Saturday, December 14, 2013

శునకానందం

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక కుక్క ఉండేది. దాని పేరు 'రాజు'. కుక్క పేరు 'రాజు' ఏంటి అనుకుంటున్నారా? అడవికి రాజు ఎవరు? సింహం. గ్రామానికి సింహం ఎవరు? కుక్క. మరి కుక్కకి 'రాజు'అని పేరు పెడితే తప్పేంటి?? అది చచ్చిపోయి ఇవాల్టికి సరిగ్గా 20 సంవత్సరాలు అయ్యింది. 'రాజు' ఆల్సేషనూ కాదు, సెన్సేషనూ  కాదు. 24 గంటలూ ఇంటి బయట తిరుగుతూ ఉండేది. సాటి కుక్కలతో ఆడుకోవటానికి కూడా వెళ్ళేది కాదు.రోజూ మా బామ్మ, నాకు అన్నం పెట్టాక, దానికి కూడా అన్నం పెట్టేది.

కాకపోతే రాజులోని ప్రత్యేకత ఏంటంటే? రాత్రుళ్ళు మనకి తెలిసిన వాళ్ళు వస్తే బాగా అరిచేది, తెలియని వాళ్ళు వస్తే, అరవటం కాదు కదా, కనీసం మొరిగేది కూడా కాదు. నాకు ఊహ తెలిసే సరికే అది బాగా ముసలి కుక్క కావటంతో, కొన్నాళ్ళకు చనిపోయింది. ఇందాకేదో తమాషాగా అన్నాను తప్పించి, అది చనిపోయిన రోజు నిజానికి నాకు గుర్తు లేదు. ఎన్నని గుర్తుంచుకుంటాము? అస్సలే నా జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అందుకే అప్పుడప్పుడు రాసిన దాని గురించే మళ్ళీ మళ్ళీ రాస్తుంటాను.  నాకు మాత్రం కుక్కలంటే మహా భయం. అవి కరుస్తాయని ఒక కారణం అయితే, కరిస్తే పత్యం ఉండాల్సి రావటం ఇంకో కారణం. 

రెండేళ్ళ తరువాత, ఒక చిన్న కుక్క పిల్లని ఎవరో తీసుకు వచ్చి ఇచ్చారు, పెంచుకోమని. అది డాబర్ మాన్ జాతికి చెందినది అని చెప్పారు. దాని జాతిలోనే మాన్ అని ఉంది కదా అని మానవత్వంతో దానిని పెంచాలని నిర్ణయించుకున్నాను. నాలుగు రోజుల తరువాత తెలిసింది, నేను పెట్టే తిండి దానికి చాలదని, ఇంకా బలమైన ఆహారం పెట్టాలని, కుదిరితే మాంసాహారం పెట్టాలని. ఇంట్లో అందరం శాకాహారులం అయ్యుండి, అదొక్కటే మాంసాహారం ఎందుకని దానిని వేరెవరికో ఇచ్చేశాను.  ఆ తర్వాత, ఇప్పటి వరకు మళ్ళీ కుక్కల జోలికి వెళ్ళలేదు. 

నా స్నేహితుడొకడికి కుక్కలంటే ప్రాణం. ఇంట్లో నా అంత ఎత్తు కుక్కని పెంచుకుంటున్నాడు. నేను వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా, వెంటనే వచ్చి నాకటం మొదలుపెడుతుంది. నాకు మాత్రం చచ్చే చిరాకుగా, భయంగా ఉంటుంది. నా స్నేహితుడు మాత్రం దానిని బాగా ముద్దు చేస్తాడు. వాళ్ళ అన్యోన్యతను చూసి అప్పుడప్పుడు నేను కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది. దాని కల్ముషం లేని ప్రేమ చూస్తే (దూరం నుంచి) ముచ్చట వేసేది. అలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలు చనిపోతే, ఎంతో విల విలలాడి పోయేవాడు. పాపం దిగులుతో రెండు రోజులు భోజనం కూడా చేసేవాడు కాదు. దాని అంత్యక్రియలు కూడా బాగా జరిపించే వాడు. కుక్క, కుక్క చావు చావకుండా చూసేవాడు. నిజమే, కొంత మంది మనుషులు కుక్క చావు చచ్చారు అంటారు కదా, అలానే ఆ కుక్క మనిషి చావు చచ్చింది అనమాట!!!

మా ఇంటి ప్రక్కన శ్రీను, చక్రి అని ఇద్దరు చిన్న పిల్లలు ఉంటారు. చిన్నోడు శ్రీనుకి 4 ఏళ్ళు, పెద్దోడు చక్రికి 6 ఏళ్ళు. పిల్లలు గొడవ చేయటంతో వాళ్ళ నాన్న ఒక చిన్న కుక్క పిల్లని ఇంటికి తీసుకు వచ్చాడు. నాలుగు రోజులు బాగానే జరిగింది. ఐదో రోజు చిన్నోడు ఉన్నట్టుండి ఏడుపుకి లేచాడు. వాడిని ఓదార్చటం ఎవ్వరి వల్లా కాలేదు. స్పెషలిస్ట్ ని పిలుద్దాము అనుకొనే లోపు, "కుక్క కరిచింది" అని ఏడుస్తూ చెప్పాడు. అది ఊర కుక్క  అయినప్పటికీ ఊరికే కరవదు కదా అని అనుమానం వచ్చింది. "ఎందుకు కరిచింది రా?" అని గట్టిగా అడిగితే, "దాని తోక అటూ ఇటూ ఊగుతున్నదని, ఒక సారి లాగాను. మళ్ళీ తోక ఊపింది. ఈ సారి ఇంకా గట్టిగా లాగాను, కరిచింది" అని ఏడుస్తూ చెప్తుంటే మా అందరికీ నవ్వు ఆగలేదు. 

చివరగా, చిన్నప్పుడు ఒక పద్యం చదివినట్టు గుర్తు "కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి " అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సింహాసనం మీద కుక్కని కూర్చోబెడితే, కనీసం విశ్వాసంతో అయినా మంచిగా పని చేస్తుందేమో!!!

Saturday, November 16, 2013

పోయిరా దేవుడా

 అది 1992 అనుకుంటా,రంగు చొక్కాలు తొడుకున్న వాళ్ళు టి.వి లో ఏదో ఆట ఆడుతున్నారు. మా పెదనాన్న మూర్తిగారు, అదే పనిగా చూస్తూ, తిడుతూ ఉన్నాడు. "అస్సలు ఏంటా ఆట? ఏమా గోలా?" అని అడిగాను. దానిని క్రికెట్ అంటారని చెప్పాడు. నేను కూడా చూడటం మొదలు పెట్టాను. ఒకతను, కరెక్టుగా బ్యాటుకు రెండింతలు ఉన్నాడో లేడో? నిలబెట్టిన పుల్లల మధ్యన, అటు ఇటు తెగ పరిగెడుతున్నాడు. "ఎవరతను అంత ఇదిగా పరిగెడుతున్నాడు పుల్లల మధ్యన" అని పెదన్నాన్నను అడిగాను. అతనేరా 'సచిన్' అంటే అని చెప్పాడు. ఎందుకో అతను ఆడుతుంటే అలానే చూస్తూ ఉండాలి అనిపించింది. 

ఆ తర్వాత ఎప్పుడు క్రికెట్ వచ్చినా, నా కళ్ళు ఆ బుడ్డోడి మీదనే ఉండేవి. ఎందుకో అమితమైన అభిమానం పెరిగిపోయింది అతగాడంటే. కొన్ని రోజులకి కర్ర బిళ్ళా, గొలీల నుండి క్రికెట్ మీదకుమనస్సు మళ్ళిన రోజులు వచ్చాయి. మా ఊర్లో ఉన్న ఫ్యాన్సీ షాపులు అన్నీ తిరిగి, ఒక బ్యాటు కొనుక్కోని ఆడటం మొదలు పెట్టాము. సచిన్ లాగే నిలబడటం, అతని లాగే ఆడాలని ప్రయత్నించటం, చివరికి అవుట్ అవ్వటం. 

కాలంతో పాటు సచిన్ బ్యాటు కూడా మారిపోయింది. మా వీది చివరన ఉండే "సితార ఫ్యాన్సీ" షాపు వాడిని, MRF బ్యాటు తెమ్మని ఎన్ని రోజులు విసిగించానో, నాకే గుర్తులేదు. నా బాధని గమనించిన మా నాన్న, ఒక చెక్కతో బ్యాటు చేయించి ఇచ్చాడు. దానికి రంగు పూసి, దాని మీద MRF అని అందంగా రాసి, ఆరబెట్టి, ఆడుకుంటే తప్ప మనస్సు శాంతించలేదు. 

మెల్లగా అభిమానం కాస్త, పిచ్చిగా మారింది. స'చిన్నోడి' ఫోటో ఎక్కడ కనపడితే అక్కడ దానిని కత్తిరించి దాచిపెట్టటం, అలా కత్తిరించిన వాటన్నింటినీ, వారంలో ఒక రోజు కూర్చొని, ఒక పుస్తకంలో అతికించటం. అలా అతికించిన పుస్తకాన్ని పదే పదే చూసుకోవటం, ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతున్నది. బూస్టు తాగితే బలం వస్తుందో, రాదో నమ్మకం లేకపోయినా, కేవలం "Boost is the secret of my energy" కోసం, రోజు అదే తాగటం కూడా అయ్యింది. 

సచిన్ బ్యాటింగ్ కోసం, నాకు ఎన్ని సార్లు కడుపు నొప్పి వచ్చిందో నాకే గుర్తులేదు. అదేంటో నేను చూస్తే, సచిన్ అవుట్ అవుతాడని మా నాన్నకి గట్టి నమ్మకం. "నువ్వు చూడద్దు రా, చూస్తే వెంటనే అవుట్ అవుతాడు" అని ఎప్పుడూ అంటూ ఉండే వారు. దేవుడి దయ వల్ల, మా నాన్న నాలుక మీద మచ్చలు లేక పోవటంతో, మనోడు కూడా అవుటవ్వకుండా  ఆడేవాడు అనుకోండి, అది వేరే విషయం. ఒకవేళ అవుటయితే, నేను టి. వి ఆపేలోపే "సచిన్ అవుటయ్యాడుగా, ఇంక పోయి చదువుకో" అనేవారు. 

నా పుట్టిన రోజున ఇప్పటి వరకు కేకు కోయని నేను, సచిన్ పుట్టిన రోజున, స్నేహితులతో కలిసి కేకు కోసి ఆనందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సచిన్ సెంచరీ చేస్తే, ఆ రోజు అంతా పండగ చేసుకోవటం, తక్కువకే అవుటయితే, పరీక్ష తప్పిన దానికన్నా ఎక్కువ బాధ పడటం. వీటన్నింటినీ మించి, సచిన్ సంస్కారం, నడవడిక ఇవన్నీ చూసి, అతన్ని ఇంకా ఆరాధించాను.

సచిన్ ని ఎవడైనా ఏదైనా అంటే విపరీతమైన కోపం రావటం, తరువాత తిట్లు రావటం, దాని వల్ల సమస్యలు రావటం ఇవన్నీ కూడా మామూలు అయ్యాయి. అలా కొంత మందితో మాట్లాడటమే మానేశాను కూడా (ఇప్పుడు అర్ధం అయిందా? నా గోల శాశ్వతంగా తప్పించుకోవాలంటే ఏమి చేయాలో).  అస్సలు జీవితంలో ఒక్కసారి బ్యాటు పట్టుకోవటం రాని వాడు కూడా సచిన్ గురించి తక్కువగా మాట్లాడే వాడే, నరికెయ్యాలి అన్నంత కోపం ఇప్పటికీ, అప్పుడప్పుడు వస్తుంది. 

దాదాపు పాస్ వర్డ్లు అన్నీ, సచిన్ పేరు మీదనే పెట్టుకోవటం, తోచనప్పుడల్లా అతని పాత వీడియోలు చూడటం, అతని రికార్డులను పదే పదే చదవటం., అదొక ఆనందం. అలాంటిది సచిన్ ఇంక క్రికెట్ ఆడటం లేదు అని తెలిసి జీర్ణించు కోవటం కొంచం కష్టమే. ఎప్పుడో ఒకప్పుడు ఈ రోజు వస్తుందని తెలుసు, కానీ వచ్చేసిందే అన్న బాధ.... వెంటనే 'భారత రత్న' వచ్చింది అన్న చిన్న ఆనందం. 

