Monday, November 10, 2014

వద్దు పొమ్మంది

విశ్వరూపం సినిమాలో " ఉండలేనంది నా ప్రాణం" అనే పాటను కంపు చేసే క్రమంలో, ఈ పాట పుట్టుకు వచ్చింది. 


వలచిన గీత , తలచిన సీత, మొరవిన లేవ, దరికే రావా 
ఎంత వేడినా కరుణే లేదే, పంతం వీడి నా వైపే రావే
కిల కిల పలుకులు పలికిన కూన, 
సూటిగ చెప్పిన, మెత్తగ చెప్పిన, సుతి మెత్తని నా మనస్సుతో చెప్పినా 
మాటే లేదే, మనసే రాదే, నా పైనే ప్రేమే లేదా? నా పైనే ప్రేమే లేదా?

పల్లవి :

వద్దు పొమ్మంది నా ప్రాయం నువ్వు కానక, ఓ చెలియా నన్ను వేధించకే  
                                                        నిన్నే వలిచానే నిన్నా మొన్నా - (4)
ప్రియా.... నువ్వు లేకున్న చోటల్లా అది శూన్యమే 
నువ్వు రాకున్న ప్రతి రోజు అది నరకమే , నీ వల్ల ఇలా ఉన్నానే.... 
ఛీ పో వద్దంది, ఛీ పో వద్దంది - (2)

గ మ ద ని స ని ద ప మ గ మ రి గ రి స॥ వద్దు పొమ్మంది ॥ 


చరణం ॥ 

అందాల వెన్నెల ఎన్నాళ్ళు ఉండునే - శశాంకమునకైన శంక ఉన్నదే 
నీ ఊహ నీడలో, ఎందాక ఉండనే - ఊపిరి కరువైన ఊరుకుండునే 
నిన్ను చేరాలిలే అవశ్యం -- (2)

ఓ....    కొండంత గుండె చేసి , గుండెలో గూడు కట్టి 
నిన్ను రోజు నేను మోస్తూ ఉంటే  -  మనసే మల్లె పూల వనం 

నీతో సావాసమే నాకు వనవాసమై పండగవ్వాలి నా ప్రాయమే 

హొయలే వడ్డ్రాణ్ణమాయె , సన్నని నీ నడుము చూసి, తలచి ..., వలచీ 
కన్న, నిన్ను కాదని ఎవరైనా, అందమని చూపిస్తే , కసిరి విసిరీ 
నిన్ను చేరాలనే నా, నిన్ను పొందాలనేనా, ఇంకో జన్మైన ఉంటుందా?
నిన్ను నా తోటి కలపాలి ఈ కావ్యమే, నేను చేశాను ఈ గానమే   

Sunday, October 12, 2014

అద్దంకి నుండి అమెరికా దాక

అద్దంకి నుండి చాలా మలుపులు తిరిగి, మొత్తానికి  అమెరికా చేరాను. ప్రస్తుతానికి ఓ మాదిరిగా ఉంది.. చూడాలి అమెరికా ఎలాంటి మనుషులని కలుపుతుందో???? ఎలాంటి పాఠాలు నేర్పుతుందో... ఇక విషయానికి వస్తే... 

ఇండియాలో అయినా, ఇక్కడ అయినా ఇళయరాజాని మాత్రం వదిలేది లేదాయే.... విమానంలో కూర్చొని, ఆకాశంలో ఎగురుతుంటే, నాకు నేనే రాజును అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో, ఈ పాట నా ఫోనులో వినపడింది. వెంటనే ఆ విమానంలోనే, ఆ పాటను కంపు చేసే కార్యక్రమం జరిగిపోయింది. కంప్యూటర్ లేక, ఉన్నా రాయటానికి ఖాళీ లేక, ఇదిగో ఇప్పటికి కుదిరింది.  


