Friday, July 29, 2011

ఈ దేశం మీ చేతుల్లో

దేశంలో అవినీతి పెరిగిపోయింది. రోజుకో కుంభకోణం వెలుగు చూస్తున్నది. దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది అంటే దానికి కారణం అవినీతి మాత్రమె. కానీ ప్రభుత్వం విషయంలో ఏమీ చేయలేని పరిస్తితి. దేశం ఇలా తయారు అవ్వటానికి కారణం ప్రభుత్వమో, ప్రపంచమో కాదు. దీనంతటికీ కారణం మీరు. ముమ్మాటికి మీరే. అంతా మీరే చేసారు.

ఎవరికీ బాధ్యత లేదు. మనుషుల్లో బాధ్యత తక్కువ అయ్యింది. అందరికి వాళ్ళ వాళ్ళ హక్కులు గుర్తొస్తాయి, కానీ ఎవరికీ బాధ్యతలు గుర్తుకురావు. ఉదాహరణకు నేను పగలనక, రాత్రనక రక్తం ధారపోసి శీర్షికలు రాస్తున్నాను. ఏదో రాశాడులే అని చదివి వేల్లిపోతున్నారే తప్ప, ఒక సలహానో, ఒక సూచనో చేద్దామే అని లేదు. ఇంక దేశం ఎలా బాగుపడుతుంది.

పుండు మీద కారం చల్లినట్టు, ప్రోత్సహించటం మాట పక్కన పెడితే, కొంతమంది " ఏరా? అన్నీ సొంతగానే రాస్తున్నావా? లేక ఎక్కడ నుంచి అయినా చూచి రాస్తున్నావా?" అని మొహం మీదనే అడుగుతున్నారు. అదేదో చిత్రంలో బ్రహ్మానందంగారు అనట్టు "నా పీక మీద నా కాలు వేసి తొక్కోని చచ్చిపోవాలి" అనిపించింది.

అసలు బ్లాగ్ అంటే ఏమనుకుంటున్నారు? వార్తా పత్రికలు, టి.వి., రేడియో కనిపించే మూడు సిం హాలయితే, కనిపించని నాలుగో సిం హమేరా., బ్లాగ్.

ఒక హిందువు రామయణం చదువుతాడు. క్రైస్తవుడు బైబుల్ మాత్రమె చదువుతాడు. మహ్మదీయుడు ఖురాన్చదువుతాడు. కానీ అందారు నా శీర్షికలు చదువుతారు.

ఒక బ్లాగర్కి, రీడర్కి ఉండాల్సిన సంభందం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా?? మీకోసం ఇంగ్లిష్లోనే చెప్తాను.

"The relationship between a blogger and a reader must be like a bike and petrol, but should not be like a bike and traffic".

మీ రీడర్లున్నారే!!!!!, మా బ్లాగర్లకు ఏమీ కావాలో అస్సలు అర్ధం చేసుకోరు.

ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నం తిని చెయ్యి కడుక్కోవటం ఎంత ముఖ్యమో, శీర్షిక చదివిన తర్వాత దాని మీద అభిప్రాయం చెప్పటం కూడా అంతే ముఖ్యం. శీర్షిక కింద మీ వ్యాఖ్యలు(comment) రాయటానికి ఒక ఖాళి పెట్టె ఉంది. అందులో ఒక రెండు మాటలు రాయచ్చు కదా!!

ఇది కాక మీరు కష్ట పడలేరని ప్రతి శీర్షిక కింద నాలుగు పెట్టెలలో ఒకదానిని ఎంపిక చేసే సౌలభ్యం కూడా ఇచ్చాను. కానీ ఎవరూ దాని జోలికి పోరు. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుంది చెప్పండి?? దేశాన్ని బాగు చేసే అవకాశం మీకిస్తున్నాను.

మీరు నా బ్లాగ్ చదవండి., మీరు ముగ్గురికి, వాళ్ళు మళ్లీ ఇంకో ముగ్గురు చేత చదివించక పోయినా పర్లేదు కానీ, మీ సూచనలు మాత్రం తెలియజేయండి. నా ఏడుపుని అర్ధం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ

మీ
రామానంద స్వామి.