ప్రస్తుతానికి, ముఖ పుస్తకంలో కనిపించిన సచిన్ ఫోటోకల్లా, లైక్ కొట్టటం, సచిన్ చివ్వరగా చెప్పిన మాటల్ని పదే పదే వింటూ బాధ పడటం చేస్తున్నాను. ఈ పోస్టు రాస్తున్నప్పుడు కూడా రెండు చుక్కలు అలా రాలి కీబోర్డు మీద పడ్డాయి. సచిన్ క్రికెట్ నుండి అయితే వెళ్ళాడు కానీ, మనస్సుల లోనుంచి వెళ్ళలేదు. నా కంప్యూటర్, సెల్ల్ ఫోన్లనుండి, ముఖ పుస్తకంలోని కవర్ పేజీలనుండి , పాస్ వర్డ్ ల నుండి  మాత్రం ఎప్పటికీ ఉంటాడు. క్రికెట్ లో సచిన్ బదులు ఇంకొకళ్ళు వస్తారేమో, సచిన్ రికార్డులని కొన్నింటిని బద్దలు కొడతారేమో, కానీ ఇంకో సచిన్ మాత్రం ఎప్పటికీ రాడేమో..... 

ఈ శీర్షికని ఇంతకన్నా వివరంగా రాయాలని ఉన్నా, రాయలేక ఇక్కడితో ఆపేస్తున్నాను 

Thursday, October 31, 2013

శుక్కురారం సంగీత తీర్ధం

చిన్నప్పటి నుండి సినిమా పాటలే ఎక్కువగా వినే వాడిని. శాస్త్రీయ సంగీతం అంటే కొంత ఆశక్తి ఉన్నప్పటికీ ఆ పాటలు విన్నది తక్కువే. ఎప్పుడైనా టీవీలో విన్నా కానీ విసుగు పుట్టేది. పాడిన లైనే పాడీ, పాడీ విసిగిస్తారేంటో అనుకునే వాడిని. బాల మురళి కృష్ణ గారి గొంతు వింటే, అస్సలు నచ్చేది కాదు. బహుశా బాల సుబ్రహ్మణ్యానికి బాగా అలవాటు పడిన చెవులు కావటం మూలాన అనుకుంటా!! 

ఇది ఇలా ఉండగా, నారాయణ స్వామిగారు ప్రతి శుక్రవారం నాడు, ముఖ పుస్తకంలో "శుక్కురారం సంగీత తీర్ధం" అన్న పేరుతో, వారినికి ఒక శాస్త్రీయ సంగీతానికి సంభందించిన పాటనో, కృతినో ( ఆ రెండింటికి తేడా ఏంటని అడక్కండి) పరిచయం చేసే వారు. ఆ పాటకు సంభందించి యుట్యూబ్ లంకేతో సహా ప్రచురించే వారు. వారం వారం ఆ పాటలు వింటూ ఉండే వాడిని.  మొదట్లో ఏమంతగా నచ్చేవి కాదు. "గాడిదకు ఏమి తెలుసు గంధపు చెక్కల వాసన" అని తెలుసుకోవటానికి చాలా రోజులే పట్టింది.

కొన్ని పాటలు విన్న వారం తరువాత కూడా నోటిలో నానుతూ ఉండేవి. మెల్లగా ఆ పాటలు వినటం ఎక్కువై పోయింది. సుబ్బలక్ష్మి గారివి, మంగళంపల్లి వారివి ఇలా యుట్యూబ్ లో ఒక దాని తరువాత ఇంకొకటి విన్నాను. అస్సలు ఈ పాటలన్నింటిలో ఏవి చాలా గొప్పవి అని అడిగితే, త్యాగరాజు వారి కీర్తనలు అద్భుతం, అందులోను "పంచ రత్న కీర్తనలు" ఇంకా అద్భుతం అని తెలిసింది. త్యాగారాజంటే ఆ కాలంలో, మన తమన్ అంత గొప్ప సంగీత విద్వాంసుడట!! ( సచిన్ టెండూల్కర్ కి, సందులో క్రికెట్ ఆడేవాడికి పోలిక పెట్టినట్టు ఉన్నదని నాకు కూడా తెలుసు, నా వెటకారాన్ని అర్ధం చేసుకొని తిట్టరని ఆశిస్తున్నాను)

అస్సలు ఈ పంచ రత్న కీర్తనలు ఏంటి అని వెతికితే తెలిసింది, ఇవి మొత్తం ఐదు పాటలు. నాలుగు తెలుగులో ఉంటే, ఒకటి సంస్కృతంలో స్వరపరిచారు త్యాగరాజస్వామి వారు. త్యాగరాజుగారు పుట్టింది మా జిల్లాలోనే అని తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. యుట్యూబ్ లో వెతికి అవి విన్నాను. వింటూనే ఉన్నాను. నిజంగా ఒక్కో కీర్తన ఒక్కో రత్నం కంటే విలువైనవి. ఈ సంగీత జ్ఞానం లేని నా లాంటి వాడికే ఇంతలా నచ్చితే, సంగీతం వచ్చిన వాళ్ళు, బహుశా ఈ కీర్తనలు రెండు సార్లు పాడుకుంటేనే కడుపు నిడుతుంది కాబోలు. మీరు ఇప్పటికీ నాకు మల్లే వినని వారైతే మీకోసం 


ప్రతి సంవత్సరం "త్యాగరాజ ఆరాధనోత్సవాల"లో ఈ పంచ రత్నాలను ప్రత్యేకించి పాడతారట. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఆయన తెలుగులో చేసిన కీర్తనలను, తెలుగువాళ్ళకన్నా, తమిళనాడులో తమిళులు ఎక్కువగా సాధన చేస్తారట!! ఈ పాటల కోసం వాళ్ళు తెలుగుని నేర్చుకొని మరీ పాడతారని తెలిసి ఆశ్చర్యపోయాను. నేను సంగీతం ఎందుకు నేర్చుకోలేదా అని తెగ బాధపడిపోతున్నాను. అదృష్టం బాగుండి, బాగా సంగీతం నేర్చుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఉచితంగా, తేలికగా సంగీతం నేర్చుకుంటాను. ఇలా నాకు సంగీతం మీద ఇష్టం పెరగటానికి కారణం అయిన నారాయణ స్వామి గారికి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. 
                                          
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై 
యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ 
ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై 
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ 

అని 'ఏనుగు లక్ష్మణ కవి' గారు అన్నారు. దాని అర్ధం నీచులు పని మొదలే పెట్టరు, మధ్యములు మధ్యలో వదిలేస్తారు, ధీరులు ఎన్ని ఆటంకాలు వచ్చినా లక్ష్యాన్ని చేరేదాకా ఊరుకోరు అని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే..., సొంత డబ్బా కోసం. ఇది నేను రాస్తున్న వందో శీర్షిక. ఇంకో విశేషం ఏంటంటే ఇవాల్టితో నేను బ్లాగటం మొదలు పెట్టి మూడు సంవత్సరాలు అయ్యింది. 100 శీర్షికలు, 54000 పైగా వీక్షకులతో ముందుకు పోతున్నందుకు ఆనందంగా ఉంది. పై పద్యంలో చెప్పినట్టు నీచ మానవుడను ఐతే మాత్రం కాదు. మధ్యముడినో లేక ధీరుడినో తెలియాల్సి ఉంది. వంద రాసినందుకు ఆనందిస్తూ, ఇంకా రాయాలని ఆకాంక్షిస్తూ.......


Friday, October 11, 2013

ఆ మాత్రం ఎంగ్లీషులో నేనూ రాయగలను

"విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు" అని మహానుభావుడు విశ్వనాధ సత్యన్నారాయణ గారి నవల చదివితే అర్ధం అయ్యింది, ఇంగ్లీషు నీతి లేని భాష అని. భాషలకు కూడా నీతీ జాతీ ఉంటాయా అనే కదా మీ అనుమానం. అస్సలు "నీతి" అనే పదానికి సమానమైన పదమే ఆంగ్ల భాషలో లేదట!!! ఎప్పుడో 1960లో రాసిన నవల. ఈ రొజుకి కూడా ఆ నవల చదవాల్సిన అవసరం ఉంది. ఆంగ్లం మోజులో పడి మనం ఏ తప్పు చేస్తున్నమో అందులో చమత్కారంగా చెప్పారు విశ్వనాథ వారు. ఆ నవల చదివాక ఎంగ్లీషు (నాకెందుకో ఇంగ్లీషు  కన్నా ఎంగ్లీషే బాగుంది)భాష ఎంత అస్తవ్యస్తమైన భాషో అర్ధం అయ్యింది.  మెమెప్పుడో చిన్నప్పుడు చదివామురా ఆ నవల, అనే వాళ్ళు నన్ను క్షమించాలి. చదవని వాళ్ళుంటే, నా తొక్కలో శీర్షిక చదవక పోయినా పర్వాలేదు, ముందు  వెళ్ళి ఆ నవల చదవండి.

పోయిన నెల, వరసకు మామయ్య అయిన ఒక మామయ్యని కలిశాను. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వెళ్ళి పలకరించి పరిచయం చేసుకున్నా. "ఆ చూస్తున్నా రా, ఎప్పుడూ ఫేస్ బుక్ లో తెలుగులోనే రాస్తుంటావ్, ఏంటి సంగతి? ఇంగ్లీషులో కూడా రాస్తూ ఉండు (నీకు ఇంగ్లీషు వస్తే)" అని అన్నారు. ఆ తర్వాత నేను కూడా చాలా సేపు ఇంగ్లీషులో ఆలొచించా, నేను ఇంగ్లీషులో ఎందుకు రాయకూడదు అని.

ఇలా శీర్షికలు కాకుండా ఎదైనా కవిత, కవితని ఇంగ్లీషులో ఎమంటారో నాకు తెలియదు, అయినా పర్లేదు ఇంగ్లీషులో రాయాల్సిందే  అని నిర్ణయించుకున్నాను. మీరు నమ్మరు, కవితలకు ఆస్కార్ లాంటి పురస్కారాలు ఎమైనా ఉంటే, అవన్నీ ఈ కవితకు ఖచ్చితంగా  వచ్చి తీరుతుంది. ఆ మామయ్య కళ్ళల్లో ఆనందం కోసం ఈ కవితను మీ ముందు ఉంచుతున్నా


In front it's you, in the heart as well as you 
everywhere i see you, i cant forget you 

my heart hardly forgets, even then loving you is the crime,
is the reason for this wound
you wont let this wound heal, nor get out of my heart
time isn't favor for me, death isn't near to me
can't become a mad fellow

i was afraid of dreams, i was away from sleep, disturbed a lot
dreams lasts only seconds, truth is the hell forever
wonder if dream comes true, can truth be a dream
does love has this strength.....




   నేను ఇది ఎలా రాశానో, ఈ పాటికి మీకు అర్ధం అయిపోయి ఉండాలి. అర్ధం కాకపోతే తెలుగులో మార్చి మళ్ళీ ఆలోచించండి, సులభంగా అర్ధం అయిపోతుంది. ఇప్పటికైనా అర్ధం అయితే, నేను ఎలా రాశానో చెప్పండి

Saturday, September 28, 2013

గుంటూరు టమోటాలు

ఎవరైనా గుంటూరు మిర్చి అంటారు, వీడేమో గుంటూరు అంటున్నాడు, టమోటాలు అంటున్నాడేంటా అని అనుమానం కలుగుతున్నది కదూ???  నేను చెప్పబోయేది, తినే టమోటాలు గురించి కాదు, తినిపించే టమోటాల గురించి. పరిచయం ముగించి పాయింటుకొస్తే, మొన్నామధ్య గుంటూరు వెళ్ళాను. ఏ పని మీద వేళ్ళానని అనుమానపడకండి. పని పాట లేకనే వెళ్ళాను.  

వెళ్ళినోడిని ఊరుకుంటే ఏ గొడవా ఉండేది కాదు. సరే కవులకు కూడా ఆకలేస్తుంది కాబట్టి, గుంటూరులో ఎక్కడ తింటే బాగుంటుందా అని అలోచిస్తూ ఉంటే, " అరండల్ పేట్ లో క్రొత్తగా ఒక హోటల్ ప్రారభించారు, వెళ్దాము" అని బావగారు అనటంతో, సరేనని బయలుదేరి వెళ్ళాము. ఆ హోటల్ పేరే "టమోటాలు".

హోటల్ పేరు టమోటాలేంటి అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో "చిల్లీస్" అనే పేరుతో హోటల్ ఉండగా లేనిది, "టమోటా" పేరుతో హోటల్ ఉంటే తప్పా అని నేను ప్రశ్నిస్తున్నాను. చిల్లీస్ ఎక్కువేంటి? టమోటా తక్కువేంటి? అవీ ఎర్రవి , పచ్చవి ఉంటాయి. ఇవి కూడా ఎర్రవి పచ్చవి ఉంటాయి.