రాజాది రాజాను నేనురా!!! ఇక US వైభోగం చూడరా!!!
సాఫ్ట్ వేర్ సామ్రాట్ నేనురా!!! ఇక సన్నివేలు SFO నాదిరా!!!
Onsite ఏ నేను పట్టేశా... ఆకాశం అంచు తాకేశా 
గూగుల్ నే గుల్ల చేసేస్తా... బిల్ గేట్స్ నే నేను దాటేస్తా   ॥ రాజాది ॥ 

వెండి పేజి, గోల్డెన్ పెన్ తో బ్లాగు నేను రాస్తానురా
ఎవరు నువ్వని నన్నడుగుతుంటే, N.R.I  అని చెప్తానురా 
బారక్ ఒబామాను కలిసి, భళా భాగవతం భహుమతిస్తా 
తేనెలూరు తెలుగు నేర్పి, ఆవకాయ రుచి చూపిస్తా 
దీప్తి లేదు గనుక, ఆడింది ఆట ఇంక 
సీత వచ్చే దాక, నాకేది ఎదురు ఇంక 
      అమెరికా వీధులన్ని, ఆణువణువూ తిరిగేస్తా ॥ రాజాది ॥ 

వీకు ఎండు ఆ వైటు హౌసు, చుట్టి వచ్చా నే చిటికెలో 
As it Is ఇట్టాంటిదొకటి, కట్టించాలి మా ఊరిలో 
స్పీల్ బర్గ్ ని ఒప్పించి.., Tollywood కి రప్పిస్తా 
ఎర్ర తోలు పిల్ల వస్తే.., నాకు పెళ్లైందని పంపేస్తా 
రోజు తింటా రోఠి, నాకెవరు లేరు సాఠి 
పెట్టుకోను పోటి, నేను ఎవరి తోటి 
                               అద్దంకి వీధుల్లో, Hitech city కట్టిస్తా ॥ రాజాది ॥                               

అమెరికా నుండి రాస్తున్న మొట్ట మొదటి టపా!!!!!

Thursday, August 7, 2014

అతడు... రాముడు... 2014

ఒక సరదా సన్నివేశం... అతడు సినిమాని "మా" లో మళ్ళీ చూసిన ఆనందంలో వ్రాస్తున్న టపా......  
----------------------------------------------------------------------------------------------------------

సత్యన్నారాయణ మూర్తి : రాముడు .... ఏమిటిది???
నేను : టపా .... ఇంగ్లీషులో పోస్టు అంటారు అని, మా ఆవిడ గారు ఇప్పుడే చెబుతున్నారు , నువ్వు అడిగావు. 
సత్యన్నారాయణ మూర్తి :   తెలివిగా రాయద్దు రాముడు 
నేను : చూశావా!!! బ్లాగు రాయకపోతే బద్దకం అంటారు... కష్టపడి రాస్తే, పని పాటా లేదంటారు...  మరి నన్ను ఏమి చేయమంటారు???
సత్యన్నారాయణ మూర్తి :  ఈ బ్లాగులు అన్నీ ఆపేసి, ఆ నవలలు ఏవో రాసుకో .........
సత్యన్నారాయణ మూర్తి: (మా ఆవిడతో) :  దీప్తీ గారు, అడ్డమైన చెత్తంతా వీడు బ్లాగుల్లో రాస్తూ ఉంటాడని మీకు తెలుసు.... ఇలాంటి రాతలను ఆపకపోయినా పర్వాలేదు కానీ, ఇలా దగ్గరుండి రాయించటం మాత్రం, మీకు ఆరోగ్యం అనిపించుకోదు. 
దీప్తి : చూడండి... ఈ బ్లాగులు చదవటం ఎందుకు అని మీకు అనిపించింది అనుకోండి... మీ ఆరోగ్యానికి మంచిది. ఇలా వచ్చి గొడవ చేస్తే... మీ మీద కూడా ఒక బ్లాగు రాస్తాడు... ఛీ... రాముడు లాంటి రచయితతో మనకేంటి అని వదిలేశారనుకోండి, బోలెడు Time Save అవుతుంది. 
నేను : అదండి సంగతి,  అలా జరిగింది. కాబట్టి నేను రాయటం ఆపను
సత్యన్నారాయణ మూర్తి : రాముడు.... ఇప్పుడే వెళ్ళి ఇంకో నలుగురుని తీసుకొని వచ్చి, నీ చేత రాయటం ఆపిస్తాను.

