Friday, July 8, 2011

పాపా, బాబు, ఒక ఆటో

నాకు ఒక చిలిపి ఊహ మదిలో మెదిలింది. ఈ శీర్షికలో మీరు చదివబొయేదంతా, కేవలం కల్పితం. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నిజంగా జరిగితే నాకూ ఆనందమే,ఎమిచెస్తాం, ఆశకి కూడా హద్దుండాలి. మళ్ళీ చెప్తున్నాను ఇది కేవలం కల్పితం. ఏదో, మహిళా ప్రేక్షకులని ఆదరించటం కొసం రాస్తున్నాను. సొది ఆపి నీ నస మొదలెట్టు అనే కదా!!!!, ఆలస్యం ఎందుకు, కానివ్వండి

రొజూ లాగే ఆ రొజు కూడా తెల్లవారు ఝామున తొమ్మిదింటికి నిద్రలేచి, పది గంటలకు కార్యాలయానికి బయలుదేరాను. ఆటొలో ఇరవై, ఇరవైఐదు నిముషాల ప్రయాణం. అప్పటికింకా పదిగంటలే కనుక అందరూ ఆ పాటికి కార్యాలయాలకు చేరుంటారు. ఆ రోజు రద్దీ కొంచం తక్కువగానే ఉంది. ఆటో కోసం నిలబడి ఉన్నాను. అసలే ఆలస్యం అయ్యిందని అదుర్దాగా ఉన్న నాకు ఆటోలు రాకపొవటంతో ఇంకా ఆదుర్దా ఎక్కువ అయ్యింది. జగన్ ఎన్నికల కొసం ఎదురు చూసినట్టు నేను ఆటో కొసం ఎదురు చూస్తున్నాను.

పది చెత్త చిత్రాల తరువాత బలకృష్ణకి "సిం హ" వచ్చినట్టు, ఒక ఐదు నిముషాలకి ఒక ఆటో వచ్చింది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది. "అమ్మాయిలు అప్సరసలకన్నా అందమయిన వాళ్ళు, ఆల్సేషన్ కన్నా ప్రమాదకరమయిన వాళ్ళు" అని హరీష్ ఎప్పుడూ చెప్తుంటాడు. అందుకని నేను పెద్దగా పట్టించుకొలేదు. మెల్లగా ఆటో కదిలింది. ఎంతో మంది అమ్మాయిలను చూస్తూ ఉంటాం. కాని తనలో ఏదో ప్రత్యేకత, ఏదో ఆకర్షణ. నాకు తెలియకుండానే నేను తనని చూస్తూ ఉండి పొయాను. ఎంత ప్రయత్నించినా నా చూపు తిప్పుకొలేక పొతున్నాను. నల్లని అయస్కాంతం లాంటి కళ్లు, గులాబి రంగు చెక్కిళ్లు, హరివిల్లు పోలిన కను బొమ్మలు, కారు మబ్బు తీరున కురులు, అహా ఎమి ఆ సౌందర్యం(కొంచం ఎక్కువ చేస్తున్నానా??). నాలోని కవిని బయటకు తీసేంత సౌందర్యం ఆమెది. నేనే గనుక తెలుగు చిత్రాలలొ కధానాయకుడిని అయ్యుంటే, వెంటనె ఆమె మీద ఒక పాట పాడేవాడిని.

నేను ఇంత గందరగొళంలో ఉన్నా, తను మాత్రం ప్రశాంతంగా ఏమీ పట్టనట్టు కూర్చున్నది. ఇంతలో తను దిగాల్సిన చొటు వచ్చింది. తొందరలొ ఆటోలొ తన పుస్తకం మరచింది. చిల్లర ఆటో వాడికి ఇచ్చి గబగబ వెళ్తున్న తనని పిలిచాను. వెనకకు తిరిగి తన రెండు కనుబొమ్మలను ఎత్తి ప్రశ్నార్దకంగా నా వైపు చూచింది. ఆ చూపులో ఎదో మాయ ఉంది. తన పుస్తకాన్ని తనకు ఇచ్చాను. పుస్తకం తీసుకుంటూ, ఒక చిరునవ్వు నా మీద విసిరింది. ఆ నిముషాన గుండెను ఎవరో పిశికేసినట్టు అనిపించింది.