పేరులోనే టమోటా ఉన్నదాయే, బయట పేరు కూడా ఎర్రటి అక్షరాలతో "టమోటాలు" అని ఆంగ్లంలో రాసున్నది. రంగు బాగానే ఉన్నది, రుచి, చిక్కదనం ఎలా ఉంటాయో అనుకుంటూ లోపలికి వెళ్ళాము. బల్లలు కూడా ఒకటి ఎరుపు, ఒకటి తెలుపు, మళ్ళీ ఒకటి ఎరుపు ఉన్నాయి. మొన్న వినాయక చవితికి ఈ "టమోటాలు" ప్రారంభించారు అని తెలిసింది. వినాయక చవితి కాబట్టి హోటల్ పేరు "ఉండ్రాళ్ళు" అని పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. వినాయకుల వారి ఆశీస్సులు కూడా విపరీతంగా ఉండేవి. బహుశా కొత్తగా హొటల్ తెరవటం మూలన అనుకుంటా, ఇంకా ఆ సున్నాల వాసన గుభాలిస్తున్నది. క్రొత్తగా ప్రారంభించారు గనుక మనం ఉత్సాహపరచాలి అని సద్భావంతో అక్కడే తినటానికి నిర్ణయించుకున్నాము. 

కాకపోతే చిన్న అనుమానం, "టమోటాలు" అని రాశాడు, మనం తినే పదార్ధాలు అన్నీ ఉంటాయా? లేక కేవలం టమోటా పప్పు, పచ్చడి లాంటివే ఉంటాయా అని. ఆ ఆనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, విషయ సూచిని (మెనూ) తీసుకు వచ్చారు. మేము మంచూరియా చెప్పాము. గోబీ మంచూరియా తీసుకు రమ్మంటే, ముష్టి మంచూరియా తీసుకొచ్చాడు. అది ఎలా ఉందో చెప్పటం కుదరదు, తినాల్సిందే. గోబీతో కొడితే గూబ గుయ్యమనేట్టు చేశాడు. అదేంటి అని అడిగితే, గోబీ మంచూరియా ఇలానే ఉంటుందని చెప్పాడు!!

అక్కడితో ఆపేసి వెళ్ళిపోదాం అనుకన్నప్పటికీ, పూర్తిగా తిని చూస్తే తప్ప ఇంకో సారి రావాలో లేదో నిర్ణయించుకొవచ్చు అనుకొని అక్కడే తినేశాము. ఏమేమి తిన్నామనేది మాత్రం చెప్పను. దిష్టి తగిలితే ఎవడు రెస్పాన్సిబుల్?? మొత్తానికి పర్వాలేదనిపించాడు. ఇక్కడే కధలో కీలక ట్విస్టు. ఇంత తక్కువ స్థలంలో పెట్టారేంటో అనుకుంటుండగా ఒక వార్త తెలిసింది. సదరు టమోటాలు ప్రారంభించిన చోట, ఇది వరకు ఒక సాఫ్ట్ వేర్ కంపేనీ అద్దెకు ఉండేదని. అది నష్టాలతో మూసివేయటంతో, సాఫ్ట్ వేర్ కి బదులుగా టమోటాలు కాశాయి అని. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టమోటాలు ఒకసారి రుచి చూడండి


Thursday, September 19, 2013

చవితి పందిరి

పైన శీర్షిక పేరు చదవగానే అర్ధం అయ్యి ఉంటుంది, ఇవాళ నేను దేనిని ఖండించబోతున్నానో. చిన్నప్పుడు ఊర్లో వినాయక చవితి పందిర్లు వేసేవారు. ఆ పందిర్ల దగ్గర పాటల పోటీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. దేవుడి దయ వల్ల, కొన్ని చోట్ల డాన్సు బేబీ డాన్సు లాంటివి కూడా జరిగేవి. వినాయకుని పందిరి అని చెప్పి పద్దతిగా, ఒక అన్నమాచార్య కీర్తనను ఆరున్నర శృతిలో(ఏంటో ఈ పేరు లేకుండా శీర్షిక పూర్తి అవ్వటం లేదు) సాధన చేసి పోటీలకు వెళ్ళేవాడిని. తీరా పోటీలో అన్నమాచార్య కీర్తనలకన్నా "ఆకలేస్తే అన్నం పెట్టే" పాటలకే బహుమతులు వచ్చేవి.

కట్ చేస్తే, నేను అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్లో కూడా వినాయకుని ప్రతిష్ట జరిగింది. పాతికిళ్ళు ఉండే అపార్ట్మెంటుకు ముగ్గురితో కూడిన ఒక "వినాయక చవితి కమిటీ" ఏర్పాటు చేశారు. ముందుగా అందరి దగ్గర చందాలు పోగు చేసి, ఒక వినాయక విగ్రహాన్ని తీసుకు వచ్చారు (మట్టి విగ్రహం తేవటం కొంచెం సంతోషకరమైన విషయం). రోజుకో అంతస్తు చొప్పున ఐదు రోజులు పూజలు చేయాలని వాటాలేసుకున్నారు. మొదటి రోజు అంతా ప్రశాంతంగానే జరిగింది.

రెండో రోజు ఉదయాన్నే ఆఫీసుకని బయలుదేరి అపార్ట్మెంట్ బయటకి వచ్చాను. "అంతా రామ మయం .." అని పాట వినపడింది. పందిరి అన్నాక ఆమాత్రం పాటలు ఉండాలిలే అనుకునే లోపు, ఆ పాట అయిపోయి, ఆ తరువాత పాట మొదలైంది. వినాయకుడు తొండంతో చెవులు మూసుకున్నాడు. "చాలు చాలు చాలు, సరసాలు చాలు చాలు" అనే పాట పొద్దునే మొదలయ్యింది. వాచ్ మెన్ "శ్రీ రామదాసు" పాటల క్యాసెట్టు పెట్టేసి ఎటో పోయాడు. ఆ పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కొని పాటలు ఆపే సరికి, దాదాపు ఆ పాట పూర్తి అయ్యింది. దానితో వినాయకుడు శాంతించి, "నీకు నీలాపనిందలు మాత్రమే కాదు, తప్పు చేసినా నిందలు ఉండవు" అని వరమిచ్చాడు.

ఒక్కో రోజు రెండు మూడు రకాల ప్రసాదాలు పెట్టారు. మొదటి రోజున "వెజిటబుల్ బిర్యానీ" చంపేశారు. రెండో రోజు "చక్కెర పొంగలి", "సమోసా" ఉన్నాయి అని చెప్పటంతో ఆరున్నరకల్లా వెళ్లి కూర్చున్నాను. ఏడున్నర కల్లా పంతులుగారు పంచ విదిలించి ప్యాకప్ చెప్పేశారు. అందరూ ప్రసాదాలకు పరుగులు పెట్టారు. ఇక్కడే కధలో కీలక ట్విస్టు. ఇవాళ ఒక అరగంట పాటు సంగీత విభావరి అని కమిటీ వారు చెప్పటంతో నిరాశ చెందారు. పక్కనే ఉన్న సంగీత పాఠశాల నుండి ఒక బృందము వచ్చింది. అమ్మాయిలు అందంగా చీరలు కట్టి, ముఖమంతా మేకప్ కొట్టి పాడటం మొదలు పెట్టారు. ఆపార్ట్మెంట్లో ఒక పెద్ద మనిషి వచ్చి, ప్రసాదాలు కానిస్తే, తింటూ పాటలు వినచ్చు కదా అని ఉచిత సలహా ఒకటి విసిరేశారు. కమిటీ వారు కుదరదన్నారు.

పాటలు మొదలయ్యాయి. మైక్ పని చేయటం ఆగిపోయింది. వాళ్ళు పాడుతున్న పాటలకన్నా వాళ్ళ చేతులతో వేసే తాళం శబ్దం ఎక్కువ వినపడింది. దానితో ఆడవాళ్ళంతా వాళ్ళల్లో వాళ్ళు, సీరియళ్ళ గురించి, చీరల గురించి, మగవాళ్ళు సీమంధ్ర సమ్మె గురించి, డాలరు విలువ గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. నేను మాత్రం ఆ పాడే వాళ్ళకు దగ్గరగా కూర్చొని పాటలు వినే ప్రయత్నం చేశాను (నిజం నమ్మండి). నేను వింటున్నాని, వాళ్ళు హిందీ పాటలోకి దిగారు. ఆ దెబ్బకు "సింధూరం" సినిమా చూశాక త్రివిక్రమ్ గారు (4:00 దగ్గర నుండి వీడియో చూడండి) నడిచినట్టు, నేను కూడా రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చేశాను.

ఇంత జరుగుతున్నా అపార్ట్మెంట్ లో చిన్న పిల్లలు మాత్రం శ్రద్దగా పాటలు విన్నారు. ఆహా ఎంత మంచి పిల్లలు, శ్రద్దగా వింటున్నారు అనుకున్నా . కానీ ఆ శ్రద్ద వెనక ఒక మతలబు ఉందని అర్ధం కాలేదు. ఆ పాటల వాళ్ళు ముగించిన రెండు క్షణాలకు ఆ పిల్ల గుంపంతామైక్ మీద పడి, ఇష్టం వచ్చినట్లు కేకలు వేశారు. అర్ధం కాని కొత్త తెలుగు సినిమా పాటలన్నీ వినాయకునికి విన్నవించారు. వినాయకుడు విని తరించాడు.  ఇక నిమజ్జనం గురించి, ప్రసాదం అందలేదని ఏడ్చే వాళ్ళ గురించి, మా డబ్బులకు లెక్క చెప్పమనే వాళ్ళ గురించి రాయాలంటే ఈ శీర్షిక, నా ఓపిక సరిపోవు. ఇంకో శీర్షికలో దాని గురించి తప్పక ఖండిస్తా. అంతవరకూ .....



Saturday, August 17, 2013

విశ్వనాధం 2 (శృతి నీవు గతి నీవు)

శృతి నీవు గతి నీవు..... మళ్ళీ మొదలెట్టాడు రా బాబోయి అనుకోకండి. ఈ శృతి పుస్తకంలో శృతి కాదు. విశ్వనాథ్ గారి గురించి మనకు తెలిసిందే కదా...., ఏది ఒక పట్టానా ఒప్పుకోడు... ఏదో సినిమాలో వినట్టున్నది కదూ... సరే నేరుగా అస్సలు విషయానికి వచ్చేద్దాము. గత శీర్షికల్లో సాగర సంగమం గురించి ప్రస్తావించాను. ఆ సినిమా నృత్యాన్ని ఇతివృత్తముగా వచ్చిన సినిమా అయితే విశ్వనాథ్ గారు సంగీతాన్ని ఇతివృత్తముగా తీసిన మరొక గొప్ప సినిమా "స్వాతి కిరణం". ఆ మాటకొస్తే ఆయన తీసినవన్నీ గొప్ప సినిమాలే కదా!!

చినప్పుడే ఈ సినిమాను చూసినట్టు నాకు చాలా బలంగా గుర్తుంది. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నానంటే నా జ్ఞాపక శక్తి మీద నాకున్న నమ్మకం కాదు. ఆ సినిమాలో మమ్ముట్టి గారి పేరు, నా పేరు అచ్చు తేడా లేకుండా ఒకటే గనుక . " ఆ అయితే ఏంటి?? " అని మీరు విసుక్కోవటంలో అస్సలు తప్పు లేదు. " సురేష్, నరేష్, వంశీ, శశీ,  వినయ్, అజయ్, విష్ణు, వేణు, రాము, రాజు " ఇలాంటి పేర్లు చాలా సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. అంతెందుకు నా తరగతిలో, ఉన్న 60 మందిలో ఇద్దరు రాజేషులు, ముగ్గురు 'కోటీ'లుఉండేవారు. (అరడజను మంది అనుషాలు కూడా ఉన్నారనుకోండి అది వేరే విషయం). మరి నా లాంటి అరుదైన పేర్లు గల వ్యక్తులు కూడా అరుదుగానే ఉంటారు. చాలా మందికి నా పేరు మొదటి సారి అర్ధం గాక రెండో సారి అడుగుతుంటారు. అలాంటిది నా పేరు ఇంకో మనిషికి కూడా ఉంది (అందులోనూ సినిమాలో పాత్రకి) అని తెలిసే సరికి, ఆ సినిమా వచ్చినపుడల్లా తప్పక చూసే వాడిని. కాకపొతే పూర్తి సినిమా చూసే అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదు (ఎప్పుడూ ఇవ్వలేదు).

నా సోది ఆపి సినిమాలోకి వస్తే, ఆ కధ అంతా మనకు తెలిసిందే. మనిషి 'అహం' వల్ల ఎంత దెబ్బ తింటాడో చూపించారు విశ్వనాథ్ గారు. నా పేరు పాత్రకి, అందునా పద్మశ్రీ ని సైతం నిరాకరించే పాత్రకి పెట్టారని ఆనందపడ్డా, కాని అది అభావార్ధక పాత్రకి (అర్ధం కాలేదు కదూ, నెగటివ్ క్యారెక్టర్ కి తెలుగు అర్ధం) పెట్టారని తెలిసి బాధ పడ్డాను. ఆ సినిమాలో మమ్ముట్టి, రాదిక గార్ల నటన గురించి చెప్పేదేముంది? ఇక ఆ కుర్రవాడు (అప్పట్లో) మంజునాథ్ కూడా  వారిరువురికి పోటీగా చేసాడు (విశ్వనాథ్ గారు చేయించారు). మొన్నీ మధ్యన ఏమైపోయాడా అనుకున్న ఈ కుర్రాడిని  మన టివి 9 వాళ్ళు వెతికి పట్టుకున్నారు కూడాను. 