Saturday, July 23, 2011

బొచ్చె కూడు

ఈ రోజు ఎవరిని తిట్టాలో అర్ధం కావటంలేదు..., మా మానేజర్ గారిని తిడదామా అంటే, పాపం చాలా మంచతను. అడిగిన వెంటనే పనిస్తారు, అడక్కపోయినా సెలవు ఇస్తారు, ఎంత ఆలస్యంగా కార్యాలయానికి వెళ్ళినా పల్లెత్తు మాటనరు. ఎప్పుడూ పనిలో ఎంతో సహాయపడుతుంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టిస్తే, ఆఫీసులో ఉండలేక మానేజర్ని సృష్టించి ఉంటాడు. పోగాడుతున్నాను అనుకోక పొతే, మా మానేజర్, సాయి బాబా మూడో అవతారం అనుకోండి. అసలు అలాంటి మనిషిని ఎలా తిడతాను చెప్పండి(దేవుడి దయ వల్ల మా మనేజరు ఈ శీర్షిక చదివితే బాగుండు).

మరి ఎవరిని తిట్టాలబ్బా??? ఆ!!!!!!!!!!! మొన్న ఒక స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అమెరికాలో చదువుకొని, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళి చేసుకుని తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా పెళ్ళి అంటే పెళ్ళిలో ఎమేమి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని కంగరు పడ్డా., కానీ పెళ్ళి చాలా చక్కగా, ముచ్చటగా తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ పెళ్లిని చూడటానికి రెండు కళ్ళు చాలలేదనుకోండి.

పెళ్లి మొత్తం బాగానే జరిగింది, కానీ......, పెళ్ళిలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని మాత్రం చెడ గొట్టారు. పెళ్ళిలో తాళి, తలంబ్రాలకన్నా, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుక్కన్నా, ముఖ్యమైంది ఒకటి ఉంది. ఎంటీ??? ఆ!!!! ముహూర్తం అంటారా??.., కాదుగా., ముహూర్తంకన్నా ముఖ్యమైంది, భొజనాలు. ఆ బోజనాల దగ్గరే దెబ్బ కొట్టింది.

ఇంతకు ముందు రొజులలో అయితే అందరినీ కూర్చోబెట్టి, ఇస్తరాకులలో, లేదంటే అరిటాకులలో భోజనం పెట్టేవారు. కానీ ఆ పెళ్ళిలో బొచ్చ కూడు, ఏర్పాటు చేశారు. బొచ్చ కూడు అంటే ఎంటి? అని ఆశ్ఛర్య పోతున్నారా? నాటకాలాడొద్దు, మీరూ ఎన్నోసార్లు బొచ్చ కూడు తినే ఉంటారు.

ఇక భొజనాల విషయానికి వస్తే, ప్లాస్టిక్ ప్లేట్స్ అనబడే వాటిని మనం తలా ఒకటి తీసుకుని, ఒక వరుసలో, అడుక్కునే వాళ్ళు నుంచున్నట్టు నుంచుంటే, కావాల్సిన పదార్దాన్ని, కావాల్సినంత వడ్డిస్తారు. అలా కావాల్సినవన్నీ అడుక్కున్న పిదప, ఎదో ఒక మూలన నుంచొని గబుక్కున తినాలి. మూలన నుంచోవాలి అని ఎందుకు అన్నాను అంటే, అలా అందరూ అడుక్కునే క్రమంలో ఒకరినొకరు తగిలే అవకాశం చాలా ఎక్కువ కనుక.