రమణ : ఏంటి పార్ధు.. ఏమన్నా గొడవ??
పార్ధు : పెళ్ళి అయినా, రాముడు రాయటం ఆపలేదు
రమణ : తోచక రాస్తూ ఉన్నాడేమో..., ఆపేయమని చెబుదాములే...
పార్ధు : వెళ్ళి ఒకసారి చెప్పి వస్తా
రమణ : ఎందుకూ.....
గిరి : మాట్లాడటానికే కదరా, వెళ్ళనీ
రమణ : వీడిప్పుడు రాముడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదురా!!!
గిరి : ఏ వాడేమైనా పెద్ద తోపు రచయితా??

పార్ధు : అనంతరామయ్య, నువ్వు చేసేది తప్పయ్యా..... 
నేను : తెలుసయ్య కానీ మానలేక పోతున్నా, ఏమి చేయమంటావు? పెళ్ళికి పూర్వం రెండు, మూడు పోస్ట్ లు రాసే వాడిని, ఇప్పడు బాగా తగ్గించా.... 
పార్ధు : నేను మాట్లాడేది బ్లాగుల గురించి కాదు...
నేను : కొంపదీసి నవలల గురించా?  చూడు బాబు, నేను ఇప్పటికి వందకు పైగా టపాలు రాశాను, మూడు నవలలు రాశాను. త్వరలో ఇంకొక నవల అయిపోతున్నది..., అది చదివాక Automatic గా నీకు గుండెపోటు వస్తుంది.., కాబట్టి కంప్యూటర్ కాడ రెడీగా ఉండు... వెళ్ళు
రమణ : పార్ధు... కంపుతో కబడ్డీ ఆడుతున్నావు నువ్వు...
పార్ధు : దీప్తీ గారు.., మీరన్నా చెప్పండి, ఈ రాతలు ఆపమని
దీప్తి : According to his mentality.., he doesn't stop writing, you know!!!
పార్ధు : అంటే ఈ విషయంలో మీరు ఏమీ చేయలేరా??? ఏమీ చేయలేరా??? ఖర్మ... చదవక తప్పుతుందా!!!

అర్ధం కాని వాళ్ళు ఈ వీడియో చూడగలరు 
చివరగా ఒక ప్రశ్న... అతడు సినిమా "మా" టీవీలో ఇప్పటి వరకు ఎన్ని సార్లు ప్రసారం చేసి ఉంటారు??? ఎన్ని సార్లు చూసినా, ఇంకా చూడాలీ అనిపిస్తుంది... 

Saturday, May 10, 2014

అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు

క్రొత్తగా పెళ్ళైతే చేసే మొదటి పని .... గుళ్లని, పుణ్య క్షేత్రాలని దర్శించటం. అందులో భాగంగానే, పెళ్లి అయిన మూడో రోజు, సతీ సమేతంగా విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లాను. ఏమి అదృష్టమో తెలియదు, వెళ్ళిన ప్రతి సారీ, అమ్మ వారి దర్శనం నిముషాలలో దొరుకుతుంది. ఈ సారి కూడా అలానే 100/- టికెట్టుతో పావు గంటలో దర్శనం చక్కగా అయ్యింది. భవ సాగరాన్ని బాగా ఈదేలా చూడమని అమ్మని వేడుకున్నాను. జనం కూడా పెద్దగా లేకపోవటంతో ప్రశాంతంగా బయటకి వచ్చాను. ప్రశాంతతను కోల్పోయాను.

అమ్మవారి దర్శనం అవ్వగానే... స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయ్యాక, పెద్ద పెద్ద విభూతి బొట్టు పెట్టుకున్న పంతులుగారు అడిగారు, "క్రొత్తగా పెళ్లి అయ్యిందా?" అని. అవునన్నాను. ఆ మాటకు ఆయన కళ్ళల్లో అమితమైన ఆనందాన్ని గమనించాను. నాకు పెళ్లి అయితే ఇతనికేంటా అంత ఆనందం అని అనుమానం వచ్చింది. నా నుదుటున, రూపాయి బిళ్ళంత బొట్టు పెట్టి, పేరు, గోత్రం అడిగి మంత్రాలు చదవటం మొదలు పెట్టాడు. ఒక నిముషం చదివి, ఒక అయిదు వందల నోటు తీసి... నీకు పిల్లలు పుట్టాలని పది మందికి భోజనాలు సమర్పించు అన్నాడు. నాకు ఏమీ అర్ధం కాలేదు. నా పేరు మీద అతనే 500 తీశాడేమో అనుకున్నా. ఒక 500 ఇవ్వు అనట్టు సైగ చేసాడు. నేను ఇచ్చాను అనటం కన్నా, అతను లాక్కున్నాడు అంటే బాగుంటుంది. తీర్ధం తీసుకొని బయటకు వచ్చాను.

