ్లంలో మాట్లాడటమే అనుకున్నా, పాటలు రాయటం కూడా ఒక వేలంవెర్రి అయ్యింది. తెలుగులో చక్కని పదాలతో రాసే అవకాశం ఉన్నా, రాయటంలేదు. ఉదాహరణకు Mr.Perfect చిత్రంలోని ఈ పాటని చూద్దాం.


ఆకాశం బద్దలైన sound గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న light కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై ride చేసెయ్, rocket లా మనసుని
సై సై సై side చేసెయ్, signals తో ఎం పని?
ఇక hi-way లైన one-way లైన కదలదే బండి तेरे बिना

ఈ పాటని చక్కగా తెలుగులో ఎంత సరళంగా రాయచ్చో చూద్దాం.

ఆకాశం బద్దలైన మోత గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిశాక
మేఘాలే గుద్దుకున్న కాంతి కళ్లలోన చేరుకుంది నిన్ను కలిశాక
రై రై రై రయ్యిమంటూ, రోజంతా గడవని
సై సై సై సిగ్గు దోచేయ్, సమయంతో ఎం పని?
ఇక ఏదేమైనా, ఎప్పటికైనా కదలదే బండి నువ్వులేకున్న!!

ఇలా తేట తెలుగులో రాస్తే ఎంత బాగుంది? చెప్పండి!!! ప్రాస కలిసింది, ఇక అర్ధం అంటారా? ఎ బూతు రాస్తే ఏంటి చెప్పండి? అందులోనే ఇంకొక చోట

"ఇక daating ఐన fighting ఐన గడవదే రోజు तेरे बिना(తేరే బిన)" అని రాసారు, దాని బదులు
"ఇక సరసం ఐన సమరం ఐన గడవదే రోజు నువ్వు లేకుండా" అని తెలుగులో రాస్తే ఎంత కమ్మగా ఉంది!!!

ఆ तेरे बिना(తేరే బిన) అనే పదం పాటలో చాల సార్లు వాడారు. ప్రతి చోట తెలుగులో మార్చే అవకాశం ఉంది. కానీ రాయరు. అసలు ఆ పాటలో మొత్తం మీద 27 ఆంగ్ల పదాలు ఉన్నాయి. ఈ ఒక్క పాటే కాదు, ఇలా చాలా పాటలు ఉన్నాయి. తేట తెలుగు పాటని ఆంగ్లంతో తాట తీయటంతోటి, తెలుగు కనపడకుండా పోతున్నది.

పై పాట రాసినతని పేరు "అనంత శ్రీరామ్" అట!!!! పేరు ఐతే నా పేరుతొ కల్సింది కాని, నా అంత బాగా రాయాలంటే కష్టం కదా!! ఏదో తనకున్న పరిదిలో, తనకున్న పరిజ్ఞానంతో బాగానే రాసాడు. కాకపోతే తెలుగు పాటగనుక తెలుగులో రాస్తే బాగుండేది.

ఇది ఈ రోజు వచ్చింది కాదు. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు చిరంజీవి మామయ్య చిత్రంలో
"నవ్వింది మల్లె చెండు, నచ్చింది girl friend" అనే పాట మీకు గుర్తుండే ఉంటుంది. దానినే తెలుగులో చక్కగా
" నవ్వింది మల్లె చెండు, నచ్చింది జాంపండు" అని రాస్తే, బాల సుబ్రహ్మణ్యం గారికి పాడటం కష్టమవ్వదు కదా? రాయటం రాకపోతే నాలాంటి వాళ్ళని అడిగితె చెప్తాము కదా!!!!!!!