నాలాంటి అనెడ్యుకేటెడ్(చదువురాని)కి ఇలాంటి బొచ్చ కూడు కాస్త కష్టమే సుమా!! పోతే, తెలుగులో ఒక పద్యం చిన్నప్పుడు విన్నాను," అసలే కోతి, అందునా తేలు కుట్టేను, ఆ మీద కల్లు తాగెను....."(పద్యం సరిగ్గా గుర్తు లేదు...), అలా అయ్యింది నా పరిస్తితి. అసలే ఆ బొచ్చ కూడు కొత్త, అందునా నాకు బద్దకం ఎక్కువ, బలం తక్కువ, దానికి తోడు ఆ ప్లాస్టిక్ పళ్ళెం చాలా బరువు అనిపించింది. ఒక చేత్తో ఆ బరువు మోయలేక పోయాను. సరే నలుగురిలో జాగ్రత్తగా వ్యవహరించక పోతే నన్ను ఊరోడంటారు(అలా అనటమే నాకు ఇష్టం అనుకోండీ, అది వేరే విషయం), అందుకని నేను కూడా నా శక్తి కొలది అడుక్కోని, ఒక ప్రక్కకు తిరిగేలోపు, నా పళ్ళెం ఒక అందంగా లేని అమ్మాయికి తగిలింది. కింద పదిపోతుంటే ఎలాగోలా ఒడిసి పట్టుకోవటంతో(అమ్మాయిని అనుకునేరు, రామ!! రామ!! పళ్ళాన్ని) పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ పళ్ళెం బరువుకి చెయ్యి నొప్పిపుట్టి, ఎక్కువ తినకుండా వచ్చేశాను. ఆ చెయ్యి నొప్పి తగ్గటానికి వారం రోజులు పట్టింది.

ఈ బొచ్చ కూడు హైదరాబాద్ లోనే కాదండోయి, మా అద్దంకిలో కూడా మొదలు పెట్టారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మధ్య ఇంజినీరింగ్ అయిపొయిన తర్వాత జనాలకు బయపడి, జన జీవన స్రవంతికి దూరంగా ఉండటం మూలాన అనుకుంటా, పెళ్ళిల్లకి కూడా వెళ్ళటం మానేశాను. ఇటీవల నా స్నేహితుడి చెల్లెలి పెళ్ళి అద్దంకిలోనే జరిగింది. అందులో ఈ బొచ్చ కూడు చూసి బాద పడ్డాను. ఈ సారి ఎవరైనా నన్ను పెళ్ళికి పిలిస్తే, బొచ్చ కూడు లేకపోతేనే వస్తానని చెప్తాను. ఒక వేళ బొచ్చకూడు లేకుండా కుదరదు అంటే, కనీసం అడుక్కు తిరగటానికి సరిపోయే ప్రదేశంలో పెట్టమని చెప్పాలి.

ఈ బొచ్చ కూడు రాస్తూ రాస్తూ, అన్నం సంగతి మర్చిపోయాను. బాగా ఆకలేస్తున్నది, పోయి తినాలి. ఇంతకీ నా బొచ్చ ఎక్కడ పెట్టానబ్బా???

Monday, July 18, 2011

బానిసత్వం బతికే ఉంది

"పది రోజులనుంచి ప్రశాంతంగా ఉన్నామురా బాబు, మళ్ళీ ఎదో రాస్తావు, చదవకపోతే ఏడుస్తావ్" అనుకుంటున్నారా?? నా ఎడుపు మీ ముందు కాకపోతే , ఇంకెక్కడ ఏడవమంటారు చెప్పండి.ఎవడి ఏడుపు తగిలిందో తెలియదు కానీ, జీవితం దారుణంగా తయారయ్యింది.

పూర్వపు రొజులలో, తెల్లోళ్ళు బానిసత్వాన్ని బాగా ప్రొత్సహించారని చరిత్రలో తెగ చదువుకున్నాము. మనుషులను డబ్బులతో కొనుక్కోని, వాళ్ళ చేత వెట్టి చాకిరీ చెయించుకునేవాళ్ళట!!!! ఆ తరువాత కాలంలో దానిని రద్దు చేశారనీ, ఇప్పుడు అలాంటి వెట్టి చాకిరీని ప్రొత్సహిస్తే శిక్ష తప్పదని ఎవరో చెప్పగా విన్నాను. కానీ ఆ వెట్టి చాకిరీ ఇప్పటికీ దేశంలో పేట్రేగి పొతున్నది. ఏ మారు మూల అడవులలో అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. హైటెక్ యుగంలో, మాదాపూర్, కొండాపూర్ సాక్షిగా జరుగుతున్నది.