అమ్మవారు, అయ్యవార్ల దర్శనం అయిపోయింది కదా అని వచ్చిన దారిలోనే బయటకి వెళ్లబోయాను. మధ్యలో ఒకామె నిలబడి.. అటు వైపు ఇంకా గుళ్ళు ఉన్నాయి, అటు నుండి వెళ్ళాలి అన్నది. అక్కడ వరుసగా నాలుగు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. మొదట వినాయక మందిరంలో పూజారిగారు  , అవే ప్రశ్నలు అడిగారు. తీర్ధం ఇచ్చాక ఒక వంద నోటు తీసి నాకు చూపించి, ఇందాక గుళ్ళో చెప్పినట్టే చెప్పి వంద లాకున్నాడు. ఇలా మిగితా మందిరాలలో కూడా వంద కాగితం చూపించటం, నా దగ్గర వంద లాగటం జరిగింది.

ఆ నాలుగు ముగించుకొని బయటకు వచ్చాక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉందన్నారు. అక్కడ పంతులుగారికి కాసిన్ని ఎక్కువ మంత్రాలు వచ్చులాగుంది... ఎక్కువ సేపు చదివి, 500 నోటు బయటకు తీసి, నన్ను ఒక 500 ఇవ్వమన్నట్టు సైగ చేశాడు. నా జేబులో చూస్తే వంద కాగితం మాత్రమే ఉన్నది. చేసేది లేక, నా దగ్గర ఉన్న ఆఖరి వంద కాగితం కూడా పళ్ళెం లో పెట్టి ఇచ్చాను. "నేను 500 అడిగితే, 100 కాగితం ఇస్తావా? నాకు గిట్టుబాటు కాదు. నీ లాంటి వాళ్ళు గుళ్ళకు ఎందుకు వస్తారో?" అన్నట్టు నా వైపు, నీచంగా చూశాడు. చేసేది లేక తల దించుకొని బయటకు వచ్చాను. ఆ విధంగా పంతుళ్ళందరూ కలిసి అమ్మవారి సాక్షిగా, నా ఆస్తిని పంచుకున్నారు.

నాకు మొదలే గుళ్లకు వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా చిరాకు. ఇలాంటి సంఘటనలు చూసి ఆ చిరాకు పదింతలు అవుతున్నది. దోచుకోవటం అంటే మరీ ఇలానా??? దీనికి పరిష్కారం లేదా???

Friday, April 4, 2014

బ్యాంకు క్లర్కుకి, సాఫ్ట్ వేరుకి పెళ్లి చేసె పాడు లోకం

"పెళ్ళంటే నూరేళ్ళ మంట.... " అని ఎవరు అన్నారో కానీ, అది అక్షర సత్యం. ఆ మంట జీవితానికి సరిపడా వంట చేసి పెడుతుంది, జీవితానికి సరిపోయే వెలుగుని ఇస్తుంది!!!!!

"మొత్తానికి కవిగాడి పెళ్లి కుదిరింది" అని స్నేహితులు అంటున్నారు. ఆ కవిగాడిని నేనే.., ఆ పెళ్ళీ నాకే (నేను కవిని ఎప్పుడు అయ్యానో..., ఇప్పుడు అనవసరం). ఇప్పటికీ చాలా రోజుల తరువాత నన్ను కలిసిన పెద్ద వాళ్ళు, "ఇప్పుడు ఏమి చదువుతున్నావు బాబు?" అని నన్ను అడుగుతూ ఉంటారు (దాని అర్ధం, నేను ప్రతి తరగతిలోనూ తప్పుతాను అని కాదు). అలాంటి నాకు, అప్పుడే పెళ్లి అనే సరికి ఆశ్చర్యం వేస్తున్నది. ఎంత ఆశ్చర్యం అంటే, సాక్షిలో చంద్ర బాబు గారినీ, ఈనాడులో జగన్ అన్నని పొగిడినంత ఆశ్చర్యంగా ఉందంటే నమ్మండి. 