ఇలా చెప్పుకుంటూ పొతే చాల పాటలు ఉన్నాయి., మొన్నా మధ్య ఒక తెలుగురాని స్నేహితుడితో తెలుగు చిత్రానికి వెళ్ళాము. వాడు మొదట అర్ధం కాదేమో అని భయపడ్డాడు. "నీకు అర్ధం కాకపోతే నన్ను అడగరా చెప్తాను" అన్నాను. వాడు, చిత్రం ఆసాంతం మహా ఐతే ఒకటి రెండు సార్లు నన్ను అడిగి ఉంటాడేమో. ఆ చిత్రంలో కధానాయకుడు ఆస్ట్రేలియాలో ఇంజనీర్. మన కధానాయకుడు ఎక్కడైనా తెలుగులో మాట్లడతే ఈల వేద్దాం అని నా రెండు వెళ్ళు నోట్లో పెట్టుకుని కూర్చున్నాను . వేళ్ళు తడిసి ముద్ద అయ్యాయి తప్ప, మన కదానాయకుడు తెలుగులో మాట్లాడింది లేదు, నేను ఈల వేసింది లేదు. దీన్ని బట్టి అర్ధం అవుతుంది తెలుగు చిత్రాలలో తెలుగు ఎ మాత్రం ఉందో??



ఈ విషయం మీద నేను ఆ దర్శక నిర్మాతలతో మాట్లాడాను. "అనంతరామయ్య గారు, చిత్రాలు నిజ జీవితానికి దగ్గర తీయాలని ప్రయత్నించాము. మన వాళ్ళు తెలుగులో మాట్లాడటం తక్కువే కదా, అదే మా చిత్రంలో చూపించాం" అని అన్నారు.నిజామే కదా., ప్రతి కుక్కకి ఆంగ్లంలో మాట్లాడటం ఒక వెర్రి అయింది.

మొన్నా మధ్య విడుదలైన "కొంచం ఇష్టం కొంచం కష్టం" అనే చిత్రానికి దర్శక నిర్మాతలు తప్ప మిగిలిన వారెవ్వరూ తెలుగువారు కాదని తెల్సి ఆశ్చర్యపోయా. ఎలాగూ మనవాళ్ళకి తెలుగు కధానాయికలు నచ్చరు కాబట్టి కధానాయిక తెలుగు పాప కాదు, అస్సలు తెలుగు రాదు. కధానాయకుడు తెలుగు వాడు కాదు, సంగీత దర్శకుడు తెలుగు వాడు కాదు., అందరు తెలుగు వాళ్ళే ఉండాలా అంటే కాదు కాని, తెలుగు వాళ్ళైతే బాగుంటుంది అంటున్నాను. అంతేలే, తిరుమలలో గుండు చేయించుకొని, కొండ దిగొచ్చి ఎవడైనా తిరుపతిలో దువ్వెన కొంటాడా? జగన్ అన్న బొమ్మ లేకుండా సాక్షి దినపత్రిక వస్తుందా? ఆంగ్లం లేకుండా తెలుగు చిత్రాలు వస్తాయా? నా పిచ్చి కాక పొతే!!!!!
సశేషం.............

Wednesday, May 11, 2011

"కాదేదీ వ్యాపారనర్హం"