నేను ఒక పెద్ద అంతర్జాతీయ కార్యాలయంలో ఇంజనీరుగా ఇరగదీస్తున్నాను. నా పని తనాన్ని చూసి నాకు పదోన్నతిని కల్పించారు. పదోన్నతి అంటే,ఏంటో అనుకునుటున్నారా? "నేను వేరొక కార్యాలయంలో పనిచేయాలి, సూటిగా చెప్పాలి అంటే, నన్ను బానిసని చేసి, వేరే వాళ్ళకి అమ్మేశారు. దానినే s/w పదజాలంలో "client location" లేకపోతే ముద్దుగా "onsite" అంటారు.

ఒకళ్ళ కింద పనిచేయటం బానిసత్వం ఎందుకు అవుతుంది? అనే కదా మీ అనుమానం. ఇప్పుడు నన్ను అమ్మేసిన వాళ్ళకి, కొనుకున్నవాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారుట!!! అందునా, నేను ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటలు డబ్బులు ఇస్తారుట. దీ.......... జీవితం కనీసం రోజు కూలీలా కూడా కాదు, గంటల కూలీ బ్రతుకు అయ్యింది. నాకు మాత్రం పదో పరకో పడేస్తున్నారు. అంటే....., వాళ్ళు వాములు వాములు మేసి, దొరికితే ఎండు గడ్డి, దొరక్కపోతే పచ్చ గడ్డి నా మొహాన పడేస్తారనమాట!!!!

ఆ రొజులలో బానిసలకు మెడలో గొలుసులు ఎలానో, మాకు మెడలో గుర్తింపు బిళ్ళలు ఉంటాయి. అందునా నన్ను కొనుకున్న వాళ్ళకి కొంత మంది సొంత బానిసలు ఉంటారు. వాళ్ళతో మమల్ని వేరు చేయటానికి, మాకు ఒక రంగు గుర్తింపు బిళ్ళలు, వాళ్ళకి ఇంకో రంగు గుర్తింపు బిళ్ళలు ఇస్తారనమాట!!!!

ఇక పోతే, అక్కడ మాకు బోజనం, అల్పాహారం,పండ్లు , రసాలు, నా పిండాకూడుతో సహా అన్నీ ఉచితంగా ఇస్తారు. ఉచితంగా ఇస్తున్నారు అనుకొని చంకలు ఎగరేస్తే దెబ్బ తిన్నటే, తిన్నదానికి రెట్టింపు పని చేయించుకుంటారు. అసలు s/wలో పని చేసే వాళ్ళకి(నాకు కాదు) అంతంత జీతాలు ఎందుకు ఇస్తారనుకున్నారు? A.C. లో కూడా చెమటలు పట్టేలా పని చెస్తారు కాబట్టి. నా లాంటి బానిసలందరికీ నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను. కొంచం ఈ బానిస బ్రతుకు అలవాటు అయితే కానీ, జనజీవన స్రవంతిలో కలవలేను.

Friday, July 8, 2011

పాపా, బాబు, ఒక ఆటో

నాకు ఒక చిలిపి ఊహ మదిలో మెదిలింది. ఈ శీర్షికలో మీరు చదివబొయేదంతా, కేవలం కల్పితం. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నిజంగా జరిగితే నాకూ ఆనందమే,ఎమిచెస్తాం, ఆశకి కూడా హద్దుండాలి. మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం కల్పితం. ఏదో, మహిళా ప్రేక్షకులని ఆదరించటం కొసం రాస్తున్నాను. సొది ఆపి నీ నస మొదలెట్టు అనే కదా!!!!, ఆలస్యం ఎందుకు, కానివ్వండి

రొజూ లాగే ఆ రొజు కూడా తెల్లవారు ఝామున తొమ్మిదింటికి నిద్రలేచి, పది గంటలకు కార్యాలయానికి బయలుదేరాను. ఆటొలో ఇరవై, ఇరవైఐదు నిముషాల ప్రయాణం. అప్పటికింకా పదిగంటలే కనుక అందరూ ఆ పాటికి కార్యాలయాలకు చేరుంటారు. ఆ రోజు రద్దీ కొంచం తక్కువగానే ఉంది. ఆటో కోసం నిలబడి ఉన్నాను. అసలే ఆలస్యం అయ్యిందని అదుర్దాగా ఉన్న నాకు ఆటోలు రాకపొవటంతో ఇంకా ఆదుర్దా ఎక్కువ అయ్యింది. జగన్ ఎన్నికల కొసం ఎదురు చూసినట్టు నేను ఆటో కొసం ఎదురు చూస్తున్నాను.