ఆ నవ్వు మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించింది. తను నడిచి వెళుతూ ఉంటే, వెనాకాలె ఎంత దూరం ఐనా వెళ్ళాలి అనిపించింది. ఎంత సేపు ఐనా ఆ నవ్వు ఇంకా నా కళ్ళల్లో కదలాడుతున్నది. ఆ రోజంతా కార్యాలయంలో నేనెమి చేశానో నాకే గుర్తులేదు. ఒక్క చిన్న చిరునవ్వుతొ వేరే ప్రపంచంలొకి తీసుకువెళ్ళింది. పది గంటలకే పడుకున్నా, ఏ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ నిద్ర పట్టలేదు.

తర్వాత రోజు కూడా అదే సమయానికి అక్కడకి వెళ్ళి నుంచున్నా. ఎన్ని ఆటోలు ఖాళీగా వచ్చినా ఎక్కలేదు.ఒక పది నిముషాల నిరీక్షణ తర్వాత, నా కలల ఆటో రానే వచ్చింది. గబ్బుక్కున ఎక్కి, చ్చటుక్కున కూర్చున్నాను. "తినగా తినగా వేము తియ్యనుండు" అన్నట్టు చూడంగా చూడంగా నా కళ్లకు తను అందెగత్తె నుంచి అప్సరస స్తాయికి చేరిపోయింది. నన్ను చూచి ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. చిన్న పిల్లాడికి బెల్లం ముక్క చేతిలో పెడితే ఎంత సంబరపడతాడో, నాకు అంత ఆనందం వేసింది. నేను తిరిగి నవ్వాను. మాటలు కలుపుదామని ఎంత ప్రయత్నించినా నోరు పెగలలేదు. కాళ్ళు చేతులలో ఒకటే ఒణుకు మొదలైంది.

నన్ను నేను తమాయించుకుని, నోరు తెరిచేలోగా తను దిగాల్సిన చోటు రానే వచ్చింది.దిగి రెండు అడుగులు ముందుకు వేసి, నా తట్టు చిలిపిగా చూసి కొంటెగా "ఇవాళ ఏమీ మర్చిపోలేదు!!" అని అన్నది. ఆ మాటకు నా గుండె రెండు క్షణాలు ఆగి పోయింది. నా చెవులను నేనే నమ్మలేక పోయాను. తనను చూస్తూ అలానే ఉండి పోయాను. ఇంతలో ఆటో కదిలి వెళ్ళింది. కవ్వించి కనిపించకుండ పొయింది. తను మాట్లాడుతుంటే స్వర్గం దరిదాపుల్లో నిలబడిన అనుభూతి కలిగింది.

నా వ్యాది మరింత ముదిరింది. ఏ పని చేయబుద్ది కాలేదు. ఏదీ తినాలనిపించలేదు. తనని మళ్లీ మళ్లీ చూడాలని., ఎలాగైనా మాట్లాడాలని ఎంతో తప్పించి పోయాను. కార్యాలయంలో ఉన్నంత సేపు, తను గుర్తుకొచ్చినప్పుడల్లా, లోపలున్న A.C. తో సంభందం లేకుండా నా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నది.ఆ రోజు అస్సలు నిద్రే పట్టలేదు.