"కాదేదీ కవితకనర్హం" అని మనం విన్నాం. కానీ రోజుల్లో వాక్యాన్ని మనం కొద్దిగా మార్చాల్సిన పరిస్థితి, "కాదేదీ వ్యాపారనర్హం". ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతిదీ వ్యాపారమే. ఆఖరకు శవాల మీద కూడా వ్యాపారం చేసే వాళ్ళున్నారు. పోయిన నెలలో అలాంటి వ్యాపారాలు నేను రెండు చూశాను. మొదటిది పైన చెప్పినట్టు చనిపోయిన వాళ్ళని కూడా వ్యాపారానికి వాడుకోవటం. పుట్టపర్తిలో సత్య సాయి బాబా చనిపోతే., మన టీవీ వాళ్ళు వార్త మీద ఎంత వ్యాపారం చేశారో మనందరికీ తెల్సిన విషయమే. ఒక టీవీ ఛానల్ వాడు, " బాబా చనిపోయిన తర్వాత, ఆయన ముఖానికి శస్త్ర చికిత్స జరిగింది, అలా ఎందుకు చేయవలసి వచ్చింది? అని" ఎక్కువ సేపు కాకపోయినా ఒక రెండు మూడు గంటలు పాపం బిడ్డ, బాధ పడ్డాడు. ఇంకొకరేమో " నెల రోజులముందే పార్ధివ దేహానికి పేటిక తెచ్చారు, దీని అంతర్యం ఏంటి? ఇందులో ఏదో రహస్యం ఉంది. అంటే వీళ్ళకి ముందే తెలుసా?" అని తమదైన శైలిలో ప్రశ్నల పరంపర కొనసాగించారు. (ముందుగా తీసుకురాకుండా, చనిపోయిన తర్వాత మంచి ముహూర్తం చూసి పేటిక తయారు చేయాలేమో?). ప్రతి విషయాని సంచలనం చేయాలి, వ్యాపారం బాగుండాలి అన్న ఉదేశ్యంతో, కనీస జ్ఞానం మరచిపోయి, ఏది పడితే అది చెప్తున్నారు, చూపిస్తున్నారు.

ఇక రెండో వ్యాపారానికి వద్దాం. మొన్నామధ్య సకుటుంబ సమేతంగా(నాకింకా పెళ్లి కాలేదండోయి!!) తిరుపతి వెళ్ళాం. దగ్గరలో ఒక దేవాలయం విశిష్టమైనది అని ఎవరో చెపితే ముందుగా అక్కడికి వెళ్ళాం. దాదాపుగా తిరుపతి నుంచి ఐదు గంటల ప్రయాణం అనుకుంటా. దేవాలయం బయట, మా ఊర్లో ఆంధ్ర బ్యాంకు కన్నా అందంగా, ఒక చిన్న S/W కార్యాలయం లాగా ఉన్నది. దేవుడు దయవల్ల, అందులో మనకు మూడు రకాల సదుపాయాలు కల్పించారు.

ఒకటి ఉచిత దర్శనం: జనం లేకపోయినా ఒక రెండు మూడు కిలోమీటర్లు నడవాలి.
రెండు 100/- దర్శనం: నడవాల్సింది ఒక కిలోమీటర్ కు తగ్గించారు.
మూడు 500/- దర్శనం: దీనికే శీఘ్ర దర్శనం అని కూడా పేరు. నేరుగా గర్భగుడికి వెళ్లిపోవచ్చు.

నా ఆర్ధిక స్తోమత మీకు తెలియంది కాదు. పేదవాడిని, 500 సమర్పించుకోలేక, మధ్యస్తంగా 100/- దర్శనాన్ని ఎంచుకున్నాం. మా బామ్మగారికి 82 సంవత్సరాలు. కొంత దూరం ఐతే నడవగలదు. కానీ కిలోమీటర్లు అంటే కష్టం. దీనికి వాళ్ల దగ్గర ఒక ఉపాయం ఉందండో . 150/- కడితే మనకు ఒక తోపుదుకుర్చీ ఇస్తారు. అందులో వ్రుధ్ధులని దర్శనం చేయించి మళ్లీ గంటలో కుర్చీ వాళ్ళకి ఇచ్చేయాలి. లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వరు. గంటలో వస్తే 100/- వెనక్కి ఇస్తారు, ధర్మ ప్రభువులు. ఇందులో వాళ్ల మనుషులు తోస్తే ఇంకో 100/- ఎక్కువ తీసుకుంటారు. ఇన్ని సదుపాయాలు మనం ఎక్కడ చూసి ఉండం కదా!! నేనైతే చూడలేదు. సరే తోసేదేదో మనమే తోద్దాం, కనీసం "మాత్రుసేవా భాగ్యం" దొరుకుతుందని మా నాన్నగారే తీసుకెళ్ళారు.