ఇక సినిమా గురించి ముఖ్యంగా గుర్తొచ్చేది మామ మహదేవన్ గారి సంగీతం. తమన్న్ అంత గొప్పగా కాకపోయినా ఏదో బాగానే పాటలు స్వర పరిచారు.  వాణీ జయరామ్ గారికి జాతీయ ఉత్తమ గాయని పురస్కారం ఈ సినిమాలో పాడిన పాటకు దక్కింది. కాకపోతే నంది మాత్రం ఈ సినిమాకు దక్కలేదు (బహుశా అదే సంవత్సరం ఇంకా మంచి సినిమాలు వచ్చాయేమో, నేను చిన్నపిల్లాడిని కదా అప్పట్లో, అందుకని గుర్తులేదు). 

ఆ తరువాత చెప్పుకోవాల్సింది పాటల్లో సాహిత్యం. ఈ పాటల్లో వెన్నెల ఉన్నది, సుందరమూ ఉన్నది. కానీ నాకు అన్నింటికంటే ఎక్కువ నచ్చిన పాట, నారాయణ రెడ్డి గారు రాసిన "శృతి నీవు గతి నీవు" (శృతి అన్న పేరు ఉన్నందుకు కాదు). సినారె గారి గొప్పతనం, సరళమైన పదాలతో కూడా అద్భుతంగా రాస్తారు. అందుకు ఈ పాటే చక్కని ఉదాహరణ. మొదటి చరణంలో 

"నీ పదములొత్తిన పదము, ఈ పదము నిత్య కైవల్య పధము" 

నా కవి హృదయానికి తోచినంతలో పై వాఖ్యంలో మొదటి సారి వాడిని "పదము" అంటే అమ్మవారి కాలి పాదము, రెండో పదము అంటే పదాలు అని. అర్ధం కాలేదు కదా!! "తల్లీ! నీ పాదాలను నా పదాలతో పూజిస్తే, అదే మాకు మోక్ష ద్వారము" అని. ఇలా పాటంతా చాలా బాగుంటుంది. ముఖ్యంగా రెండో చరణం చివర్లో 

"నీ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవతారక మంత్రాక్షరం"

అని చాలా చక్కగా ముగించారు.  ఇంత జ్ఞానము ఉంది కాబట్టే రెడ్డిగారికి జ్ఞాన పీఠం దక్కింది. మంచి వంకాయలు, ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ ఉండగానే మంచి గుత్తి వంకాయ కూర అవ్వదు. "ఎలా వండాలో, ఏవేవి ఎంతెంత వేయాలో తెలిసిన వంట వాడు ఉంటేనే మంచి కూర అవుతుంది. మనం కుడా లొట్టలేసుకొని తినచ్చు. సినిమాకి దర్శకుడు కుడా అలాంటివాడే (పోలిక బాగోలేక పోయినా సర్దుకోండి). ఇన్ని మంచి వాటిని కలిపి సినిమాగా మనకు అందించిన విశ్వనాథ్ గారికి మరొక్క సారి ధన్యవాదాలు తెలియజేస్తూ.... సెలవు...

( ఏదో సరదాకి రాశాను, తప్పులుంటే తెలియజేయిండి) 

Monday, July 15, 2013

ముఖం పుస్తకం 2

ముఖం పుస్తకం గురించి కొన్ని ముచ్చట్లు ఇది వరకు ఒక శీర్షికలో రాశాను, మరి కొన్ని ముచ్చట్లు ఈ శీర్షికలో ......

ముఖం పుస్తకం అనగానే ముందుగా మనకు ముఖ్యమైనది ముఖ చిత్రం.  ఇటీవల ముఖం పుస్తకంలో, అమ్మాయిలు ముఖం పుస్తకంలో వాడే ముఖ చిత్రాల మీద ఒక హాస్యభరితమైన చిత్రాన్ని చూశాను. దానిని చూసిన తరువాత నాకెందుకో దీని మీద ఒక టపా రాయాలనిపించింది. ఇప్పుడు ఆ ముఖ చిత్రాల గురించి కాసేపు ఏడుద్దాము.

ముందుగా మనిషి జీవితంలో పలు దశలు ఉన్నాయి. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృదాప్యం అని చినప్పుడు చదువుకున్నాము. అలానే ముఖం పుస్తకంలో కూడా వివిధ దశలు ఉన్నాయనమాట. అవేమిటో ఒకొక్కటి చూద్దాము.

బిటెక్ బాబులు : దాదాపు కాలేజీ కుర్రోళ్ళు అంతా సామాజిక న్యాయం కోసం తెగ పోరాడుతుంటారు. కాబట్టి వీళ్ళ ముఖ చిత్రం దాదాపు, వీళ్ళ సామాజిక వర్గ అగ్ర కధానాయికుడి చిత్రమే ఉంటుంది. ఇంజనీరింగు అయ్యి ఉద్యోగం వచ్చే దాక, బాబు చిత్రమే ఉంటుంది. ఉద్యోగం వచ్చాక కూడా చిత్రం మార్చలేదంటే, కుర్రాడికి ఇంకా కుర్ర తనం పోలేదని అర్ధం చేసుకోవాలి. ఇంకొంతమంది దేశ భక్తులు, తమ సామాజిక వర్గ రాజకీయ నాయకుడి చిత్రం పెట్టుకుంటారు. దేశ భక్తులు అని ఎందుకు అన్నానంటే, వీళ్ళకి దేశ భక్తీ మిక్కిలి ఎక్కువ. వాళ్ళ నాయకుడు పదవిలోకి వస్తే దేశం విపరీతంగా బాగు పడుతుందని బలంగా నమ్ముతారు గనుక వీళ్ళని దేశ భక్తులు అనటంలో తప్పే లేదు.

సాఫ్టోళ్ళు : అంటే నా బోటి వాళ్ళు అనమాట!! కెమేరా  దొరికితే చాలు, కళ్ళజోడు పెట్టి ఒక చిత్రం, తీసి ఇంకో చిత్రం, నిలుచొని ఒకటి, కూలబడి ఒకటి ఇలా రక రకాల భంగిమలలో ముఖ చిత్రాలు మారుస్తుంటారు. కొత్తగా ఉద్యోగం వచ్చాక, కొత్తాఫీసులో దిగిన చిత్రాలు పెడతారు. ముఖ్యంగా పైన అమ్మాయిలతో కలిసి దిగిన చిత్రాలు మాత్రం మర్చిపోకుండా ప్రచురిస్తారు. ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా, తప్పక చిత్రాలు దిగి, ముఖం పుస్తకంలోకి ఎగుమతి చేస్తారు. విదేశాలకు వెళ్తే ఆ సంగతి చెప్పనక్కరలేదు. అక్కడ పిచ్చి మొక్కల ప్రక్కన నిలబడి దిగినా బాగానే ఉంటుంది.

పెళ్లి కుమారులు / కొత్తగా పెళ్లి అయినోళ్ళు :  వీళ్ళ గురించి ఎక్కువ చెప్పినా బాగుండదు.  పెళ్లి చిత్రాలు పదే పదే మార్చి పెడుతుంటారు. కొందరైతే వాళ్ళ ప్రేమానురాగాలను ముఖం పుస్తకంలో చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ అన్యోనతను చూసి ఒక్కోసారి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది కూడానూ. అప్పుడప్పుడు వైవాహిక జీవితం గురించి గొప్ప గొప్ప సామెతలన్నీ ప్రచురిస్తుంటారు.

పిల్లల తండ్రులు : పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టాక, కొన్ని రోజుల వరకు పిల్లల ఫొటోలు పెడతారు (అమ్మాయిలు చో చ్వీట్ అని వ్యాఖ్యలు రాయటం గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకోండి), మా అనిల్ అన్న దానికి ఇటీవల ఉదాహారణ. 

ఆ తరువాత : నాకు తెలిసి ఆ తరువాత ముఖం తుడుచుకొనే అంత ఖాళీ ఉండదు, ఇంకా  ముఖం పుస్తకం చూసేంత ఖాళీ ఎక్కడ ఉంటుంది??

గూడాచారులు : ప్రతి దానికి మినహాయింపు ఉన్నట్టు, ఇక్కడ కూడా మినహాయింపు బాపతు ఉన్నారు. ముఖం పుస్తకంలో ఉంటారు, కానీ ఫొటో పెట్టటానికి మాత్రం ఎందుకో భయపడుతుంటారు. ఒక్క లైక్ ఉండదు, ఒక్క షేర్ ఉండదు. కానీ జరిగేదంతా గమనిస్తూనే ఉంటారు. 

నేను గమనించినంతలో క్లుప్తంగా చెప్పాను. ఇవన్నీ ప్రక్కన పెడితే, ముఖం పుస్తకంలో ప్రచురించే వాటిల్లో భలే తమాషాలు ఉంటాయి. దాని మీద ఏకంగా ఇంకో శీర్షిక రాయచ్చు. ఉదాహరణకు మొన్న ఒక చిత్రం చూశాను. ఆంగ్లంలోఎధాతదంగా మీ కోసం, "I fear the day that technology will surpass our human interaction. The world will have a generation of idiots" అని ఐన్ స్టీన్ చెప్పారంట!!! ఆ పెద్ద మనిషి చెప్పింది నిజమే. మనుషుల మధ్య టెక్నాలజీ వల్ల దూరం పెరిగింది అని, మరి ఆ పోస్టు ప్రచురించిన వాడు చేసే పని కూడా అదే కదా!! 24 గంటలు ముఖం పుస్తకంలో ముఖం పెట్టి కూర్చున్నది కాక, మళ్ళీ ఐన్ స్టీన్ ఏదో అన్నాడని తెగ భాద పడిపోవటం దేనికి. ఆ విషయం తెలిసినప్పుడు, ముఖం పుస్తకం మూసుకొని నిద్రపోవచ్చు కదా !!!

Friday, June 28, 2013

తెలుగు పద్యమా? నా తలకాయా?

చిన్నప్పుడు పద్యం నేర్చుకోవటం అనేది చాలా చిరాకుగా ఉండేది. ఉన్న నాలుగు పాదాలని, నలభై సార్లు, అప్పటికీ కంఠస్తము కాకపోతే నాలుగు వందల సార్లు చదివి మరీ పిడి వేయాల్సి వచ్చేది. కొన్ని పద్యాలు ఇట్టే వచ్చేసేవి, కొన్ని ఆట్టే ఇబ్బంది పెట్టేవి. వేమన శతకం, సుమతీ శతకం, సుభాషిత రత్నాలు, ఇప్పుడు గుర్తు లేవు కానీ, అప్పట్లో బాగానే చదవాల్సి వచ్చింది.

అందరూ లెక్కల్లో వందకు వంద మార్కులు రావాలి, లెక్కలు వస్తేనే ఇంజనీర్ అవ్వగలం అని ఒకటికి పది సార్లు చెప్పే వారు. బడిలో చెప్పింది చాలక, ఇంటికి వచ్చాక సాయంత్రం పూట, ఇంకో గంట, కుదిరితే రెండు గంటలు మళ్ళీ లెక్కలు చెప్పించేవారు. అంతెందుకు, మీ జీవితం మొత్తంలో ఎంసెట్ ర్యాంకు ఎంతా? అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ, ఎప్పుడైనా, ఎవ్వరైనా (తల్లి తండ్రులతో సహా), తెలుగులో ఎన్ని మార్కులు అని ఎప్పుడైనా అడిగారా? (నన్ను మాత్రం ఎవ్వరూ అడగలేదు)

ఇప్పుడు నాకో సంగతి గుర్తుకు వస్తున్నది. ఎనిమిదో తరగతిలో అనుకుంటా, ఒక ప్రక్క మా తెలుగు పంతులుగారు, కీ.శే. పాండు రంగారావు గారు, పాఠం చదువుతూ, నోట్స్ రాసుకోమని చెప్పారు. అంతా గురువుగారు చెప్పింది రాసుకుంటూ ఉంటే, నా స్నేహితుడు అజయ్, నేను, చెప్పింది రాయకుండా, "ఆంగ్ల పద వినోదం" ఆడుతూ కూర్చున్నాము. కాసేపటికే ఇద్దరం గురువుగారికి దొరికిపోయాము. "ఆంగ్ల పద వినోదం", అందునా తెలుగు తరగతిలో, మాస్టారుకి మండి పోయింది. ఇద్దరినీ ఇరగదీసి వదిలిపెట్టారు. 
 