పది చెత్త చిత్రాల తరువాత బలకృష్ణకి "సిం హ" వచ్చినట్టు, ఒక ఐదు నిముషాలకి ఒక ఆటో వచ్చింది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది. "అమ్మాయిలు అప్సరసలకన్నా అందమయిన వాళ్ళు, ఆల్సేషన్ కన్నా ప్రమాదకరమయిన వాళ్ళు" అని హరీష్ ఎప్పుడూ చెప్తుంటాడు. అందుకని నేను పెద్దగా పట్టించుకొలేదు. మెల్లగా ఆటో కదిలింది. ఎంతో మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాం. కాని తనలో ఏదో ప్రత్యేకత, ఏదో ఆకర్షణ. నాకు తెలియకుండానే నేను తనని చూస్తూ ఉండి పొయాను. ఎంత ప్రయత్నించినా నా చూపు తిప్పుకొలేక పొతున్నాను. నల్లని అయస్కాంతం లాంటి కళ్లు, గులాబి రంగు చెక్కిళ్లు, హరివిల్లు పోలిన కను బొమ్మలు, కారు మబ్బు తీరున కురులు, అహా ఎమి ఆ సౌందర్యం(కొంచం ఎక్కువ చేస్తున్నానా??). నాలోని కవిని బయటకు తీసేంత సౌందర్యం ఆమెది. నేనే గనుక తెలుగు చిత్రాలలొ కధానాయకుడిని అయ్యుంటే, వెంటనె ఆమె మీద ఒక పాట పాడేవాడిని.

నేను ఇంత గందరగొళంలో ఉన్నా, తను మాత్రం ప్రశాంతంగా ఏమీ పట్టనట్టు కూర్చున్నది. ఇంతలో తను దిగాల్సిన చొటు వచ్చింది. తొందరలొ ఆటోలొ తన పుస్తకం మరచింది. చిల్లర ఆటో వాడికి ఇచ్చి గబగబ వెళ్తున్న తనని పిలిచాను. వెనకకు తిరిగి తన రెండు కనుబొమ్మలను ఎత్తి ప్రశ్నార్దకంగా నా వైపు చూచింది. ఆ చూపులో ఎదో మాయ ఉంది. తన పుస్తకాన్ని తనకు ఇచ్చాను. పుస్తకం తీసుకుంటూ, ఒక చిరునవ్వు నా మీద విసిరింది. ఆ నిముషాన గుండెను ఎవరో పిశికేసినట్టు అనిపించింది.

ఆ నవ్వు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించింది. తను నడిచి వెళుతూ ఉంటే, వెనాకాలె ఎంత దూరం ఐనా వెళ్ళాలి అనిపించింది. ఎంత సేపు ఐనా ఆ నవ్వు ఇంకా నా కళ్ళల్లో కదలాడుతున్నది. ఆ రోజంతా కార్యాలయంలో నేనెమి చేశానో నాకే గుర్తులేదు. ఒక్క చిన్న చిరునవ్వుతొ వేరే ప్రపంచంలొకి తీసుకువెళ్ళింది. పది గంటలకే పడుకున్నా, ఏ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ నిద్ర పట్టలేదు.

తర్వాత రోజు కూడా అదే సమయానికి అక్కడకి వెళ్ళి నుంచున్నా. ఎన్ని ఆటోలు ఖాళీగా వచ్చినా ఎక్కలేదు.ఒక పది నిముషాల నిరీక్షణ తర్వాత, నా కలల ఆటో రానే వచ్చింది. గబ్బుక్కున ఎక్కి, చ్చటుక్కున కూర్చున్నాను. "తినగా తినగా వేము తియ్యనుండు" అన్నట్టు చూడంగా చూడంగా నా కళ్లకు తను అందెగత్తె నుంచి అప్సరస స్తాయికి చేరిపోయింది. నన్ను చూచి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. చిన్న పిల్లాడికి బెల్లం ముక్క చేతిలో పెడితే ఎంత సంబరపడతాడో, నాకు అంత ఆనందం వేసింది. నేను తిరిగి నవ్వాను. మాటలు కలుపుదామని ఎంత ప్రయత్నించినా నోరు పెగలలేదు. కాళ్ళు చేతులలో ఒకటే ఒణుకు మొదలైంది.