దేవాలయం అంతా ఒక మహానుబావుడి సారధ్యంలో కట్టబడింది. ఇక ఆలయంలో అడుగు పెట్టగానే, దారికి ఇరువైపులా, విశాలాంధ్ర పుస్తక ప్రదర్సన మాదిరి పుస్తకాలు, CDలు, DVDలు, ఉన్నాయి. అన్నింటి మీద చూద్దాం అన్నా కానీ మాహానుభావుడి చిత్రం తప్ప ఎక్కడా దేవుడి చిత్రం కనపడితే ఒట్టు. ఇంకొంచెం ముందుకు వెళితే మాహానుభావుడి చిత్రం రక రకాల భంగిమలతో, దానికి తగ్గ నీతి వాక్యాలతో దర్శనమిస్తాయి. కొంచం సేపు అది అసలు అమ్మవారి గుడా? లేక మహానుబావుడి గుడా? అనేది మనకు అర్ధం కాదు. సరే చివరికి ఆలయంలోకి వెళితే అక్కడ కొబ్బరి కాయలు నిషేదమట!! కేవలం కుంకుమతోనే పూజట!!! అది కూడా మాహానుభావుడి పేరు మీద అక్కడనే డబ్బాలో పోసి అమ్ముతున్నారు. వాటిని కొన్నటానికి తిరునాళ్ళలో అంగళ్లు పెట్టినట్టు ఆడవాళ్ళు కేకలు వేస్తూ అమ్ముతున్నారు. నాకైతే అది కేవలం ఒక వ్యాపార కేంద్రంగానే అనిపించింది. ఎంత బంగారు గుడి ఐతే మాత్రం, అంత వ్యాపారమా??

గమనిక: "మీరు ఎంత సొమ్ము విరాళంగా ఇచ్చిన తీసుకొనబడును".

సందర్భంగా నాకు ఇంకో మహానుబావుడు జ్ఞాపకానికి వచ్చారు. ఈయన మాహాజ్ఞాని అట!!!! హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు, రోజుకి ఒక ప్రాంతంలో తన యొక్క "అనుగ్రహ భాషణాన్ని"(అంటే ఏంటో నాకు తెలియదు) అందిస్తారట!!! దానికి నగరం నిండా తెరలు(బ్యానర్) ప్రదర్శించారు. అందంగా పెద్ద పెద్ద విభూది రేఖలు పెట్టుకుని, ఇంకా అందమైన రుద్రాక్షలు ధరించి, కళ్ళు మూసుకొని జపం చేస్తున్న భంగిమలో ఒక చిత్రం, నించొని ఆసీర్వదిస్తునట్టు ఇంకో భంగిమలో మరో చిత్రం, ఇలా రక రకాల భంగిమలతో తెరలు ముద్రించారు. ఇది ఇంకో రకమైన వ్యాపారం. ఏంటో మధ్య మనుషుల్లో దేవుళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి ఒకళ్ళు తమకి తాము దేవుడిని అని చెప్పుకోవటం, వాళ్ళకింద ఒక గుంపు చేరి పూజలు చేయటం., భజనలు చేయటం, తరువాత వాళ్ళ పేరు మీద పుస్తకాలు ముద్రించటం, తమ గుంపును పెంచుకోవటానికి ప్రచారాలు చేయటం, చూడలేక పోతున్నా!!!

ఇది ఇలానే కొనసాగితే మనుషులకన్నా దేవుళ్ళు ఎక్కువ అయిపోతారేమో?? నాకు ఇంకో ఆలోచన కూడా వుంది, నేనే పేరు మార్చుకుని "రామానంద్ బాబా" అనో "రామానంద స్వామి" అనో పెట్టుకుని నన్ను నేను దేవుడిగా ప్రకటించుకుంటా. మీరంతా అప్పుడు నా భక్త గుంపులో చేరతారు కదూ!!!!