ఆ తరువాత తరువాత, పద్యం అంటే ఇష్టం, పద్యం నేర్చుకోవాలి అన్న ఆతృత పెరిగాయి. క్లిష్ట సమాసాలలో ఉండే పద్యాలను గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే గొప్పగా ఉండేది. ఆ తరువాత గురువుగారు గణ విభజన చక్కగా నేర్పించారు. ఏదో రావాల్సిన మార్కుల కోసం చదివకుండా, సరదాగా చదవటంతో, ఎంతో కొంత ఇప్పటికీ గుర్తుంది. అస్సలు ఒక పద్యంలోని పాదానికి గణ విభజన చేసి, ఆ పద్యం ఏ చందస్సులో ఉందో తెలుసుకోవటమే గగనం అయ్యేది. అలాంటిది స్వంతంగా ఒక పద్యం రాయటం అంటే మాటలా? పద్యం రాయటమే అనుకుంటే, అవధానాలలో అప్పటికప్పుడు పద్యం చెప్పటమంటే......

యుట్యూబ్లో అవధానం చూస్తుంటే, అందులో చెప్పిన పద్యం అర్ధం చేసుకోవటానికే  అరగంట పట్టింది. అలాంటిది ఆశువుగా అర నిముషంలో అవధానులవారు పద్యం చెప్తుంటే, ఆశ్చర్యమేసింది. అలా చెప్పాలంటే ఎంత ధారణ కావాలి? ఎంత నేర్పు కావాలి? జావా ఏముంది, కుక్కని అమీర్ పెట్ లో అప్పగిస్తే, నాలుగు నెలల్లో నేర్పుతారు. అదే మనకు(నాకు) సరిగ్గా రావటం లేదు, ఇంక తెలుగేమి వస్తుంది, నా తలకాయి. నా లాంటి కోతులు కుక్క, ముక్క, చెక్క, రెక్క అని ప్రాసతో నాలుగు ముక్కలు రాసేసుకొని, మాకు మేమే అదేదో గొప్ప కవిత్వము అనుకొని మురిసి పోతుంటాము (ఇది ఎవ్వరినీ ఉద్దేశించి అన్న మాటలు కావు, కేవలం నా అభిప్రాయం మాత్రమే). 

ఇంకొన్ని రోజులు పోతే గొడవే ఉండదు. తెలుగు వచ్చిన వాడే ఉండడు., ఇంక అవధానం చేసే వారు ఉన్నా అది అర్ధం చేసుకునే వాళ్ళు అస్సలే ఉండరు. పొరపాటున ఎవరితో అయినా 'అవధానం' అని అంటే, "అవయవ దానమా? చచ్చాక చేస్తాములే పో" అని అంటారేమో. చాదస్తం అంటే అనండి కానీ, నాకు మళ్ళీ చందస్సు పూర్తిగా నేర్చుకోవాలని ఉంది. మొన్న మా పిన్నిగారి అమ్మాయికి ఛందస్సు నేర్పే భారాన్ని నా భుజాలపై వేశారు. నాకు వచ్చిందేదో, తనకు ఎక్కించటానికి ప్రయత్నించాను. ఖర్మ ఏంటంటే తెలుగు ఛందస్సుని ఆంగ్ల పదాలతో నేర్పాల్సి రావటం. తప్పు పిల్లలది కాదు. చక్కగా చెప్పేవాళ్ళు ఉంటే, ఆనందంగా నేర్చుకుంటారు. 

"శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు" అంటారు, అదేంటో నా పేరులో అనంతం అయితే ఉంది కానీ, నాకున్న దరిద్రాలకి ఒక్క ఉపాయం కూడా తట్టటంలేదు, క్షణం తీరిక దొరకటం లేదు. ఎలాగోలా మొదలు పెట్టాలి. నాకు నేర్పించాలి అని ఎవ్వరికైనా అనిపిస్తే నేర్పించగలరు. లేదు, ఇలా నేర్చుకోవచ్చు అని సలహాలు ఏమైనా ఉంటే తప్పక ఇవ్వగలరు. చచ్చే లోపు ఒక్క తెలుగు పద్యం రాయాలి అని బతుకుతూ........  సెలవు 

Tuesday, May 21, 2013

హైక్ రాదని, అప్రైసల్ లేదని

ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేలోపు, కనీసం ఒక్క పాట అయినా వినని వారు ఉండరనుకుంటా!!! పాట... ప్రతి గుండెనీ కదిలించగల శక్తి పాటకు ఉన్నది. అది ఆనందం అయినా, విషాదం అయినా, వికారం అయినా, మన కలలు సాకారమైనా.., ప్రతి దానికి ఓ పాట, ఆ మాటకొస్తే ఒక్కో సందర్భానికి చాలా పాటలే పాడుకోవచ్చు. పాడుకున్నోడికి పాడుకున్నంత.  

నాకు తెలిసినంతలో ఇప్పుడు మన సాఫ్టోళ్ళందరికీ అప్రైసల్ సమయం. సంవత్సరం అంతా నానా చాకిరీ చేసేది, పై అదికారుల దగ్గర వినయంగా నటించేది ఈ అప్రైసల్ కోసమే. మనిషికి సంతృప్తి అనేది ఉండదు కాబట్టి, అప్రైసల్ లో ఏమి జరిగినా ఏడుపు ముఖం మాత్రం ఖాయం. కానీ సంవత్సరం పొడుగునా, అంతలా ప్రేమించిన అప్రైసల్ దొరక్కపోతే ఏ పాట వినాలి? ఏ పాట పాడుకోవాలి అని అలోచించే వాళ్ళకి, నేను సమర్దించే పాట ఒకటి ఉన్నది. ఆ పాట వింటూ మనసారా ఏడవండి. 

అప్రైసల్ని మీ ప్రేమ అనుకొని, మేనేజరు ప్రేయసి అనుకుని ఈ పాట వినండి. ఆ భావనతో మీరు ఆ పాటను వింటే, ప్రతి పదానికి ఏడవటం మాత్రం ఖాయం...  

"ప్రేమ లేదని, ప్రేమించ రాదనీ, సాక్ష్యమే నీవనీ, నన్ను నేడు చాటనీ... ఓ ప్రియా జోహారులూ ...... "

ఈ పాట అంటే నాకు ప్రాణం. ఎన్ని వందల సార్లు విని ఉంటానో. ఎంత వద్దు అనుకున్నా, ఈ పాటని మార్చి రాయకుండా ఉండలేక పోయాను. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండి, అప్రైసల్ రాక అల్లాడుతున్న వాళ్ళందరికీ ఈ పాటని అంకితం చేస్తున్నాను. మిగిలిన వాళ్ళు అస్సలు ఇంక చదవకపోవటమే మంచిది. ఈ పాటను కూనీ చెయాల్సి వచ్చినందుకు భాద పడుతూ ., ఆచార్య ఆత్రేయ గారికి క్షమాపణలు చెప్పుకుంటూ.... 

 హైక్ రాదని, అప్రైసల్ లేదని.., సాక్ష్యమే నేనని ..,నువ్వు నేడు చాటనీ... ఓ సారూ... జోహారులూ  --- (2)

చరణం:

జీతం పెంచక పోతే పనికింక రానని,
కూలి వానికైనా కొంత హైకుందని,
ధరల మంట అంటుకుంటె ఆరిపోదని,
జీతం పెంచితే నీసొమ్మేం పోదని
ఉసురు తీసి నట్టుగా నీవుంటివీ
ఎదుగు బొదుగు లేనె లేక నేనుంటిని.....

చరణం:

ఒళ్ళు మరచిపోయి పని చేయాలని 
చేయ లేకపోతే మానేయాలని
తెలిసి కూడ మానలేని సాఫ్టు వేరుని 
గుండె పగిలి పోవు వరకు నన్ను పాడని 
ఎందుకూ సరిపోనీ జీతాలతో, నెల నెలా, విల విలా రోధించని ...

Saturday, May 11, 2013

గుండె జారి గల్లంతయ్యిందే

నిజ జీవితంలో జనాలను ప్రేరణగా తీసుకొని సినిమాలు తీస్తారా? లేక, సినిమాలు చూసి జనాలు తమకు ఆ పాత్రలను అన్వయించుకొని, ప్రవర్తిస్తూ ఉంటారా? ఇలాంటి అనుమానం వల్లనే అనుకుంటా, అంతా నన్ను "శృతి ఎవరు?" అని అడుగుతున్నారు.  అప్పటికీ నాకు తెల్సిన అమ్మాయిలందరి పేర్లు గుర్తుకు తెచ్చుకొని, ఎవరూ లేరని నిర్దారించుకున్నాకనే 'శృతి' అనే పేరు పెట్టాను. నా సంగతి కాసేపు పక్కన పెడదాము.

మొన్న "గుండె జారి గల్లంతయ్యిందే" అనే సినిమాకి వెళ్లాను. నిత్యతో కలిశాక నితిన్ సుడి తిరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే!! అదేంటో ఈ మధ్య శృతి అనే పేరు ఎక్కువ వినిపిస్తున్నది (బహుశా నేనే ఎక్కువ పట్టించుకుంటున్నాను కాబోలు). ఈ సినిమాలో రెండో కధానాయిక పేరు కూడా శృతే. నా నవలలో లాగే అందులో కూడా నితిన్ బాబుని నీకు పెళ్లి అయ్యిందా అని అడిగితే "ఒక్కసారి కూడా కాలేదు!!" అని అన్నాడు.

సరే ఇక సినిమా కూడా బాగానే ఉన్నది (అసభ్యకరంగా తీసిన సన్నివేశాలు తప్పించి), అది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో కూడా బీపులు బాగా వాడారు. అక్కడ బీపు ఎందుకు వేశాడో అని నా మిత్రుడు ఒకడు అదే పని మీద విశ్లేషించి, గుర్తొచ్చిన బూతులన్నీ, ఆ బీపుల స్థానంలో ఊహించేసుకున్నాడు. ఇక అస్సలు విషయానికి వస్తే, సినిమాలోని పాత్రలను చూస్తే ఒక్కోసారి మన స్నేహితులో, దగ్గరి భందువులో  అందులో స్పష్టంగా కనపడుతుంటారు (అలానే కదా నన్ను నాగ చైతన్య అని అనేది). అలా మీకు ఎప్పుడైనా అనిపిస్తే ఒకసారి అలాంటి పాత్రలన్నింటినీ గుర్తుకు తెచ్చుకోండి.

నాకు ఈ చిత్రంలో నిత్యని చూస్తున్నంత సేపు, నా స్నేహితురాలు ఒకమ్మాయి గుర్తుకు రావటంతో నవ్వుకోలేక చచ్చానంటే నమ్మండి. ముఖ్యంగా రెండో భాగంలో, నితిన్ పై అధికారిగా ఉన్న నిత్య పాత్ర చూస్తున్నంత సేపు నేను ఆమెనే ఊహించుకున్నాను. ఆ గడుసుతనం, ఆ తెగింపు, ఆ తిక్క, ఆ రింగుల జుత్తు అన్నీనూ..... అచ్చు గుద్దినట్టు... ఆమె లాగే ఉన్నది. ఏమో ఆ సినిమా దర్శకుడు బహుశా ఆ స్నేహితురాలిని ఎప్పుడైనా కలిశాడేమో అని, తనను అడిగి చూశాను. "కొంపతీసి నన్ను హీరోయిన్ గా పెట్టి కొత్త కధ ఏమైనా రాస్తున్నావా ఏంటి?" అని అడిగింది.అంతా బాగానే ఉంది కానీ, ఈ చూసుకోకుండా ప్రేమించుకోవటం అనేదే ఎక్కటం లేదు. అన్నీ చూసి ప్రేమించుకుంటేనే, అర్ధం కాక అల్లాడి చస్తున్నారు.


Saturday, April 27, 2013

'శృతి, శృతి, శృతి'

 మొత్తానికి రామ్@శృతి.కామ్  ఇప్పటి వరకు అయితే అందరూ 'బాగుంది' అంటున్నారు.  వచ్చిన సమస్యల్లా, "అది నీ కధే కదా?" అని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తే, " ఎవరు రా ఆ శృతి? మాకు ఎప్పుడూ చెప్పలేదు?" కొంతమంది నిలదీశారు. మొదట ఇలాంటి వాటికి చిరునవ్వే సమాధానం అనుకున్నాను. కానీ ఖండించక పొతే ఖాయం చేసుకునే ప్రమాదం ఉందనిపించింది. అందుకే ఈ శీర్షికాభిముఖంగా ఖండిస్తున్నాను. అందులో నా పేరు, ఊరు తప్ప మిగితాదంతా కేవలం కల్పితం మాత్రమే అని ఏది గుద్ది అయినా చెప్పగలను.