"పెళ్ళంటూనే వేడెక్కిందే గాలీ" అన్నారు ఆచార్య ఆత్రేయ గారు. ఎందుకు వేడి ఎక్కదు ? ఎండాకాలంలో పెళ్లి పెట్టుకుంటే. విజయవాడలో అందునా ఏప్రిల్ ఎండల్లో పెళ్లి చేసుకోవటం, నా జీవితంలో నేను చేయబోతున్న మొదటి సాహసం. ఏప్రిల్ 18, శుక్రవారం నాడు ముహూర్తం నిశ్చయించారు. ఐదు రోజుల పెళ్లి  చేసుకుంటున్నాను కాబట్టి, మీరు సోమవారం నుండే సెలవలు పెట్టి మరీ రావాల్సిందిగా విజ్ఞప్తి.  







బొచ్చె కూడు కూడా ఏర్పాటు చేయదలిచాము. తిని, మా పేర్లు కలిసినట్టే, మేము కూడా కలిసి ఉండాలని దీవించి వెళ్లవలసినదిగా కోరుతున్నాను . మీరు అందరి రాక కోసం ఎదురు చూస్తూ... అప్పటి వరకు "బ్యాంకు క్లర్కుకి, సాఫ్ట్ వేరుకి పెళ్లి చేసె పాడు లోకం " అని పాడుకుంటూ ఉంటాను.


Friday, February 14, 2014

ప్రేమికుల రోజు జల్సాగా

ఈ పోస్టు చదివే ముందు ఈ వీడియోను చూడండి . లేకపోతె అర్ధం కాకపోవచ్చు

స్నేహితుడు : ఇవాళ valentine's day తెలుసా
నేను : తెలుసు, అయితే ఏంటి?
స్నేహితుడు: చస్తున్నాను రా!!! ఇవాళ నా girl friend కి ఏదో ఒక gift ఇవ్వాలి, బండి మీద బయటకి తీసుకెళ్ళాలి
నేను : తీసుకెళ్ళు
స్నేహితుడు : నీకేమిరా, ఏ భజరంగ్ దళ్ వాళ్ళు చూస్తే spot లో పెళ్లి చేస్తారు. మా ప్రేమికుల కష్టాలు, బ్రహ్మచారివి నీకేమి తెలుసు రా?

నేను: కష్టాలా? ఏంట్రా అన్నావ్, అవి కష్టాల్రా? ఖరీదైన bike లో తిరుగుతూ, వెనక lover ని ఎక్కించుకొని హైదరాబాదులో పార్కులన్నీ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టి ఒకళ్ళకొకళ్ళు gifts ఇచ్చుకొనే మీకు valentine's day కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, valentines day కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఇవాళ నువ్వు విను

ఒక అమ్మాయితో మాట్లాడాలంటేనే నాలుగు గంటలు ఆలోచించే మనుషులున్నారని నీకు తెలుసా?  -నాకు తెలుసు

సినిమాలంటే అబ్బాయిలతోనే వెళ్లాలని, అమ్మాయితో వెళ్ళటం అంటే అది పెళ్లి అయ్యాకే సాధ్యం అన్న విషయం నీకు తెలుసా? - నాకు తెలుసు

అమ్మాయిలతో తిరగాల్సిన వయస్సులో, సరైన అమ్మాయి దొరక్క యువకులు అల్లాడి పోతున్నారని నీకు తెలుసా?

పిల్ల కోసం మాట్రిమోనిల వైపు, పెళ్లి కోసం అమ్మానాన్నల వైపు చూసే అభాగ్యులు ఈ సమాజంలో, నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో బ్రతికున్నారని తెలుసా నీకు ??