నా అదృష్టాన్ని మరోసారి పరీక్షిన్చుకోవటానికి మూడో రోజు మళ్లీ అదే సమయానికి ఆటో కోసం వెతికాను. ఆటోలు వస్తున్నాయి కానీ, అమ్మాయి కనపడలేదు. రైతులు వర్షాల కోసం, అద్వాని ప్రధాని పదవి కొసం, టీవీ వాళ్ళు వార్తల కొసం, మీరు నా శీర్షికల కొసం చూసినట్టు, నేను తన కొసం ఎదురు చూశాను. దాదాపు రెండు గంటలు చూచాను. ఇక చేసేది లేక తిన్నగా కార్యాలయానికి వెళ్ళాను. ఆ రోజంతా నా మనసు నా మనసులో లేదు. అందులోనూ తర్వాతి రెండు రోజులూ శని, ఆది వారాలు గనుక సెలవు దినాలు. నా బాధ మరింత పెరిగింది.అయినా మనసులో ఏదో ఓ మూల చిన్న ఆశ. ఆ ఆశతోనే శనివారం ఉదయం మళ్లీ అదే సమయానికి ఆటో(అమ్మాయి) కోసం నించున్నాను. పరీక్షకు వెళ్ళే పిల్లగాడిలా అయ్యింది నా పరిస్తితి. దేవుడా!!! నేను చూస్తున్నది నిజమేనా., నా కళ్లను నమ్మలేక పోతున్నా, తను ఆటోలో వచ్చింది. నిజానికి అలాంటి సన్నివేశాలలో ఐతే వర్షం కురవాలి, కానీ ఎందుకో వర్షం కురవలా!!

ఆటోలో కూర్చున్నాను. ఎలాగైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని గట్టిగా మనసులో అనుకున్నాను. కానీ నోరు మాత్రం పెగలటంలేదు.'తను నా వైపుకు తిరిగి నవ్వింది. మా చూపులు పరిచయం చేసుకున్నాయి, పలకరించుకున్నాయి(కంగారు పడకండి, చూపులకు, మనసులకు అప్పుడప్పుడు అలాంటి శక్తులు వస్తాయి). తదేకంగా నన్నే చూస్తూ ఉన్నది. నేను తననే చూస్తూ ఉన్నాను. నాకు అర్ధం ఐంది, తను కూడా నేను ఉన్న స్తితిలోనే ఉన్నది అని. చిత్రాలలో చెప్పినట్టు మా చూపులు, మనసులు మాట్లాడుకోవటం మొదలు పెట్టాయి. కానీ నోరు తెరచి మాట్లాడటానికి మాత్రం ఏదో భయం, ఏదో అలజడి మనసుని నియంత్రించింది. ఇంతలో రోజూలాగే తను ఆటో దిగింది. ఈసారి నేను తనతో పాటు దిగాను. ఇద్దరికీ తీసుకోండి అని ఇరవై రూపాయలు ఆటో వాడికి ఇచ్చింది. నాకు ఏమీ పాలు పోవటంలేదు. అంతా మాయగా ఉంది. ఈ అవకాశం పొతే మళ్లీ రాదని నాకు తెల్సు. అందుకే దైర్యం చేసి మాట్లాడాదాము అనుకునే లోపల,

ఆమె : ఏమైనా మర్చిపోయారా???
నేను: నా మనసు నీ దగ్గర మర్చిపోయాను, క్షేమంగా ఉన్నదా? (ఈ వాఖ్యం ఏ చిత్రంలోదో గుర్తులేదు)

ఆమె నవ్విన నవ్వు ఇప్పటికి నా గుండెల్లో మోగుతూనే ఉంది. అలా నవ్వుతూ నవ్వుతూ, తన కార్యలయంలోకి వెళ్ళిపోయింది. నేనూ వెనకనే వెళ్ళినప్పటికీ, కాపలాదారుడు అడ్డుకున్నాడు. చేసేది లేక ఇంటికి తిరిగి వచ్చేశాను. ఆ తర్వాత రొజూ మళ్ళీ అదే ఆటో, అదే నవ్వు, కాక పోతే, తను డబ్బులు ఇవ్వబొతుంటే నేను అడ్డుపడి మరీ ఇచ్చాను. ఆ రొజు నుండి ఇస్తూనే ఉన్నాను (:P).

ఈ రోజుకి ఇంతకన్నా ఊహించటం నా వల్ల కాదు..

2 comments: