ఈ రోజు ఎవరిని తిట్టాలో అర్ధం కావటంలేదు..., మా మానేజర్ గారిని తిడదామా అంటే, పాపం చాలా మంచతను. అడిగిన వెంటనే పనిస్తారు, అడక్కపోయినా సెలవు ఇస్తారు, ఎంత ఆలస్యంగా కార్యాలయానికి వెళ్ళినా పల్లెత్తు మాటనరు. ఎప్పుడూ పనిలో ఎంతో సహాయపడుతుంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టిస్తే, ఆఫీసులో ఉండలేక మానేజర్ని సృష్టించి ఉంటాడు. పోగాడుతున్నాను అనుకోక పొతే, మా మానేజర్, సాయి బాబా మూడో అవతారం అనుకోండి. అసలు అలాంటి మనిషిని ఎలా తిడతాను చెప్పండి(దేవుడి దయ వల్ల మా మనేజరు ఈ శీర్షిక చదివితే బాగుండు).
మరి ఎవరిని తిట్టాలబ్బా??? ఆ!!!!!!!!!!! మొన్న ఒక స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాను. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అమెరికాలో చదువుకొని, అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్ళి చేసుకుని తిరిగి అమెరికా వెళ్ళిపోతారు. అమెరికా పెళ్ళి అంటే పెళ్ళిలో ఎమేమి ఘోరాలు చూడాల్సి వస్తుందో అని కంగరు పడ్డా., కానీ పెళ్ళి చాలా చక్కగా, ముచ్చటగా తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ పెళ్లిని చూడటానికి రెండు కళ్ళు చాలలేదనుకోండి.
పెళ్లి మొత్తం బాగానే జరిగింది, కానీ......, పెళ్ళిలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని మాత్రం చెడ గొట్టారు. పెళ్ళిలో తాళి, తలంబ్రాలకన్నా, పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుక్కన్నా, ముఖ్యమైంది ఒకటి ఉంది. ఎంటీ??? ఆ!!!! ముహూర్తం అంటారా??.., కాదుగా., ముహూర్తంకన్నా ముఖ్యమైంది, భొజనాలు. ఆ బోజనాల దగ్గరే దెబ్బ కొట్టింది.
ఇంతకు ముందు రొజులలో అయితే అందరినీ కూర్చోబెట్టి, ఇస్తరాకులలో, లేదంటే అరిటాకులలో భోజనం పెట్టేవారు. కానీ ఆ పెళ్ళిలో బొచ్చ కూడు, ఏర్పాటు చేశారు. బొచ్చ కూడు అంటే ఎంటి? అని ఆశ్ఛర్య పోతున్నారా? నాటకాలాడొద్దు, మీరూ ఎన్నోసార్లు బొచ్చ కూడు తినే ఉంటారు.
ఇక భొజనాల విషయానికి వస్తే, ప్లాస్టిక్ ప్లేట్స్ అనబడే వాటిని మనం తలా ఒకటి తీసుకుని, ఒక వరుసలో, అడుక్కునే వాళ్ళు నుంచున్నట్టు నుంచుంటే, కావాల్సిన పదార్దాన్ని, కావాల్సినంత వడ్డిస్తారు. అలా కావాల్సినవన్నీ అడుక్కున్న పిదప, ఎదో ఒక మూలన నుంచొని గబుక్కున తినాలి. మూలన నుంచోవాలి అని ఎందుకు అన్నాను అంటే, అలా అందరూ అడుక్కునే క్రమంలో ఒకరినొకరు తగిలే అవకాశం చాలా ఎక్కువ కనుక.
నాలాంటి అనెడ్యుకేటెడ్(చదువురాని)కి ఇలాంటి బొచ్చ కూడు కాస్త కష్టమే సుమా!! పోతే, తెలుగులో ఒక పద్యం చిన్నప్పుడు విన్నాను," అసలే కోతి, అందునా తేలు కుట్టేను, ఆ మీద కల్లు తాగెను....."(పద్యం సరిగ్గా గుర్తు లేదు...), అలా అయ్యింది నా పరిస్తితి. అసలే ఆ బొచ్చ కూడు కొత్త, అందునా నాకు బద్దకం ఎక్కువ, బలం తక్కువ, దానికి తోడు ఆ ప్లాస్టిక్ పళ్ళెం చాలా బరువు అనిపించింది. ఒక చేత్తో ఆ బరువు మోయలేక పోయాను. సరే నలుగురిలో జాగ్రత్తగా వ్యవహరించక పోతే నన్ను ఊరోడంటారు(అలా అనటమే నాకు ఇష్టం అనుకోండీ, అది వేరే విషయం), అందుకని నేను కూడా నా శక్తి కొలది అడుక్కోని, ఒక ప్రక్కకు తిరిగేలోపు, నా పళ్ళెం ఒక అందంగా లేని అమ్మాయికి తగిలింది. కింద పదిపోతుంటే ఎలాగోలా ఒడిసి పట్టుకోవటంతో(అమ్మాయిని అనుకునేరు, రామ!! రామ!! పళ్ళాన్ని) పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ పళ్ళెం బరువుకి చెయ్యి నొప్పిపుట్టి, ఎక్కువ తినకుండా వచ్చేశాను. ఆ చెయ్యి నొప్పి తగ్గటానికి వారం రోజులు పట్టింది.
ఈ బొచ్చ కూడు హైదరాబాద్ లోనే కాదండోయి, మా అద్దంకిలో కూడా మొదలు పెట్టారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ మధ్య ఇంజినీరింగ్ అయిపొయిన తర్వాత జనాలకు బయపడి, జన జీవన స్రవంతికి దూరంగా ఉండటం మూలాన అనుకుంటా, పెళ్ళిల్లకి కూడా వెళ్ళటం మానేశాను. ఇటీవల నా స్నేహితుడి చెల్లెలి పెళ్ళి అద్దంకిలోనే జరిగింది. అందులో ఈ బొచ్చ కూడు చూసి బాద పడ్డాను. ఈ సారి ఎవరైనా నన్ను పెళ్ళికి పిలిస్తే, బొచ్చ కూడు లేకపోతేనే వస్తానని చెప్తాను. ఒక వేళ బొచ్చకూడు లేకుండా కుదరదు అంటే, కనీసం అడుక్కు తిరగటానికి సరిపోయే ప్రదేశంలో పెట్టమని చెప్పాలి.
ఈ బొచ్చ కూడు రాస్తూ రాస్తూ, అన్నం సంగతి మర్చిపోయాను. బాగా ఆకలేస్తున్నది, పోయి తినాలి. ఇంతకీ నా బొచ్చ ఎక్కడ పెట్టానబ్బా???
No comments:
Post a Comment