ఒక వేళ నేను రాసినది అంతా కాసేపు, నా కధనే అనుకుందాము. అలాంటప్పుడు నాకు కధలు రాసే ఓపిక, తీరిక ఎక్కడ ఉంటుంది చెప్పండి? అస్సలు అమ్మాయి (లు) అంతలా ఇష్టపడే అంత దృశ్యం నాకు లేదు. 

ఇంక 'శృతి' విషయానికి వద్దాం. నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో, 'పోకిరి' చిత్రం  విడుదల అయినప్పుడు చాలా సార్లు చూశాను. అప్పుడు బాగానే నచ్చింది. బహుశా ఆ చిత్రం నుంచే మొదలు అనుకుంటా, మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల మనోభావాలు దెబ్బ తినే విదంగా చూపించటం. అందులో బ్రహ్మానందాన్ని మా మనోభావాలు దెబ్బ తినే విదంగా చూపించారని,  నాకు ఉద్యోగం వచ్చాక కానీ అర్ధం కాలేదు. 

అందులో బ్రహ్మానందం, ఇలియానా వెంట 'శృతి, శృతి, శృతి' అని వెంట పడితే నవ్వని వారు లేరు. అలాంటి పరాభవానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాను. అందుకే నా కధలో అమ్మాయికి శృతి అని పేరు పెట్టాను. నేను కధ రాస్తూ వేరెవరో కధానాయకుడిగా ఎందుకు అని నా పేరే పెడితే, ఈ పాడు ప్రపంచం నన్నే అనుమానిస్తుందా? 

పుస్తకం రాయటం అయితే రాయగలిగాను కానీ, దానిని పాఠకుల దగ్గరకి మాత్రం ఎలా తీసుకువెళ్ళాలి అనేది పెద్ద సమస్య అయిపొయింది. అందుకని చివరగా చెప్పొచ్చేది ఏంటంటే? మీరు చదివితే, మీ స్నేహితులకి ముఖం పుస్తకం ద్వారా చదవమని చెప్పండి. మీరు చదవకపోతే, ముందు చదివి తర్వాత మీ స్నేహితులకి చెప్పండి. ఈ క్రింది లింక్ కి వెళ్లి  రామ్@శృతి.కామ్ ని చదవగలరు 



Thursday, April 11, 2013

రామ్@శృతి.కామ్


ముందుగా అందరికీ " శ్రీ విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు " 

నా తొలి నవల రామ్@శృతి.కామ్ విడుదల అయ్యిందని చెప్పటానికి చాలా సంతోషిస్తున్నాను. కొత్తగా సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరిన ఒక అబ్బాయి అమ్మాయి మధ్య జరిగిన అందమైన ప్రేమ కధను మీ ముందుకు తీసుకు వచ్చాను. 

నవల చదవటానికి  :  http://kinige.com/kbook.php?id=1671 

నా బ్లాగులోలా కాకుండా, ఆ నవలలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే. ఎవ్వరినీ ఉద్దేశించి కాదని మనవి. ఇది మిమల్ని తప్పక అలరిస్తుందని ఆశిస్తున్నాను. 

మీ కంప్యూటర్స్ , సెల్ ఫోన్స్ , ట్యాబ్లెట్స్ (నోట్లో వేసుకొనేవి కావు) ఇలా దేనిలో అయినా చదవవచ్చు. 

'ఎలా చదవాలి?' అనే సందేహాల కోసం http://kinige.com/help.php సందర్శించండి.

Windows Machine : Install Adobe Digital Editions (ADE)  Software

 IOS (Ipod/ Iphone/ Ipad) : Install Bluefire Reader from App Store

Android ( Samsung and other mobiles/ Tablets) :  Follow steps in http://enblog.kinige.com/?p=1431

ఇంకెందుకు ఆలస్యం వెంటనే రామ్@శృతి.కామ్ చదవటం మొదలు పెట్టండి. 


ఈ కధను చదివి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 

ముఖ్య గమనిక : నవల చదివాక, పొగడదలచుకుంటే పది మందిలో పొగడండి. తిట్టాలనుకుంటే నా చెవిలో తిట్టండి 



Thursday, March 28, 2013

చంద్రం మామ

వెతకాలేకానీ, కష్టాలలో కుడా సుఖాలని వెతుక్కోవచ్చు. సాదారణంగా ఎండాకాలం అంటేనే జనాలు భయపడుతుంటారు. కానీ నాకు మాత్రం సంవత్సరంలో ఎనిమిది నెలలు ఎండాకాలం, నాలుగు నెలలు వర్షాకాలం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఈ ఎండాకాలంలో పొందే అతి గొప్ప  సుఖం, ఆరు బయట నిద్రపోవటం.

నాలుగు గోడల మధ్య నాలుగు రెక్కల ఫ్యానును చూస్తూ నిద్రపోవటం అలవాటైన తరువాత, ఆరు బయట లెక్కకు అందని చుక్కలని లెక్కేస్తూ పడుకునే అదృష్టం, అందునా హైదరాబాదు లాంటి మహానగరంలో, ఎంతమందికి దొరుకుతుంది? అస్సలు ఆ ఆలోచన ఎంతమందికి ఉంటుంది? దేవుని దయ వల్ల, ఆరు బయట మేడ మీద నిద్రపోయే అదృష్టం నాకు దక్కుతున్నందుకు ఆనందిస్తున్నాను. ఇదే విషయాన్ని నా స్నేహితుడొకడికి చెప్తేను, "ఆరు బయట ఎలా నిద్రపడుతుంది రా? దోమలు కుట్టటంలేదా" అని అడిగాడు.  ఈ ఎండలకు మనుషులే బ్రతకలేక పోతున్నారు, ఇంక దోమలెక్కడ ఉంటాయి చెప్పండి  

అందునా పౌర్ణమికి నాలుగు రోజులు అటు, ఇటు, వెన్నెలను ఆశ్వాదిస్తూ పడుకుంటే ...., అది మాటలలో చెప్పలేని ఆనందం. నిన్న పౌర్ణమి నాడు చంద్రం మామని చూస్తూ పడుకున్నాను. చంద్రుని మీద పాటలు ఒక దాని తర్వాత ఒకటి గుర్తుకు వచ్చాయి. పురాతన కాలం నాటి "కలువకు చంద్రుడు ఎంతో దూరం" నుండి నిన్న, మొన్న చంద్రుడి మీద విడుదలైన పాటల వరకు, పదిహేనుకు పైగా గుర్తుకు వచ్చాయి. వాటన్నింటినీ పాడుకుంటూ, చంద మామనే చూస్తూ, నిద్రలోకి జారే ప్రయత్నం చేశాను.

మా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు, రామాయణం చెప్తూ, "ఈ సృష్టిలో మూడింటిని ఎంత చూసినా, ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అవి 1. ఏనుగు, 2. సముద్రం, 3. నిండు చంద్రుడు" అని సెలవిచ్చారు. నిజమే ఈ చంద్రుడిని ఎంత సేపు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. తదేకంగా చూస్తునప్పుడు నా దృష్టి చంద్రుడిలో ఉన్న మచ్చపై పడింది. "చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా?" అని శాస్త్రి గారు రాశారు. కానీ నాకేందుకో ఆ ఆకారం కుందేలు లాగా అనిపించదు. తల్లి ఒడిలో చంటి పిల్లాడు నిద్రపోతునట్టు ఉంటుంది. మెల్లగా నిద్రలోకి జారుకుంటుండగా, "అల్లుడూ" అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఈ సమయంలో ఎవరా అని కళ్ళు తెరచి చూస్తే, ఆకాశంలో చంద్రుడు మాయమయ్యాడు, ఎదురుగా ఒకతను, సర్వాభరణములతో ప్రత్యక్షం అయ్యాడు. "ఎవరు మీరు?" అని అడిగాను. "నేను అల్లుడూ, చందమామని" అని చెప్పటంతో అవాక్కయాను.

కొద్దిగా ధైర్యాన్ని కూడగట్టుకొని, "పౌర్ణమి రోజున పైన ఉండకుండా కిందకి వచ్చారేంటి స్వామి? అప్రైసల్స్ లేవు కదా, పని ఎగ్గొట్టినా ఏమీ కాదన్న ధైర్యమా?" అని అడిగాను. "ఏమి చెప్పమంటావు రామా? ఈ మధ్య పరిస్థితులు ఎమీ బాగోలేవు. పాటలు రాసుకోవటానికి, పండగలు జరుపుకోవటానికి తప్ప నేనెందుకూ ఉపయోగపడటం లేదు. బొత్తిగా పట్టించుకునే వారే లేరు.అప్పుడప్పుడు నీ లాంటి పని పాటా లేనోళ్ళు తప్ప ఎవ్వరూ పలకరించటం లేదు" అని బాధను వ్యక్తపరిచాడు. ఏమో అనుకున్నాను, చంద్రం మామకి చమత్కారం ఎక్కువే.., చంద్ర మండలంలో కుడా త్రివిక్రం సినిమాలు ప్రదర్శిస్తున్నారు కాబోలు??  

 "నిజమే స్వామీ,ఈ మధ్య మేమంతా పుస్తకాలకు, ముఖం పుస్తకాలకు పట్టించుకుంటున్నామే తప్ప ప్రకృతిని పెద్దగా పట్టించుకోవటం లేదు. అన్నట్టు, మీకు మాత్రమే కాదు, మీ పేరు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు, దానికి బాబుగారు, కెసియార్ గారే సాక్షి" అన్నటంతో, ఆయను కూడా దీర్ఘంగా నిట్టూర్చారు.  "స్వామీ, నీ పైన కూడా స్థలాలు అమ్ముతున్నారని విన్నాను, నిజమేనా??" అని అడిగాను. "నిజమే నాయనా, కాకపోతే అక్కడ కూడా భూం పడిపోయింది. బొత్తిగా బేరాలు లేవు" అన్నారు.

"ఇంతకీ మీ అక్కా, బావా ఎలా ఉన్నారు?" అని అడిగాను. "వారెవరు నాయనా?" అన్నారు. "'జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ' కదా, ఆ అమ్మకు తమ్ముడివి కాబట్టే నిన్ను అందరూ మామ అంటారేమో అనుకున్నాను, క్షమించండి స్వామీ" అన్నాను. "వారికేమి నాయనా, మొన్న శివరాత్రికి కొద్దిగా అలసిపోయారు, ఇప్పుడు జనాలు మర్చిపోయారు కదా, బాగానే ఉన్నారు. ముఖం పుస్తకం అని ఇందాక ఏదో అన్నావు, కైలాసంలో పరమేశ్వరుడు కూడా దీని గురించే చెప్తూ ఉంటారు., దానిని ఒక్కసారి చూడాలని ఉంది" అని అనటంతో రెండో సారి అవాక్కయ్యాను.శివుడు కూడా ముఖం పుస్తకం వాడతాడు అని తెలియక, "పది నిముషాలలో శివుని ఫొటో లైక్ చేయండి, అదృష్టం వరిస్తుంది" అని ఫొటో కనపడినా , నేను లైక్ చేయలేదు, ఈ విషయం శివుడు మనసులో పెట్టుకుంటాడెమో. "మీ మంచికోసమే చెప్తున్నాను, ముఖం పుస్తకం గురించి మర్చిపో మామా, ఒకసారి తగులుకుంటె ఇక మీకు ప్రతి రోజూ అమావాస్యే" అని హెచ్చరించటంతో ఊరుకున్నాడు.  

మా మధ్య పెరిగిన పరిచయాన్ని అలుసుగా తీసుకొని, "మామా నీకు పెళ్ళి ఈడుకి వచ్చిన కూతురు ఉంటె చెప్పు, ఇప్పటికే వయసు మించిపోతుంది అంటున్నారు" అని అడిగానో లేదో, మళ్ళీ ఆకాశాన చంద్రుడు ప్రత్యక్షమయ్యాడు, తెలివిగల్ల మారాజు.

Sunday, March 24, 2013

ఈకల బంతి


"ఆరోగ్యమే మాహాభాగ్యం" అని చిన్నప్పుడు చదువుకున్నాము. ఆరోగ్యం బాగుండాలి అంటే ఏదో ఒక వ్యాయామం చేయటం తప్పనిసరి. మనం చేసే ఉద్యోగం ఏంటి? సాఫ్ట్ వేర్, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్ట ఉండదా? మీ అందరికీ సిక్స్ ప్యాక్ ఉన్నాయా? రేపు పొద్దున నాకు పొట్ట రాదనీ ఎవరైనా గ్యారెంటి ఇవ్వగలరా?? అందుకే ఏదో ఒక వ్యాయామం తప్పని సరి అనిపించి షట్టిల్ (ఈకల బంతాట) ఆడటం మొదలు పెట్టాము.