పెళ్లి చూపులు అయిపోయిన అరగంటకే అమ్మాయికి నువ్వు నచ్చలేదు అని చెప్తే, ఆ భాద ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా -- నేను అనుభవించాను

కంటికి కనిపించే ప్రతి అందమైన అమ్మాయి, భుజాలు పట్టుకొని దగ్గరకు లాగుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా?

మనల్ని ఒక అమ్మాయి ప్రేమించాలంటే మన దగ్గరున్న పేరు, డబ్బు సరిపోవు,  అమ్మాయిలకు దూరంగా వీటన్నింటినీ వదిలేసి దూరంగా వెళ్లి సన్యాసులలో కాలవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా?

కాషాయం నిన్ను ఎప్పుడైనా come on అన్నట్టు అనిపించిందా?

తాళి కట్టక పోయినా తేలికగా బ్రతకగలము అని నీకు ఎప్పుడైనా అనిపించిందా
నాకు అనిపించింది, అందుకే బ్రహ్మచారిగా ఉన్నాను

ఇక్కడ valentine day కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. నీకు లేదు, ఖచితంగా నీకు లేదు......

అమ్మాయి ప్రేమకు నోచుకోని, అభాగ్యులారా...... ఈ టపా మీకు అంకితం.... క్షమించాలి, మనకు అంకితం
మీరు కూడా ఈ కష్టాలు పడుంటే... మీ స్నేహితులతో ఈ పోస్టు పంచుకోండి......


Wednesday, February 12, 2014

సాఫ్ట్‌వేరులం మేము సాఫ్ట్‌వేరులం

చాలా రోజుల తర్వాత ఒక పాట రాశాను. అది కూడా మా సాఫ్ట్ వేరుల మీద రాయటం సంతోషంగా ఉంది. కాకపోతే పాట చాలా చిన్నదనే కొంచం భాదగా ఉంది. సినిమాలల్లో తరచూ మా వాళ్ళని కమేడియన్ గా, వెకిలిగా చూపిస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. సినిమాలల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా మందికి మా సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ఎందుకో కడుపు మంట. మంట ఒకటే అయినా దానికి కారణాలు మాత్రం అనేకం.

కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎవడి వృత్తి వాడికి గొప్ప. ప్రతి దాంట్లో కష్ట పడితేనే ఫలితం ఉంటుంది. మాకేదో వారానికి ఐదు రోజులే పని, రెండు రోజులు సెలవలు అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అస్సలు ప్రపంచంలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు? మేము. రైల్ టికెట్ దగ్గర నుంచి, రాకెట్ల దాకా మా సాఫ్ట్ వేర్ వాడని ప్రదేశం ఏదీ లేదు. అలాంటి మమ్మల్ని ఎవడైనా ఏమైనా అంటే, కత్తులతో కాదురా, కోడ్ తో చంపేస్తాం.

సరే ఇక పాట విషయానికి వస్తే, గబ్బర్ సింగ్ సినిమాలో తాగుబోతుల మీద రాసిన పాటను మార్చి రాశాను. పాట రాశాను కదా అని సాఫ్టువేరోళ్ళం, తాగుబోతులు ఒకటేనా అని ఎవరైనా అన్నారో...... బాగుండదు చెప్తున్నా.... 


సాఫ్ట్ వేరులం మేము సాఫ్ట్ వేరులం 
any time మాకు మేమే గొప్ప వీరులం --- (2)

5 days work చేస్తాం, weekend enjoy చేస్తాం 
మళ్ళీ monday వచ్చేదాక malls అన్నీ దున్నేస్తాం 

సాఫ్ట్‌వేరంటే ఎందుకంత చులకన ? మీరు మాలా పని చేయలేరు గనకనా?
లైఫ్ ఇంత made easy ఎందునా? మేం సాఫ్ట్ వేర్ కోడ్ రాయటం వల్లన 

ప్రగతికింక సాఫ్ట్ వేరే నిచ్చనా, పోయేదేమి లేదు మీరు ఏడ్చినా గీడ్చినా  


వర్ధిల్లాలి వర్ధిల్లాలి సాఫ్ట్ వేర్ వర్ధిల్లాలి

త్వరలోనే ఈ పాటను సాఫ్ట్ వేర్ జాతి గీతంగా ప్రకటించాలని కోరుకుంటున్నాను