నన్ను నేను తమాయించుకుని, నోరు తెరిచేలోగా తను దిగాల్సిన చోటు రానే వచ్చింది.దిగి రెండు అడుగులు ముందుకు వేసి, నా తట్టు చిలిపిగా చూసి కొంటెగా "ఇవాళ ఏమీ మర్చిపోలేదు!!" అని అన్నది. ఆ మాటకు నా గుండె రెండు క్షణాలు ఆగి పోయింది. నా చెవులను నేనే నమ్మలేక పోయాను. తనను చూస్తూ అలానే ఉండి పోయాను. ఇంతలో ఆటో కదిలి వెళ్ళింది. కవ్వించి కనిపించకుండ పొయింది. తను మాట్లాడుతుంటే స్వర్గం దరిదాపుల్లో నిలబడిన అనుభూతి కలిగింది.

నా వ్యాది మరింత ముదిరింది. ఏ పని చేయబుద్ది కాలేదు. ఏదీ తినాలనిపించలేదు. తనని మళ్లీ మళ్లీ చూడాలని., ఎలాగైనా మాట్లాడాలని ఎంతో తప్పించి పోయాను. కార్యాలయంలో ఉన్నంత సేపు, తను గుర్తుకొచ్చినప్పుడల్లా, లోపలున్న A.C. తో సంభందం లేకుండా నా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నది.ఆ రోజు అస్సలు నిద్రే పట్టలేదు.

నా అదృష్టాన్ని మరోసారి పరీక్షిన్చుకోవటానికి మూడో రోజు మళ్లీ అదే సమయానికి ఆటో కోసం వెతికాను. ఆటోలు వస్తున్నాయి కానీ, అమ్మాయి కనపడలేదు. రైతులు వర్షాల కోసం, అద్వాని ప్రధాని పదవి కొసం, టీవీ వాళ్ళు వార్తల కొసం, మీరు నా శీర్షికల కొసం చూసినట్టు, నేను తన కొసం ఎదురు చూశాను. దాదాపు రెండు గంటలు చూచాను. ఇక చేసేది లేక తిన్నగా కార్యాలయానికి వెళ్ళాను. ఆ రోజంతా నా మనసు నా మనసులో లేదు. అందులోనూ తర్వాతి రెండు రోజులూ శని, ఆది వారాలు గనుక సెలవు దినాలు. నా బాధ మరింత పెరిగింది.అయినా మనసులో ఏదో ఓ మూల చిన్న ఆశ. ఆ ఆశతోనే శనివారం ఉదయం మళ్లీ అదే సమయానికి ఆటో(అమ్మాయి) కోసం నించున్నాను. పరీక్షకు వెళ్ళే పిల్లగాడిలా అయ్యింది నా పరిస్తితి. దేవుడా!!! నేను చూస్తున్నది నిజమేనా., నా కళ్లను నమ్మలేక పోతున్నా, తను ఆటోలో వచ్చింది. నిజానికి అలాంటి సన్నివేశాలలో ఐతే వర్షం కురవాలి, కానీ ఎందుకో వర్షం కురవలా!!