షట్టిల్ ఆటనే ఎందుకు ఎంచుకున్నామంటే?? గత ఒలంపిక్స్ లో సైనాకి పతకం వస్తుందని తను ఆడిన ఆటలన్నీ క్రమం తప్పకుండా చూశాను. అనుకున్నట్టు గానే తను పతకం సాదించింది. దానితో ఆట మీద ఆశక్తి ఇంకా పెరిగింది.  రోజు సాయంత్రం సైనా ఆడే "పుల్లెల గోపి చంద్ అకాడమీ"కి వెళ్లి ఆడటం మొదలు పెట్టాము.

అక్కడికి వెళ్లిన మొదటి రోజున ఏ  అమ్మాయిని చూసినా సైనా లాగానే కనిపించింది. చివరికి ఒక అమ్మాయిని సైనా అని ఖాయం చేసుకున్నాం. తర్వాత రోజు ఉదయాన్నే ఈనాడులో, సైనా అదేదో దేశంలో ఆట గెలిచిందని చదివి నాలుక కరుచుకున్నాను.  ఆ తరువాత ఒక వారానికి నిజంగానే సైనా ఆటను చూడగలిగాము. ఆమె సాధన చేస్తుంటే, కొద్దిగా దూరంలో మా ఆట మేము ఆడుకున్నాము. బహుశా మా ఆట చూసిందేమో, ఆ రోజు నుండి ఇంతవరకు ఒక్క పోటీ కుడా సాంతం గెలవలేదు.

అక్కడ ఏడెనిమిది సంవత్సరాల వయసున్న పిల్లల దగ్గరనుండి చాలా మంది పిల్లలు సాధన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఇలాంటి పిజికల్ గేమ్స్ ఆడటం నేను చూడలేదు. పది సంవత్సరాల పిల్లలు కూడా ముఖం పుస్తకంలో "పొలం పల్లెటూరు" (farmville) , "పట్టణం పల్లెటూరు" (cityville) , "ముఠా యుధాలు" (mafia wars) ఇలాంటివే ఎక్కువ ఆడుతున్నారు.

ఈ విషయమై మొన్ననే ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఒక స్నేహితుడితో చాలా సేపు చర్చించి, ఒక తీర్మానం చేశాము. బడిలో ప్రతి పిల్లకి / పిల్లగాడికి తప్పని సరిగా ఒక ఆట, ఒక పాటలో శిక్షణ ఇవ్వాలి. పాట అంటే, సంగీతమో, సాహిత్యమో , బొమ్మలేయటమో అనే నా కవి హృదయాన్ని మీరు అర్ధం చేసుకున్నారని ఆశిస్తున్నాను.

 ఈ షట్టిల్ చూడటానికి చాలా తేలికగా ఉన్నా ఆడటం చాలా కష్టం. ఏ క్రికెట్ ఆడితేనో, ఫుట్ బాల్ ఆడితేనో దెబ్బలు తగిలితే తల్లి బిడ్డ న్యాయం. షట్టిల్ ఆటలో కుడా దెబ్బలు తగులుతున్నాయి. ఆ దెబ్బలన్నీ ఆటలో అరటిపండు అనుకొని ముందుకు పోతున్నాను.

Monday, February 25, 2013

బాలు, నీకు ఖాయం జైలు

బాల సుబ్రహ్మణ్యాన్ని జైలులో పెట్టాలని నేను బలంగా కోరుకుంటున్నాను. దానికి కారణం చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. బుదవారం టి.వి లో వచ్చే పాటల కార్యక్రమాన్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అంతా బాగానే ఉంటుంది కానీ, వాళ్ళు ఇచ్చే మార్కులే, వేలల్లో ఉండటం కొంచం అతి అనిపిస్తూ ఉంటుంది. 

ఒక రోజు అదే కార్యక్రమం చూస్తుంటే "రాలి పోయే పువ్వా నీకు రాగాలెందుకే" అనే పాట పాడారు. గురువుగారి పాట, అందునా జాతీయ బహుమతి గెలిచిన పాట కావటంతో జాగ్రత్తగా విన్నాను. కొన్ని నోడ్స్ డైరెక్ట్ గా హిట్ చేయలేదు. శృతి కొన్ని చోట్ల షార్ప్ అయ్యింది. టెంపో అక్కడక్కడ మిస్ అయ్యింది. అతి కోకీల అక్కాయి చెప్పినట్టు ఇంకొంచం పెప్పీగా ఉండచ్చు. సరే ఇలాంటి చిన్న చిన్న తప్పులు మినహాయిస్తే మొత్తానికి బాగానే పాడారు. 

కాకపోతే ఆ పాట మొదలైన కాసేపటికే అక్కడ ఉన్న వాళ్ళంతా ఏడవటం మొదలు పెట్టారు. అది చూసి నాకు ఆశ్చర్యమేసింది. ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే ఏమో అనుకోవచ్చు, కానీ ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చేసరికి నాకు మొదట నవ్వొచ్చింది. అస్సలు ఒక పాట అంతలా ఎక్కిళ్ళు పెట్టి ఏడిపించగలదా?? మీరు ఎప్పుడైనా పాటకి ఏడ్చారా?  

మనస్సు కొంచం బాగోలేక (నేను మనిషినే, నాకు కూడా మనోభావాలు ఉంటాయి, అవి అప్పుడప్పుడు దెబ్బ తింటుంటాయి)  యూట్యూబ్ లో, ఇదే కార్యక్రమం చూస్తుంటే, బాలుగారు సినిమాలో పాడిన "హాయి హాయి వెన్నెలమ్మ హాయి" అనే  పాట పాడటం విన్నాను. ఇదివరకు ఈ పాటను, అతి కోకిల అక్కాయి(ఎవరో అర్ధం కాకపోతే నేనేమి చేయలేను) బాలు గారితో చేసిన  ఒక కార్యక్రమంలో, బాలుగారు ఈ పాట పాడగా విన్నాను. వెంటనే బాలుగారు సినిమాలో పాడిన పాటను దిగుమతి చేసుకొని విన్నాను, విన్నాను, అలా వింటూనే ఉన్నాను. మీరు కూడా ఒకసారి తప్పక వినాలి.  ఇది వరకే వినుంటే నా అజ్ఞానాన్ని మన్నించాలి. 

ముఖ్యంగా ఆ పాట , బాధలో ఉన్న ఎవరికైనా సేద తీర్చగల పాట.  

హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి,  హాయి హాయి..., హాయి..., హాయి...,
తియ్య తియ్యనైన పాట పాడనీయి, బాధ పోనీ రానీ హాయి 
చురుకుమనే మంటకు మందును పూయమని 
చిటికెలలో కలతను మాయము చేయమని 
చలువ కురిపించని  ఇలా ఇలా ఈ నా పాటని 

ఎంత బాగా రాశారు శాస్త్రిగారు?? బాధ కలిగించే మంటకు మందును పూసి, చిటికెలో కలతను మాయము చేయమని, అబ్బబ్బబ్బబా  పాట వింటుంటేనే బాధ ఎటుపోయిందో అర్ధం కాలేదు.  ఇదే అనుకుంటే చరణాలు మరీను. 

కనులు తుడిచేలా, ఊరడించి ఊసులాడే భాషే రాదులే 
కుదురు కలిగేలా, సేవ జేసి సేద తీర్చే ఆశే నాదిలే 
వెంటనే నీ మది, పొందని నెమ్మది
అని తలచే ఎద సడిని పదమై పలికి మంత్రం వేయని
ఈ పాటని ఈ పాటికి ఓ ఐదు వందల సార్లు వినుంటా!! వెయ్యికి పరుగులు తీస్తున్నా!! ఈ బాల సుబ్రహ్మణ్యం మనల్ని పనులు చేసుకోనివ్వడా?? వేటూరి గారితో అయితే ఒక రోజు అనుకున్నా, ఇతగాడి గురించి రాయాల్సి వస్తే, నిముషానికి అరవై పాటలు గుర్తుకొస్తాయి. అందుకే గుండె అనే జైలులో మనందరికీ ఎప్పుడో బందీ అయిపోయాడు. 

ఇంతకీ నేను ఏ బాధలో ఉండి ఈ పాటను విన్నానో అని ఎవరికైనా తెలుసుకోవాలనుందా??? చెప్పిన ముఖ్యమైన విషయాలన్నింటిని వదిలేసి, ఇటువంటి అనవసరమైన విషయాలను అడిగేవాళ్ళని ఏమంటారో, జల్సా సినిమాలో ఇంకో సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడో చెప్పారు.   


Sunday, February 3, 2013

వేటూరిగారితో ఒక రోజు

ఉదయాన్నే నిద్రలేచి మేడ మీద నిలబడి చూస్తే, మొత్తం పొగ మంచుతో కప్పేసి ఉంది. చలికాలం ఒంటికి చలి కోటు ఉండనే ఉన్నది. ఆ మంచు చూసి, నా గదిలోకి వెళ్లి ఒక శాలువా కప్పుకొని బయటకు వచ్చి "ఆమని పాడవే హాయిగా., మూగవై పోకు ఈ వేళా" అని ఎవ్వరికీ వినపడకుండా మూగగా పాడుకున్నాను. కార్యాలయానికి పోయే కాలం దగ్గర పడటంతో స్నానానికి వెళ్లాను. నీళ్ళను చూడగానే గోదావరి, గోదావరి సినిమా, ఆ సినిమాలో పాటలు వెనువెంటనే గుర్తుకు వచ్చేశాయి.

స్నానం చేసి పూజకి కూర్చొని "అస్త్రాయ ఫట్" అనే మంత్రం దగ్గరకు వచ్చే సరికి "నంది కొండ వాగుల్లో" పాట గుర్తుకొచ్చి తెగ ఇబ్బంది పెట్టేసింది. ఇంటి బయటకు రాగానే, ఇంటి ముందు "నందివర్దన" చెట్టుకి రాలి పడిపోయిన పూలను చూసి "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?" అని అడిగాను.

కార్యాలయంలోకి రాగానే "సునేత్ర" అని నా స్నేహితుడు ఎదురు పడ్డాడు. అదేదో విచిత్రం పేరులో మాత్రమే వీడి కళ్ళు బాగుంటాయి. కళ్ళజోడు తీస్తే ఏమీ కనపడదు. ఉద్యోగం చేయటానికి కలకత్తా నుంచి కళ్ళేసుకొని వచ్చాడు. వాడిని చూడగానే, "యమహా నగరి, కలకత్తా పూరి" అని చిరు త్యాగరాజు లాగా పాడుకున్నా. కంప్యూటర్ తీసి చూస్తె, స్నేహితుడు ఒకడు తన పెళ్లి శుభలేఖ పంపాడు, "శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎప్పుడో" పాత పాట  అని పాడుకున్నా. ఇంతలో ఒకమ్మాయి పుట్టిన రోజని చాక్లెట్లు తీసుకు వచ్చింది., అహో ఒక మనసుకి నేడే పుట్టిన రోజనుకున్నాను.

మెల్లగా పనిలో మునిగిపోయాను. కాసేపటికి కొంత మంది పైనోళ్ళు హిందీలో ఏదో గోల గోలగా మాట్లాడుకుంటున్నారు. వెంటనే నాకు "ఇదేదో గోలగా ఉంది" అనిపించింది. కాసేపటికి వేణు అని నా స్నెహితుడు ఫొను చేశాడు, "వేణువై వచ్చాను భువనానికి..." అనే పాట గుర్తొచ్చింది.

భోజనానికి వెళ్ళేసరికి వంకాయ కూర స్వాగతం పలికింది. "ఆహా ఎమి రుచి, అనరా మైమరచి, తాజా కూరలలొ రాజా ఎవరంటే?? ఇంకా చెప్పాలా?? వంకాయేనండి". అన్నం తిని చల్లగాలి పీల్చుకోవటానికి కార్యలయం బయటకి వచ్చాను. ఒక అందమైన అమ్మాయి ఎదురుపడింది. తనను ఎక్కడో చూసినట్టు గుర్తు, "బహుశా తనని బందరులో చూసి ఉంటా!"

సాయంత్రం కార్యాలయం నుండి బయలుదేరి వస్తుంటే, అస్తమిస్తున్న ఎర్రని సూర్యుడిని చూడగానే "అకాశాన  సూర్యుడుండడు సంధ్య వేళకే" అని అర్ధం అయ్యింది.ఆ రోజు పౌర్ణమి తర్వత రెండో రోజు అనుకుంటా, వెన్నెల ధార కురుస్తున్నది. "ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ","మౌలమేలనోయి ఈ మరపు రాని రేయి","వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా?","మల్లెలు పూసే, వెన్నెల కాసే","కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి"ఇలా ఎన్నో పాడుకున్నాను.ఇలా ఒక రోజులో, వేటూరిగారి కలం నుండి జాలువారిన ఎన్నో పాటలు గుర్తుకు వచ్చాయి.