Monday, May 2, 2011

కధానాయిక పాపతో కమ్మని కబుర్లు

మొన్న మధ్య ఒక చిన్న పని మీద బెంగళూరు వెళ్లి, పని అయిపోయాక, హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యాను. విమానాశ్రయంలో ఒక గంట ఆలస్యంగా నేను ఎక్కాల్సిన విమానం వచ్చింది. అలవాటు ప్రకారం నా మానాన నేను వెళ్లి నాకు కేటాయించిన ప్రదేశంలో కూర్చున్నాను. ఇంతలో నా ప్రక్కన ఎవరో అందమైన అమ్మాయి కూర్చున్నది. తీరా చూస్తే పాప ఎవరో కాదు., ఇటీవల విడుదల అయ్యి సంచలనం సృష్టించిన "తిక్కలోడు తింగరిది" చలనచిత్రంలో కధానాయిక. దగ్గరగా చూసేసరికి ముందు భయమేసింది. నిధానంగా తేరుకోవటానికి పది నిముషాలు పట్టింది. మీకు తెలిసిన విషయమే., అన్నం లేకపోయినా ఉంటాను కాని, ఏదో ఒకటి మాట్లాడకపోతే నేను బ్రతకలేనని. అందుకే ఆమెతో నన్ను నేను పరిచయం చేసుకున్న., పనిలో పనిగా ఆమెని చాలా ప్రశ్నలు అడిగా. ముచ్చట్లు అన్నీ, ప్రత్యేకంగా మీ కోసం.,

నేను: నేను మీకు పెద్ద అభిమానినండి. మీ "తిక్కలోడు తింగరిది" చలనచిత్రం అర్ధం కాక పది సార్లు చూశానండి. మీ చిత్రాల కోసం ముక్కు చెవులు కోసుకుంటున్నాను అని, వైద్యులు మీ చిత్రాలు చూడొద్దు అన్నారు. మీరు చాలా అందంగా ఉంటారండి. మీరు అందానికి ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటారా?
పాప: లేదండి, అందం కోసం నోరు కట్టేసుకోవటం నాకు ఇష్టం ఉండదు, అన్ని తింటాను, కాకపోతే వ్యాయామం చేస్తాను అంతే.

నేను: "తిక్కలోడు తింగరిది" చలనచిత్రంలో కధానాయకుడు సంజయ్ తో మీరు చాలా బాగా చేశారండి, ఆయనతొ పని చేయటం ఎలా అనిపించింది?
పాప: తను చాలా సరదా మనిషి. ఒక పెద్ద కథానాయకుడిని అన్న అహం అస్సలు లేదు. ఎప్పుడూ సరదాగా ఉంటాడు. తనతో చేయటం నిజంగా నా అదృష్టం. తన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను.

నేను: మీకు, కధానాయకుడు సంజయ్ మధ్య ఏదో నడుస్తుంది అని అంటున్నారు? ఎంత వరకు నిజం.
పాపా: నేను అస్సలు అలాంటివి పట్టించుకోను. మేము మంచి స్నేహితులం మాత్రమే. అంతకు మించి మా మధ్య ఏమి లేదు. పత్రికల వాళ్ళు ఏది అనిపిస్తే అది రాస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా అమ్మ నాన్నలకి మాత్రమే నేను సమాధానం చెప్తాను.

నేను: మీ క్రొత్త చిత్రం సంగతులు ఏంటి?
పాప: everyone is very supportive in the unit. The whole set is like a family, I m really gonna miss them all. It just went like a vacation. Director sir gave us so freedom that we dint feel we were shooting.. !!! that too hero Sanjay is an amazing actor and dancer. We had lot of fun together.


నేను: (తెలుగు మాధ్యమం కదా, నాకేమి అర్ధంకాలా!)మొదటి సారి నటించేటప్పుడు ఎలా అనిపించింది?
పాప: నా మొదటి సినిమా "పిచ్చోడి ప్రేమ".., మొదట్లో భయమేసింది. కాని దర్శకుడు, కధానాయకుడు నన్ను బాగా ప్రోత్సహించారు. వాళ్లకి నా కృతఙ్ఞతలు.