ఆటోలో కూర్చున్నాను. ఎలాగైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని గట్టిగా మనసులో అనుకున్నాను. కానీ నోరు మాత్రం పెగలటంలేదు.'తను నా వైపుకు తిరిగి నవ్వింది. మా చూపులు పరిచయం చేసుకున్నాయి, పలకరించుకున్నాయి(కంగారు పడకండి, చూపులకు, మనసులకు అప్పుడప్పుడు అలాంటి శక్తులు వస్తాయి). తదేకంగా నన్నే చూస్తూ ఉన్నది. నేను తననే చూస్తూ ఉన్నాను. నాకు అర్ధం ఐంది, తను కూడా నేను ఉన్న స్తితిలోనే ఉన్నది అని. చిత్రాలలో చెప్పినట్టు మా చూపులు, మనసులు మాట్లాడుకోవటం మొదలు పెట్టాయి. కానీ నోరు తెరచి మాట్లాడటానికి మాత్రం ఏదో భయం, ఏదో అలజడి మనసుని నియంత్రించింది. ఇంతలో రోజూలాగే తను ఆటో దిగింది. ఈసారి నేను తనతో పాటు దిగాను. ఇద్దరికీ తీసుకోండి అని ఇరవై రూపాయలు ఆటో వాడికి ఇచ్చింది. నాకు ఏమీ పాలు పోవటంలేదు. అంతా మాయగా ఉంది. ఈ అవకాశం పొతే మళ్లీ రాదని నాకు తెల్సు. అందుకే దైర్యం చేసి మాట్లాడాదాము అనుకునే లోపల,

ఆమె : ఏమైనా మర్చిపోయారా???
నేను: నా మనసు నీ దగ్గర మర్చిపోయాను, క్షేమంగా ఉన్నదా? (ఈ వాఖ్యం ఏ చిత్రంలోదో గుర్తులేదు)

ఆమె నవ్విన నవ్వు ఇప్పటికి నా గుండెల్లో మోగుతూనే ఉంది. అలా నవ్వుతూ నవ్వుతూ, తన కార్యలయంలోకి వెళ్ళిపోయింది. నేనూ వెనకనే వెళ్ళినప్పటికీ, కాపలాదారుడు అడ్డుకున్నాడు. చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత రొజూ మళ్ళీ అదే ఆటో, అదే నవ్వు, కాక పోతే, తను డబ్బులు ఇవ్వబొతుంటే నేను అడ్డుపడి మరీ ఇచ్చాను. ఆ రొజు నుండి ఇస్తూనే ఉన్నాను (:P).

ఈ రోజుకి ఇంతకన్నా ఊహించటం నా వల్ల కాదు..

Friday, July 1, 2011

ఎదుటే ఉందే, ఈలోపే ఎటు వెళ్ళిందే?


మొన్న ఒక స్నేహితుడు అడిగాడు, "ఏంటి రా అన్నీ ప్రేమ పాటలే రాస్తున్నావు అని?". ఈ వయసులో ప్రేమ పాటలు కాక విప్లవ గీతాలు రాస్తారా??  :P  

ఏమాటకామాట, హిందీ పాటలు అర్ధం కాకపోఇనా బాగుంటాయి. నా శీర్షికలు చదివే కొద్దీ చదవాలనిపించటం ఎంత సహజమో (:P), హిందీ పాటలు వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తాయి. ఈ కింది పాట "గ్యాంగ్స్టర్" అనే చిత్రంలో "తుహి మేరి షబ్ హాయ్" అనే పాట. 


పల్లవి||
         ఎదుటే ఉందే, ఈలోపే ఎటు వెళ్ళిందే?
         ఎన్నడూ లేదే, ఇవాళే ఏమైందే?
         నువ్వేలే నా ప్రాణం, నీతోనే ప్రయాణం
         నిన్నే కోరెనీ పరువం, ఇక వోపలేను విరహం.   ఓ ఓ ఓ ఓ ఓ ............. 

చరణం||
          నా గొంతు అంటున్నది, నీ పేరు పలకాలని,
          నా అడుగు పడుతున్నది, నీ తోడూ నడవాలని,
          నీవే రాక, నిదురే లేక, ఆపేదెలా ఆలాపనా?
           ఓ ....... ఓ ........ ఓ ....... ఓ ........        || ఎదుటే ||

చరణం ||
           పాడాలనుందో పాటని, కావాలి నూ పల్లవి.,
           చేరాలనుందో చోటుని, చెలి వెచ్చని కౌగిలి,
           ఎదారైనా, ఎందాకైనా, నీతో రానా, ఓ నా మైనా!!!!
           ఓ ....... ఓ ........ ఓ ....... ఓ ........        || ఎదుటే ||