Sunday, January 20, 2013

తెగులు వచ్చిన 'నాయక్' తెలుగు పాటలు

గత నెలలో జరిగిన ప్రపంచ మహా సభలు ఘనంగా ముగిశాయి. ముఖం పుస్తకంలో కూడా దాని గురించి అంతా మర్చిపోయారు. ఆ మహాసభలలో చిరంజీవిగారు చాలా చక్కగా మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ, " తెలుగు బాష ఇలాంటి సభల వరకే పరిమితం అవుతున్నది అని ఎన్నో సార్లు నాకు భాదగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి సభలు జరగటం అన్నది మనం స్పూర్తిగా తీసుకోవాలి. తెలుగుని మన భావి తరాలకి ఆస్తిగా అందివ్వాలి " అని చాలా చక్కగా అచ్చ తెలుగులో చెప్పారు.  నమ్మకం కలగకపోతే  యుట్యూబ్ లో వెతికి చూడండి. ఆ మాటలకు, తెలుగుకి ఇంక తెగులు ఉండదు అన్న నమ్మకం కలిగింది.

" రామ్ చరణ్ కొత్త సినిమా 'నాయక్' పాటలు విన్నావారా? చాలా బాగున్నాయి" అని 'నా' సామాజిక వర్గానికి చెందిన నా స్నేహితుడొకడు చెప్పటంతో వాటిని విన్నాను.

 "హేయ్ నాయక  తూ హే లవ్ నాయాక్, తుజ్ సే దిల్ డోలక్, దన్ దనాదన్ తీన్ మారే" అని మొదటి పాట మొదటి వాఖ్యం విని, అప్పుడెప్పుడో రామ్ చరణ్ హిందీ సినిమా తీస్తున్నాడని వార్తల్లో వచ్చింది. బహుశా ఆ సినిమానే 'నాయాక్' కాబోలు అనుకున్నాను. 'నాయక్' అనే పేరు కుడా హిందీ పేరులాగానే తోచింది. కాని ఆ తరువాత ఆ పాటలో రెండు మూడు తెలుగు పదాలు తగిలేసరికి అనుమానం వచ్చింది. ఇది తెలుగు సినిమానా? హిందీ సినిమానా అని.

రెండో పాటకు వచ్చాను. "లైలా ఓ లైలా ఆ జారే లైలా, ఆజా ఓ మేరీ లాలా. దీవానా మై దీవానా" అని నా అనుమానాన్ని రెట్టింపు చేసింది. కానీ ఈ పాటలో కుడా మళ్ళీ తెలుగు పదాలు తగిలే సరికి ఇది తెలుగు సినిమానే అని నిర్ధారణకు వచ్చాను.  ఈ పాట మొత్తం నాలుగు హిందీ మాటలు, ఒక తెలుగు పదం, మధ్య మధ్యలో ఆంగ్ల పదాలతోనే సాగింది.

మూడో పాట, మొదలు పెడుతూనే ఆంగ్లమో "ఓ మై డాగ్, ఫీల్ ద వే" అని ఏదో వినపడింది. ఆ తరువాత "కత్తి లాంటి పిల్లా  కస్సు  మెరుపులా" అని తెలుగులోకి వెళ్లి, మరలా "మేడమ్ మేడమ్ మేడమ్, జస్ట్ బీ మై బీ మై మేడమ్" అని ఆంగ్లంలో కాసేపు వాయించి అవతలేశాడు.

ఇంక నాలుగో పాట.., పాట విన్న ఒకే ఒక్క క్షణంలో అర్ధం అయిపొయింది, ఆ పాట కొండవీటి దొంగలో "శుభలేఖ రాసుకున్నా" అని. కొంపతీసి ఈ పాటను కూడా "శుభలేఖ లిఖేంగే హిందీ మే హమ్ " అని మార్చి రాశారేమో  అని భయమేసింది. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. పాట మొత్తం డబ్బాలో రాళ్ళు వేసి కొట్టినట్లు ఉన్నది తప్ప, పాత పాట అంత హాయిగా లేదు. పైగా బాలుగారి గొంతుతో పాటని వందల సార్లు విని, ఇప్పుడు వేరెవరో పాడితే జీర్ణించుకోవటానికి చాలా సమయమే పడుతుంది. ఈ పాట మర్చిపోవటానికి, పాత పాట ఒక వంద సార్లు వినాల్సి వచ్చింది. కానీ సినిమా చూశాక పాట తీసిన విదానం నచ్చింది. రామ్ చరణ్ ప్రతి దృశ్యం లో వాళ్ళ నాన్నని తలపించాడు.

"ఒక చూపుకి పడిపోయా" అనే పాట కూడా "దిల్ దియా", "దే దియా", "లగా దియా","చురాలియా", "మార్ దియా", "క్యా కియా" అని హిందీలో ప్రాసతో కాసేపు, అర్ధం కాని అమెరికా ఆంగ్లంతో ఇంకాసేపు, అస్సలు ఏ భాషో కూడా అర్ధం కానీ బాషలో ఇంకాసేపు సాగిపోయింది. తమన్ వచ్చాక, అస్సలు మన దేశంలో ఆ మాటకొస్తే మన ఖండంలో లేని భాషలు కూడా తెలుగు పాటల్లోకి వచ్చాయి. ఇక ఆఖరి పాట, " మై లడీ లడీ హౌరాకి , తు వడీ వడీ ఆంధ్రాకి" అని అచ్చ తెలుగులో రాసిన పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట చరణాలకు అర్ధం చెప్పగలిగిన వాళ్ళకి, బహుశా ఙానపీఠ కన్నా పెద్దది ఇంకేదైనా ఉంటే,  అది ఇచ్చేయచ్చు.

ఈ చిత్రంతో పాటే విడుదల అయిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" పేరుకు తగ్గట్టే, పాటలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదంతా చదివి నేనేదో 'క' సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నాను అనుకునేరు. నాకు ఇరు వర్గాలలోనూ స్నేహితులు ఉన్నారు. చివరకి నేను చెప్పదలచినది ఏంటంటే? "చిరంజీవి మాయ్యా!!! సినిమాల్లో, రాజకీయాల్లో సంపాదించి చెర్రికి ఇచ్చుంటారు. మీరు మొన్న తెలుగు మహా సభలో భావి తరాలకు ఆస్తి అని చెప్పినట్టు, తెలుగుని బావిలో పడేయకుండా, కాస్త భావి చిత్రాలలో తెలుగుని ఉంచమని మీ చెర్రీకి చెప్తారని ఆశిస్తున్నాను". చరణ్ హిందీ చిత్రం చేస్తున్నాడని తెలిసి చాలా సంతోషించాను. మన తెలుగువాడు, ఆ పైనొళ్ళ భాషలో, చిత్రాలు తీసి మంచి విజయం సాదించి, దేశం (తెలుగు దేశం కాదు) మొత్తం మీద మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.  

Wednesday, January 2, 2013

ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె కష్టం పొతుందా??


"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చక్కని తెలుగు పేరు కలిగిన చిత్రం. మరి ఆ చిత్రంలో తెలుగు ఎంతవరకు ఉంటుందో చూడాలి. పాటలు దాదాపు చక్కని తెలుగులో చక్కగా ఉన్నాయి. శ్రీరామచంద్ర ఇందులో మూడు పాటలు పాడాడు. అన్నీ పాటలు బాగున్నాయి. ముఖ్యంగా "మరీ అంతగా మహా చింతగా .." అనే పాట చాలా సార్లు విన్నాను. సీతారామశాస్త్రి గారు ఎంతో గొప్ప విషయాన్ని చాలా చక్కగా, అందరికీ అర్ధం అయ్యేలా రాశారు.
ఉదాహరణకు ఆ పాటలో
"కన్నీరై కురవాలా..మన చుట్టూ ఉండే లోకం తడిసేల
ముస్తాబే చెదరాలా..నిన్ను చుడాలంటె అద్దం జడిసేల"
కొంత మంది లోకం తడిసేలా మాట్లాడతారు (అర్ధం కాకపోతే మీరు అదృష్టవంతులు, అలాంటి పరిస్థితి మీకెప్పుడు రాలేదనమాట!!). అది సరే, లోకం తడిసేలా ఏడవటం ఏంటి??  నా చిన్న బుర్రకు తట్టింది ఏంటంటే? నువ్వు బాధపడుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని కుడా బాదపెట్టకు అని. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, నా గదిలో ఉండే అద్దానికే గనుక నోరు ఉంటే, రోజూ ఉదయాన్నే నా ముఖం చూపిస్తున్నందుకు నన్ను బండ బూతులు తిడుతుందేమో అని. అలాంటి అద్దమే భయపడేలా ఏడవటం ఎందుకని శాస్త్రిగారు ఎంత బాగా అడిగారు?

 "ఎక్కిళ్ళె పెట్టి ఏడుస్తుంటె కష్టం పొతుందా?? కదా!! మరెందుకు గోల??
ఆయ్యయ్యొ పాపం అంటె ఎదో లాభం వస్తుందా..వృధా ప్రయాస పడాల"
నిజమే బాధల్లో ఉంటే, ఉచితంగా వచ్చేది ఏడుపే. అలా ఏడవకు అని చెప్పటం సులభం. ఏడవకుండా ఉండటం కష్టమే. కానీ ఏడవటం వల్ల ప్రయోజనం లేదు అని మన మనస్సుకి ఒకటికి పదిసార్లు చెప్పుకో గలిగితే మనలో మార్పు రావటం మాత్రం తధ్యం. నేను కొంతమందిని చూశాను, ఎన్నో కష్టాలు ఉన్నా, పైకి ఎప్పుడూ చక్కగా, చెదరని చిరునవ్వుతో ఉంటారు. బహుశా అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం కాబోలు.

"ఎండలను దండిస్తామా.. వానలను నిందిస్తామా, చలినెటో తరమేస్తామా చి... పొమ్మని....."
ఈ వాఖ్యం మాత్రం అధ్బుతం. ముఖ్యంగా చివర్లో ఛి పొమ్మని అనే చోట నాకు ఎంత బాగా నచ్చిందో, ఒకటికి వంద సార్లు విన్నాను.

"సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం
పూటకొక పేచి పెడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతాం"
 ఇలాంటి వాళ్ళను మాత్రం రోజు చూస్తూనే ఉంటాము. మిగితా మనుషులతో కలవకపోగా, మిగితా వాళ్ళు మనుషులే కానట్టు వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు చూశాను. తరగతిలో అందరూ మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే, ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మాత్రం, "మేము రాము" అని భీష్మించుకు కూర్చునేవాళ్ళు. పైన పాటలో చెప్పినట్టు చివరకి వాళ్ళు ఏమి సాదించారు?? పెళ్లై మొగుళ్ళను సాదిస్తున్నారు.

"చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా..పెదవిపై చిగురించేలా చిరునవ్వులు
కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా చచ్చి చెడి సాధించాలా సుఖ శాంతులు"

కొంతమంది ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టు ముఖం పెడుతుంటారు, ప్రపంచంలో కష్టాలన్నీ తమకే ఉనట్టు. నవ్వుతూ పలకరించినా, తిరిగి నవ్వుతూ పలకరించలేని వాళ్ళు నాకు రోజూ కనపడుతూనే ఉంటారు. మన కిరణ్ కుమార్ రెడ్డిగారిని చూడండి, ప్రపంచంలో ఆయనకి ఉన్నన్ని కష్టాలు ఇంకెవరికైనా ఉన్నాయా?? అయినా ఎప్పుడూ కూడగా నవ్వుతూ ఉంటారు.

నవ్వుతూ ఉంటే ఎక్కువ రోజులు బ్రతుకుతారని వైద్యులు కూడా నిర్దారించారు. నాకు చిన్నప్పుడు ఎవరో చెప్పారు, పుట్టిన రోజున అందంగా ఎందుకు ఉంటారంటే,  ఆ రోజు అంతా మనకు శుభాకాంక్షలు చెప్తూ, మనం నవ్వుతూ ఆ శుభాకాంక్షలను అందుకుంటాం కనుక ఆ రోజు, మిగితా రోజులకన్నా అందంగా ఉంటామాట!!!

అసందర్భం అయినా ఒక విషయం చెప్పాలి, ప్రపంచంలో ఇబ్బంది కరమైన పరిస్తితి ఏంటంటే, జోకు వేసినప్పుడు, ఎదుటి వాళ్ళు నవ్వకపోతే, ఆ బాద వర్ణనాతీతం, తల కొట్టేసినట్టు అయిపోతుంది. అది ఎంత భాదో రోజుకి కనీసం ఒకసారి అయినా అనుభవిస్తున్న నాకు తెలుసు.

ముఖం పుస్తకంలో మనం చూస్తూ ఉంటాము, "సమస్య తీరేది అయితే, దాని గురించి బాద పడాల్సిన పని లేదు. సమస్య తీరనిది అయితే బాదపడిన ప్రయోజనం లేదు" అని. ఇంత చక్కటి పాట రాసినందుకు శాస్త్రిగారికి, పాడినందుకు శ్రీరామచంద్రకు, పాడించిన మిక్కి కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.