నేను: తెలుగు పరిశ్రమ ఎలా ఉంది?
పాప: చాలా బాగుందండి. హైదరాబాద్ నాకు బాగా నచ్చింది. తెలుగు పరిశ్రమలో అందరు ఆప్యాయంగా చూస్తారు.

నేను: మీరు ఎలాంటి చిత్రాలని ఎంచుకుంటారు?
పాప: ముందు నాకు కథ నచ్చాలి. నా పాత్రకి తగిన ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను.

నేను: మీరు ఇప్పుడు నెంబర్ వన్ కధానాయిక అంటున్నారు, మీకెలా అనిపిస్తుంది?
పాప: నేను ఇలాంటివి పట్టించుకోను. ఇంకా మంచి పాత్రలు చేయాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. అప్పుడే ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వగలను. (ప్రేక్షకులకు దగ్గర అవ్వటం అంటే ఏంటో నాకు అర్ధం కావటంలే??)

నేను: అందాల ఆరబోతకు మీరు సిద్దమేనా?
పాప: అందులో తప్పేముంది., కధకు తగ్గట్టు మాత్రం అవసరమే.,

నేను: మీకు ఆదర్శం ఎవరు?
పాప: నాకు మా అమ్మే ఆదర్శం.

నేను: హిందీలో నటించ బోతున్నారని విన్నాను?
పాప: నటనకు భాషతో సంబంధం లేదండి. భాష అయినా, నటన ఒకటే. మంచి కధ దొరికితే ఖచ్చితంగా చేస్తాను.

నేను: వైవాహిక జీవితం గురించి మీ అభిప్రాయం ఏంటి? పెళ్ళెప్పుడు?
పాప: అప్పుడే నాకు పెళ్ళేంటి? ప్రస్తుతం నా ధ్యాసంతా నటన మీదనే ఉంది. ఇంకా నేను ఎంతో నిరూపించుకోవాలి.

నేను: మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి?
పాప: నన్ను బాగా ప్రేమించే వాడు అయి ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, ముక్కు సూటి వాడై ఉండాలి, ముఖ్యంగా మంచి మనసుండాలి, నన్ను బాగా అర్ధం చేసుకోవాలి.

నేను: మీ భవిష్యత్తు ప్రణాలికలు ఏంటి?
పాప: ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలి. గొప్ప పేరు తెచ్చుకోవాలి.

నేను: చాలా సంతోషమండి, ఇక ఉంటా సెలవు.
అప్పటికే హైదరాబాద్ చేరుకున్నాం. విమానం దిగి ఎవరి దారిన వారు వెళ్ళిపోయాం.
ఇంతకీ ఎవరా కధానాయక అని మీకు అనుమానం, అవునా?? మీకు ఇష్టం వచ్చిన కధానాయిక పేరు పెట్టుకోండి. ఎందుకంటే., పాప ఎవరైనా ఇచ్చే సమాధానాలు ఇవే కాబట్టి. నమ్మేశారా?? ఇంత అమ్మయకులు కాబట్టే నా శీర్షికలు చదువుతున్నారు. అయినా విమానం ఎక్కివెళ్లి మరీ చేసేంత రాచకార్యాలు నాకేమున్నాయి? చెప్పండి? ఏదో తమాషాకు చెప్పా. కనీసం ఊహల్లో అయినా విమానంలో విహరిద్దాం అని. మొన్ననే నేను మా హరీష్ విషయం మాట్లాడుకున్నాం. సాధారణంగా పత్రికలలో అందరు కధానాయికలకు ఒకే ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఒకే లాగ సమాధానమిస్తారు అని. ఎలా ఉంది మన కధానాయిక పాపతో కమ్మని కబుర్లు???